పిల్ల‌లంటే ‘ప‌ట్టింపు’ లేదా?

 

చిన్నారులు మ‌ట్టి ముద్ద‌ల్లాంటి వారు. మ‌ట్టిని అంద‌మైన బొమ్మ‌లుగా మ‌ల‌చొచ్చు లేదా అంద‌విహీనమైన అస్త‌వ్య‌స్థ ప్ర‌తిమ‌గానూ త‌యారు చేయ‌వ‌చ్చు. అది మ‌ట్టిని బొమ్మ‌గా మ‌లిచే కుమ్మ‌రి వాని చేతి నైపుణ్యంపై ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే త‌ణుకులీనే అంద‌మైన బొమ్మ‌లుగా మారాల్సిన చిన్నారులు కొంద‌రు నైపుణ్యం లేని నిర్ల‌క్ష్యం నిలువునా క‌మ్ముకున్న‌ త‌ల్లిదండ్రులు అనే కుమ్మ‌రి వాని చేతిలో ద‌గాకు గుర‌వుతున్నారు. అంద‌మైన బొమ్మ‌లుగా నంద‌న‌వ‌నంలో ఉండాల్సిన వారు జైళ్ల‌లో మ‌గ్గుతున్నారు. వేగంగా మారుతున్న సామాజిక, ఆర్థిక ప‌రిస్థితులు దేశంలో బాల నేర‌స్తుల సంఖ్య‌ను పెంచుతున్నాయి. ఈ ఏడాది కేవ‌లం మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 1299 మంది పిల్ల‌లు ప‌లు నేరాల్లో నిందితులుగా ఉన్నారంటే ప‌రిస్థితి తీవ్ర‌త‌ను అర్ధం చేసుకోవ‌చ్చు. ఒక‌వైపు త‌ల్లిదండ్రుల ప‌ర్య‌వేక్ష‌ణ లోపం మ‌రోవైపు ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష వైఖ‌రి వెర‌సి బాల‌ల పాలిట శాపాలుగా మారుతున్నాయి. పిల్ల‌ల పెంప‌కంలో నిర్ల‌క్ష్యం చోటుచేసుకుంటే ఎంత‌టి దారుణ ప‌రిణామాలు చోటు చేసుకుంటాయోన‌న్న‌దానికి ఈ బాల నేర‌స్తులు స‌జీవ సాక్ష్యాలుగా నిలిచారు.

 

 

ఎక్క‌డుంది లోపం?

 

ఈ ఏడాది బాల నేర‌స్తులుగా శిక్ష అనుభ‌విస్తున్న వాళ్ల‌లో అధిక శాతం మంది దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు చెందిన‌వారే. పేద‌రికం, త‌ల్లిదండ్రులు స‌రిగ్గా ప‌ట్టించుకోక‌పోవ‌డం వీరు నేరస్తులుగా మార‌డానికి ప్ర‌ధాన కార‌ణం. వీరిలో అధిక శాతం మంది దొంగ‌త‌నం కేసుల్లో నిందితులుగా తేల‌గా, మిగిలిన వారు మ‌హిళ‌ల‌ను కించ‌ప‌ర్చ‌డం, లైంగిక నేరాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరంతా ప‌ద‌హారేళ్ల లోపు వ‌య‌స్సు వారే కావ‌డం విశేషం. పెంప‌కంలోని నిర్ల‌క్ష్యం, లోపాలు ఎంత‌టి విప‌రిణామాల‌కు దారితీస్తాయ‌న్న‌ది వీళ్ల దీన గాధ‌ల‌ను వింటే అర్ధ‌మ‌వుతుంది. వీళ్ల‌లో చాలా మంది ప్రాథ‌మిక స్థాయిలోనే విద్య‌కు ఫుల్ స్టాప్ పెట్టిన వారే. త‌ల్లిదండ్రుల ప‌ర్యవేక్షణ లేక‌పోవ‌డం, వ‌య‌స్సు వ‌ల‌న వ‌చ్చే ఆక‌ర్ష‌ణ‌ల‌కు లోను కావ‌డం, జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డి డ‌బ్బు కోసం నేరాలు చేయ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. వీరు ఇలా దారి త‌ప్పి నేర‌గాళ్లుగా మార‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏంట‌ని అడ‌గాల్సి వ‌స్తే అది క‌చ్చితంగా త‌ల్లిదండ్రుల ప‌ర్య‌వేక్ష‌ణ లోప‌మే అని చెప్పాల్సి వ‌స్తుంది. పిల్ల‌లు ఏం చేస్తున్నారు? ఏ విధ‌మైన వైఖ‌రితో ఉన్నారు? అన్న‌ది ఎప్ప‌టిక‌ప్పుడు ఒక కంట క‌నిపెట్టి ఉండాల్సిన త‌ల్లిదండ్రులు వాళ్ల‌ను నిర్ల‌క్ష్యంగా వ‌దిలేయ‌డం వ‌ల‌న వ‌చ్చిన విప‌రిణామాలే ఇవ‌న్నీ.

 

 

ఆదర్శంగా లేకపోతే మంచి తల్లిదండ్రులు కాలేరు!

