ఇ’లా’ చేస్తే జాబ్ మార్కెట్లో మీరే కింగ్!!

 

ఇప్పుడు ఏదో ఒక మామూలు డిగ్రీ చ‌దివితే జాబ్ మార్కెట్లో కానీ వ్యాపార నిర్వ‌హ‌ణ లో కానీ మ‌నుగ‌డ సాగించే వీలులేదు. ముఖ్యంగా వివాదాలు పెరిగిపోయిన ప్ర‌స్తుత నేప‌థ్యంలో విష‌యంపై సంపూర్ణ అవగాహ‌న తెచ్చుకుంటే కానీ అందులో విజ‌యం సాధించలేం. ఇటువంటి ప‌రిస్థితుల్లో లా కోర్సుల‌కు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ప్రతీ విషయానికి లాయర్లను ప్రత్యేకంగా నియమించుకుని వాళ్లకు ఫీజులు ఇవ్వడం అనేది చాలా వ్యయంతో కూడుకున్న పని. దీంతో పలువురు తమ కెరీర్ కు చదువుకు లా డిగ్రీని అదనంగా సమకూర్చుకుంటున్నారు. తాము ఉన్న రంగంలో ఉన్న ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే తామే న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు తగిన వీలు దొరుకుతుందని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు తమ ప్రధాన డిగ్రీకి అదనంగా లా డిగ్రీని కూడా సమకూర్చుకుంటున్నారు. ముఖ‌్యంగా ఆర్ధిక రంగంలో వచ్చిన సరళీకరణల నేపథ్యంలో బిజినెస్ లా కు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఇక కంపెనీలు అయితే స్పెషలైజేషన్ లా డిగ్రీ ఉన్న అభ్యర్ధులను ఉద్యోగం లోకి తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

 

 

‘లా’ విద్యకు డిమాండ్ పెరిగింది !

 

గతంలో ఒక వెలుగు వెలిగిన లా చదువు తర్వాత మసకబారింది. లాయర్ గా కెరీర్ లో కుదురుకోవడానికి సుధీర్ఘ సమయం పట్టడం వంటి ఇబ్బందులో లా కోర్సులు చదివేందుకు విద్యార్ధులు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ మళ్లీ ఇప్పుడు లా కు పూర్వ వైభవం వచ్చింది. ముఖ‌్యంగా ఆర్థిక, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక సరళీకరణలు, ప్రభుత్వ రెగ్యుటేరీ వ్యవస్థల వలన లా గ్రాడ్యుయేట్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా బిజినెస్ లా చేసిన వారికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీరిని భారీ జీతాలిచ్చి ప్రత్యేకంగా నియమించుకునేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. మన దేశంలో స్టార్టప్ ల హవా మొదలైన నేపథ్యంలో లా చేసిన వారికి అవకాశాలే అవకాశాలు. గ్లోబలైజేషన్ పుణ్యమాని ఇప్పుడు వ్యాపారం నెట్టుకు రావాలంటే ఎన్నో విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు లా గ్రాడ్యుయేట్లకు వరంలా మారింది.

 

 

పెట్టుబడులు, వ్యాపార లావాదేవీల్లో ‘లా’ యే కీలకం !

 

ఆర్థిక సంస్కరణలు ఉపందుకోవడంతో మన దేశంలో ఇప్పుడు లా కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. విదేశీ కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టాలన్నా, అందులో ఎటువంటి వివాదాలు లేకుండా చూసుకోవాలన్నా లా యే కీలకం. దీంతో పాటు లా తో సంబంధం ఉన్న బ్యాంకింగ్, ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, పవర్ , సివిల్ ఏవియేషన్, షిప్పింగ్ , మీడియా, రియల్ ఎప్టేట్, ఐటీ ఇలా అన్ని రంగాల్లోనూ సమర్ధులైన లాయర్ల అవసరం ఉంది. అందుకే కీలక స్థానాల్లో లా చదివిన ఉద్యోగులను నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. లా తెలియడం అనేది వ్యాపార నిర్వహణలో ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అర్హతగా మారిపోయింది. ఒక వివాదంలో టాటా గ్రూప్ కంపెనీపై ఒక చిన్న స్టార్టప్ న్యాయ వివాదంలో విజయం సాధించడం దేశంలో పెద్ద సంచలనంగా మారింది. టాటాల దగ్గర పెద్ద లాయర్ ఉన్నా ఆ చిన్న స్టార్టప్ నిర్వాహకుడు కార్పోరేట్ లా లో నిష్ణాతుడు కావడం టాటా గ్రూప్ కేసు ఓడిపోయి నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది.

 

 

పెంచుకుంటే పెరుగుతుంది’లా’..!

ఇప్పుడు ప్రధాన డిగ్రీకి అదనంగా లా చదవడం అనేది క్రమంగా ట్రెండ్ గా మారుతోంది. బీటెక్ తర్వాత లా అలాగే ఎంబీయే ప్లస్ లా, బీ ఆర్క్ ప్లస్ అనే ట్రెండ్ నడుస్తోంది. ప్రధాన ప్లాట్‌ఫామ్ కు అదనంగా లా పై అవగాహన ఉండటం అనేది ప్రధాన అర్హతగా మారుతుతోంది. ఈ విషయాన్ని కంపెనీలు కూడా గుర్తిస్తున్నాయి. మరోవైపు సొంతంగా కంపెనీ పెడదామని ఆలోచన ఉన్న వారు తమ వివాదాలను తాము పరిష్కరించుకునేందుకు అదే సమయంలో ఏ లోసుగులు లేకుండా వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు లా అర్హతను పెంచుకుంటున్నారు. ఇక పలు కార్పోరేట్ సంస్థల్లో అయితే లా అభ్యర్ధులకు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. ఫండ్ రైజింగ్ , షేర్లు, జాయింట్ వెంచర్లు, మెర్జర్లు వంటి వ్యాపార విషయాల్లో న్యాయ నిపుణులు సలహాలు కీలకం కావడంతో లా చదివిన వారికి ఎన్నో అవకాశాలు క్యూ కడుతున్నాయి.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)