ఆలోచించండి ఓ అమ్మా నాన్నా..!!

 

ఈ సృష్టిలో ప్ర‌తీ జీవీ త‌న పిల్ల‌ల‌పై అమిత‌మైన ప్రేమ‌ను క‌లిగి ఉంటుంది. అంతెందుకు ర‌క్తం తాగే క్రూర జంతువులు కూడా త‌మ పిల్ల‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాయి. త‌న పిల్ల‌ల‌కు హాని క‌లుగుకుండా ప్రాణాలను ఫ‌ణంగా పెట్టి కాపుకాస్తాయి. అయితే ప్రాణుల‌న్నింటిలోకి ఉన్న‌తుడ్ని అని చెప్పుకునే మ‌నిషి మాత్రం నోరులేని జంతువులు చూపిస్తున్న పాటి ప్రేమ‌ను త‌న పిల్ల‌ల‌పై చూపించ‌లేక‌పోతున్నాడు. పిల్ల‌ల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తూ పాశ‌వికంగా హింసించే త‌ల్లిదండ్రులు రోజురోజుకీ పెరిగిపోవ‌డ‌మే దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. చెప్పిన మాట స‌రిగ్గా విన‌లేద‌ని గ‌దిలో పెట్టి చిత్ర‌హింస‌లు పెట్టే త‌ల్లిదండ్రులు కొంద‌రైతే, త‌మ స‌ర‌దాల‌కు అడ్డు ప‌డుతున్నార‌ని వాళ్ల‌ను దారుణంగా వేధిస్తున్న వాళ్లు మ‌రికొంద‌రు. హైద‌రాబాద్ లో ప్ర‌త్యూషను పిన‌త‌ల్లితో క‌లిసి గృహ నిర్భందం చేసి తండ్రి ఎన్ని హింస‌లు పెట్టాడో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌త్యూష ఒక్క‌ర్తే కాదు ప్ర‌త్యూష లాంటి ఎంద‌రో చిన్నారులు స్వంత త‌ల్లిదండ్రుల చేతుల్లోనే న‌ర‌కం అనుభిస్తున్నారు. స‌మాజంలో వ‌స్తున్న విప‌రీత మార్పుకు ఇది ఓ సంకేతంలా క‌నిపిస్తోంది. ఇంటి నుంచి స్కూల్ వ‌ర‌కూ ఎన్నో వేధింపులకు గుర‌వుతున్న బాల‌లు సొంత పేరెంట్స్ చేతిలో కూడా వేధింపుల‌కు గురైతే ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం.

 

 

ఈ మానసిక వైక‌ల్యం భావి త‌రాల‌కు శాపం!

 

ఎంత‌కీ ఏడుపు ఆప‌డం లేద‌ని ఏడాదిన్న‌ర వ‌య‌స్సున్న త‌న కూతుర్ని డ్రైనేజీలోకి విసిరేసాడు ఓ పాపిష్టి తండ్రి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిందీ ఈ దారుణ సంఘ‌ట‌న‌. బెంగ‌ళూరులో త‌నను విసిగిస్తోంద‌ని క‌న్న కూతుర్నే బిల్లింగ్ మీద నుంచి కింద‌కు విసిరేసింది మ‌రో త‌ల్లి. ఇవి కొన్ని ఉదాహ‌ర‌ణలు మాత్రమే. ప్ర‌తీ రోజు చాలా మంది చిన్నారులు త‌ల్లిదండ్రుల చేతుల్లో హింస‌కు గుర‌వుతున్నారు. కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన త‌మ చిన్నారుల‌ను త‌ల్లిదండ్రులు ఎందుకు వేధిస్తున్నార‌న్న‌దే ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తున్న విషయం. పిల్ల‌ల‌ను వేధిస్తున్న త‌ల్లిదండ్రుల సంఖ్య ప్ర‌తీ ఏడాది పెరుగుతూనే ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా చేసిన స‌ర్వేను తీసుకుకుంటే ప్ర‌తీ 10 మంది పిల్ల‌ల్లో 5 గురు మానసిక హింస‌కు గుర‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. కొంద‌రు త‌ల్లిదండ్రులు పిల్ల‌ల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంటే మ‌రికొంద‌రు ఎమోష‌న‌ల్ గా శారీర‌కంగా వారిని హింసిస్తున్నారు. ముఖ్యంగా క్ర‌మ‌శిక్ష‌ణ పేరిట చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ‌కు తెలియ‌కుండానే పిల్ల‌ల‌ను హింస‌కు గురిచేస్తున్నారు. మ‌రికొంద‌రు కుటుంబ క‌ల‌హాలు, ఆస్తి త‌గాదాలు నేప‌థ్యంలో పిల్ల‌ల్ని పావులుగా వాడుకుంటూ వాళ్ల‌ను హింసిస్తున్నారు.