 

తెలుగులో ఒక సామెత ఉంది. మాట‌లు కోట‌లు దాటుతాయ్ కానీ కాళ్లు గ‌డ‌ప కూడా దాట‌వు అని. కేవ‌లం ఆద‌ర్శాలు మాత్ర‌మే వ‌ల్లిస్తే జాతి నిర్మాణం జ‌ర‌గదు. ఇక్క‌డ జాతి నిర్మాణం అంటే మ‌నం పిల్ల‌లు అనే అర్ధంలో వాడుతున్నాం. కేవ‌లం సూక్తులు, ప్ర‌భోధాల ద్వారా జాతి నిర్మాణం జ‌రిగేది ఉంటే అది ఎప్పుడో జ‌రిగిపోయేది. కానీ పిల్ల‌ల‌కు కావాల్సింది త‌ల్లిదండ్రుల ప‌ర్య‌వేక్ష‌ణ కానీ ప్రభోధాలు కాదు. చాలా మంది త‌ల్లిదండ్రులు ఏ విధంగా ప్ర‌వ‌ర్తిస్తారు అంటే మేం ఏం చెపుతున్నామో అది పాటించండి కానీ మేం చేస్తున్న‌ట్టు మాత్రం చేయ‌కండి. అన్న రీతిలో ఉంటారు. ఈ విధ‌మైన ప్ర‌వ‌ర్త‌న ఎప్ప‌టికీ స‌రైన పెంప‌కం అనిపించుకోదు. ఎందుకంటే పిల్ల‌ల‌కు తొలి గురువులు త‌ల్లిదండ్రులే. పిల్లలు ఏ విష‌య‌మైనా త‌ల్లిదండ్రుల‌ను చూసే నేర్చుకుంటారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఆద‌ర్శంగా ఉండ‌టం చేత‌కాక‌పోతే ఎవ‌రైనా మంచి త‌ల్లిదండ్రులు అనిపించుకోలేరు.

 

 

విలువ‌లు నేర్పించ‌డం మ‌ర్చిపోతున్నారు!

 

ఒక పిల్ల‌వాడికి మొట్ట‌మొద‌టి పాఠ‌శాల అత‌ని ఇళ్లు. మొద‌టి గురువు త‌ల్లీదండ్రులు. కాబ‌ట్టి చిన్న‌త‌నం నుంచే పిల్ల‌ల‌కు స‌రైన విలువ‌లు నేర్పించాలి. పెద్ద‌ల‌ను, ఇంటికి వ‌చ్చిన అతిధిని ఎలా గౌర‌వించాలి? సాటి మనుష్యులతో ఎలా మెలగాలి? డబ్బులు ఎలా ఖర్చు చేయాలి? మర్యాదలు ఎలా పాటించాలి? అన్న విషయాలు నేర్పించాలి. ఒక తత్వవేత్త ఈ విధంగా చెప్పాడు. ఏ పిల్లవాడు విలువలతో పుట్టడు. అతనికి తల్లిదండ్రులు విలువలు నేర్పిస్తే వాటికి గురువులు హంగులు అద్దుతారు. అని చెపుతాడు. విలువలు అనేవి కేవలం తల్లిదండ్రులు మాత్రమే నేర్పే జీవిత పాఠాలు. ఈ పాఠాలు నేర్పించడంలో కొందరు తల్లిదండ్రులు విఫలం కావడం మూలంగానే బాల నేరస్తులు తయారవుతున్నారు. పెంపంకంలో పిల్లలకు ఎంత మంచి వాతావరణం కల్పిస్తున్నామన్న దానిపైనే వారి శీల నిర్మాణం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం పిల్లలను పతనం అంచులకు తీసుకెళ్లేందుకు ఎన్నో ప్రలోభాలు కాచుకుని ఉన్నాయి. ఆకర్షణలు, ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇలా ఎన్నో , ఎన్నెన్నో. వీటన్నింటిని నుంచి పిల్లలను కాపాడుకోవడం అన్నది ఇప్పుడు తల్లిదండ్రుల ముందున్న అతిపెద్ద సవాలు. ఈ సవాలును ఎదుర్కొంటూనే అదే సమయంలో వాళ్లకు విలువలతో కూడిన పెంపకాన్ని అందించాలి.

 

 

చేయాల్సింది చట్టాలు కాదు సంస్కరణలు!

 

బాల నేరస్తుల సంఖ్య ఏయేటికాయేడు పెరిగిపోతుందని కొద్ది సేపు బాధపడటం తర్వాత ఆ సమస్యను మర్చిపోవడం చేస్తే పరిష్కారాలు ఎప్పటికీ దొరకవు. బాల నేరస్తుల సంఖ్యను తగ్గించడానికి ఏవో అరకొర చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే ప్రభుత్వాల పని అయిపోదు. ఒక పిల్లవాడ్ని ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులకు అవగాహన పెంచాలి. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాల్లో పిల్లల పెంపకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పాలి. తల్లిదండ్రుల దృక్కోణంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలి. ఇక పెంపకంలో తల్లిదండ్రులదే ప్రధాన పాత్ర. ఒక పిల్లవాడు చెడు మార్గం పట్టాడంటే కచ్చితంగా అది పెంపకం లోపమే. ఈ విషయంలో తల్లిదండ్రులు తమకు తెలియని విషయాలను నిపుణుల సలహాలను తీసుకుని తెలుసుకోవాలి. పెంపకంలో రాజీ వద్దు. ఎందుకంటే సరైన పెంపకం లేని పిల్లవాడి వలన అతని తల్లిదండ్రులు మాత్రమే కాదు సమాజం కూడా బాధించబడుతుంది.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)