 

 

ఎందుకు సొంత పిల్ల‌ల్నే చంపుకు తింటున్నారు?

 

గ‌డిచిన కొన్నాళ్లుగా స‌మాజంలో స్ప‌ష్ట‌మైన మార్పు వ‌చ్చింది. సామాజికంగా, ఆర్థికంగా ఉన్న‌తంగా ఉండాల‌న్న ఒక‌ర‌క‌మైన ఒత్తిడి, అవ‌స‌రం మ‌నిషికి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో భావోద్వేగాల‌ను అదుపు చేసుకోవ‌డం ఎవ‌రికీ చేత‌కావ‌డం లేదు. దీనికి తోడు పిల్ల‌ల‌ను త‌మ‌ క‌ల‌లు, ఆకాంక్ష‌లు నెర‌వేర్చే మెషిన్లుగా చాలా మంది త‌ల్లిదండ్రులు చూస్తున్నారు. అంతేకానీ వాళ్ల అభిరుచులు,ఆస‌క్తులను తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం లేదు. పైగా పిల్ల‌ల‌ను ఎమోష‌నల్ బ్లాక్ మెయిల్ చేస్తూ మాన‌సికంగా హింస‌కు గురిచేస్తున్నారు. దీంతో త‌మ‌కు న‌చ్చిన ప‌ని చేయ‌లేక‌, త‌ల్లిదండ్రుల ఆశ‌ల‌ను తీర్చ‌లేక చాలా మంది పిల్ల‌లు నలిగిపోతున్నారు. మ‌రికొన్ని కేసుల్లో త‌ల్లిదండ్రుల్లో ఎవ‌రికో ఒక‌రికి మానసిక స‌మ‌స్య‌లు ఉండ‌టంతో వాళ్లు పిల్ల‌ల‌ను అత్యంత దారుణంగా హింస‌కు గురిచేస్తున్నారు. అదే విధంగా సోష‌ల్ మీడియా వినియోగం పెరిగాక వాటి మాయ‌లో ప‌డి కొంద‌రు పేరెంట్స్ పిల్ల‌ల ఆల‌నా పాల‌నా కూడా స‌రిగా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక ఆర్థికంగా దిగువ స్థాయిల్లో ఉన్న కుటుంబాల్లో కొంద‌రు త‌ల్లిదండ్రులు మద్యానికి బానిస‌లై చిన్న పిల్ల‌ల‌ను హింసించ‌డం, బాల కార్మికులుగా మార్చ‌డం, మానసిక వేధింపుల‌కు గురి చేయ‌డం వంటి ప‌నుల‌కు పాల్ప‌డుతున్నారు. కొన్ని కేసుల్లో సొంత త‌ల్లిదండ్రులే త‌మ పిల్ల‌ల్ని చంపిన ఘ‌ట‌న‌లు వెలుగు చూసాయి.

 

 

ఈ వేధింపులు భ‌విష్య‌త్ ను చిదిమేస్తున్నాయి!

 

చిన్న‌త‌నంలో మానసిక‌, శారీర‌క వేధింపుల‌కు గురైన వాళ్లు భ‌విష్య‌త్ లో తీవ్ర‌మైన మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు గుర‌వుతార‌ని నిపుణులు చెపుతున్నారు. ఒత్తిడిని త‌ట్టుకోలేక పిరికివాళ్లుగానూ, హింస‌ను ఇష్ట‌ప‌డే సైకోలుగానూ మారిపోతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పుట్టిన ద‌గ్గ‌ర్నుంచి ఉన్న‌త చ‌దువుల‌కు వెళ్లే వ‌ర‌కూ పిల్ల‌ల‌పై త‌ల్లిదండ్రులు చూపే ప్రేమ వాళ్ల జీవితాన్ని నిర్దేశిస్తుంది. త‌ల్లిదండ్రుల ప్రేమ‌ను అనుభ‌విస్తూ పెరిగిన పిల్ల‌వాడు భవిష్య‌త్ లో త‌న జీవిత భాగ‌స్వామితోనూ, చుట్టూ ఉన్న మ‌నుష్య‌ల‌తోనూ అంతే ప్రేమ‌గా మ‌సులుకుంటాడు. అలా కాకుండా చిన్నత‌నంలో త‌ల్లిదండ్రుల చేతిలో హింస‌కు గురైన పిల్ల‌లు పెరిగి పెద్ద‌య్యాక అదే హింస‌ను కొన‌సాగిస్తున్న‌ట్టు స‌ర్వేలో తేలింది. త‌మ పిల్ల‌ల‌కు కూడా ప్రేమించుకుండా అదే హింస‌ను కొన‌సాగిస్తార‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. చిన్న‌త‌నంలో తాము ఏదైతే హింస‌ను అనుభ‌వించామో అదే విధంగా కొన‌సాగించ‌డం వాళ్ల‌కు ఒక మాన‌సిక రుగ్మ‌త‌గా మారిపోతుంది. క్ర‌మ‌శిక్ష‌ణ పేరుతో మంచి భ‌విష్య‌త్ పేరుతో పిల్ల‌ల్ని హింసించే త‌ల్లిదండ్రులు చేతులారా త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్ ను చిదిమేస్తున్నార‌ని మానసిక నిపుణులు తేల్చేసారు. ఇక తాము ఏం చేయలేకపోయామో పిల్లలకు తాము చెప్పిందే చేయాలనుకునే మనస్తత్వం పిల్లల పెంపకాన్ని ప్రభావితం చేస్తుంది. అన్నింటికంటే పెంపకంలో తాము చేసిన తప్పులు, పొరపాట్లు తల్లిదండ్రులను ఎన్నటికీ వదిలిపెట్టవు. పేరెంట్స్ నుంచే పిల్లలు ప్రతీ విషయం నేర్చుకుంటారు. దాన్నే ఆచరణలో పెడతారు. 

 

 

పెంప‌కంలో త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త‌లు తీసుకోకుంటే జ‌రిగేవి అన‌ర్ధాలే!

 

ప్ర‌స్తుత స‌మాజంలో పిల్ల‌ల పెంప‌కం అనేది చాలా ముఖ్య‌మైన, క‌ష్ట‌మైన ప‌ని. ఈ పనిని విజ‌య‌వంతంగా నిర్వ‌ర్తించాలంటే త‌ల్లిదండ్రులు ముందునుంచీ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. పిల్ల‌ల్ని క‌నాల‌ని ప్ర‌ణాళిక వేసుకున్న ద‌గ్గ‌ర్నుంచి ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం పిల్లల పెంప‌కంపై అవ‌గాహ‌న పెంచుకోవాలి. పేరెంటింగ్ పై అవ‌స‌ర‌మైతే నిపుణుల స‌ల‌హాలు తీసుకోవాలి. పిల్ల‌ల‌కు త‌గిన విలువ‌లు, క్ర‌మ‌శిక్ష‌ణ నేర్పిస్తూనే అదే స‌మ‌యంలో వాళ్ల‌తో స్నేహితుల్లా , ప్రేమ‌గా మెల‌గడం వ‌ల‌న మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ పిల్ల‌ల పెంప‌కంలో ఇప్పుడు అటువంటి వాతావ‌ర‌ణం కాన‌రావ‌డం లేదు. ఉద్యోగాల్లో కొంద‌రు బిజీ జీవితాలు గడుపుతుంటే మ‌రికొంద‌రు పిల్ల‌ల‌తో ఎలా వ్య‌వ‌హ‌రించాలో తెలియ‌క వాళ్ల భ‌విష్య‌త్ ను ప్ర‌మాదంలోకి నెడుతున్నారు. పిల్ల‌ల పెంప‌కం విష‌యంలో చాలా మంది త‌ల్లిదండ్రుల‌కు శిక్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని నిపుణులు చెపుతున్నారు. ఉద్యోగాల‌ను, వ్యాపారాల‌ను, బిజీ లైఫ్ తో పాటు పిల్ల‌ల పెంప‌కాన్ని స‌మ‌న్వయం చేసుకోక‌పోతే వాళ్ల భ‌విష్య‌త్ ఎంత డ‌బ్బు కూడ‌బెట్టినా అవన్నీ బూడిద‌లో పోసిన ప‌న్నీరే.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)