ప్ర‌తీ విద్యార్ధి ఈ 4 జాగ్ర‌త్తలు త‌ప్ప‌కుండా తీసుకోవాల్సిందే!

మార్కులు, ర్యాంకుల ప్రాతిప‌దిక‌న న‌డుస్తున్న ప్ర‌స్తుత మ‌న‌ విద్యా వ్య‌వ‌స్థ విద్యార్ధుల‌పై మాన‌సిక ఒత్తిడిని పెంచుతోంది. పాఠ‌శాల‌, కళాశాల‌ల్లో రోజంతా భ‌రిస్తున్న ఒత్తిడికి తోడు ఇంట్లో త‌ల్లిదండ్రులు కూడా నిరంతరం చ‌దువుకోస‌మే చ‌ర్చించ‌డంతో విద్యార్ధికి ఉల్లాసమే క‌ర‌వ‌వుతోంది. దీంతో మాన‌సిక‌  ఉద్వేగాల‌ను, ఆలోచ‌న‌ల‌ను ఎలా నియంత్రించుకోవాలో తెలియ‌క చాలామంది విద్యార్ధులు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ముఖ్యంగా అసూయ‌, ద్వేషం, ఆత్మ‌విశ్వాస లోపించ‌డం వంటి మాన‌సిక అవ‌రోధాల‌ను విద్యార్ధులు అదుపు చేసుకోలేక‌పోతున్నారు. త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల స‌హ‌కారం తీసుకుని ఈ తాత్కాలిక అడ్డంకుల‌ను అధిగ‌మిస్తే విద్యార్దులు విజ‌య‌వంత‌మైన వ్యక్తులుగా ఎదుగుతారు. బాగా చ‌దివితేనే అంద‌రూ స్నేహం చేస్తారు! మార్కులు త‌క్కువ వ‌స్తే ఎవ‌రూ ప‌ట్టించుకోరు! ఇలాంటి భ‌యాలు విద్యార్ధిలో మాన‌సిక ఒత్తిడిని పెరిగేలా చేస్తాయి. అలా కాకుండా సంతోషంగా ఉండ‌టమే ముఖ్యం. నేను క‌ష్ట‌ప‌డి చ‌దివితే అన్నీ నా ద‌గ్గ‌ర‌కే వ‌స్తాయ‌న్న రీతిలో ఆలోచిస్తే ఒత్తిడిని అధిగ‌మించ‌వ‌చ్చు. మంచి ప్రేరణతో, స్ఫూర్తిదాయ‌క విద్యార్ధిగా కెరీర్ లో ఉన్న‌త స్థానానికి చేరుకోవాలంటే విద్యార్ధులు ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ఆత్మ‌విశ్వాసం..కొండంత బ‌లం!

 

పునాది ప‌టిష్టంగా లేకుంటే భ‌వ‌నం ఎలా కుప్ప‌కూలుతుందో ఆత్మ‌విశ్వాసం లేకుంటే మ‌నిషి కూడా అలా కుప్ప‌కూలాల్సిందే. ఆత్మ‌విశ్వాసం విద్యార్ధుల‌కు మ‌రింత ముఖ్యం. నేను అది చేయ‌గ‌ల‌ను, నాకు ఆ సామ‌ర్ధ్యం ఉంది. అని బ‌లంగా న‌మ్మితే మిమ్మ‌ల్ని ఎవ‌రూ ఆప‌లేరు. అదే విధంగా విద్యార్ధి ఒత్తిడికి గురి కాకుండా సంతోషం ఉండ‌టంలో కూడా ఆత్మ‌విశ్వాసానిదే కీల‌క పాత్ర‌. త‌ర‌గ‌తిలో స‌హ విద్యార్ధులతో పాటు బ‌య‌టవారిని కూడా స్నేహితులుగా మ‌లుచుకోవాలి. ఎందుకంటే సామాజిక సంబంధాలు బ‌లంగా ఉన్న‌ప్పుడు ఆనందం ఎన్న‌డూ దూరం కాదు. అయితే స్నేహాలు ఎప్పుడూ విద్యార్ధి చ‌దువుకు భంగం క‌లిగించ‌కూడ‌దు. విద్యార్ధిలో ఆత్మ‌విశ్వాసం మెండుగా ఉన్న‌ప్పుడు త‌న బ‌లాలు, బ‌ల‌హీన‌త‌ల‌పై అత‌నికి ఒక స్ప‌ష్టత ఉంటుంది. ఒక విష‌యంపై త‌న‌పై ఎవ‌రైనా విమ‌ర్శలు చేసినా, ప్ర‌తికూల వ్యాఖ్యానాలు చేసినా ఆత్మ‌విశ్వాసం ఉన్న విద్యార్ధి దానిని పెద్ద‌గా ప‌ట్టించుకోడు. ఇలా ఉండ‌టం వ‌ల‌న మాన‌సిక ఒత్తిడి, నిరాశ‌ విద్యార్ధి ద‌రి చేర‌కుండా ఉంటాయి. మానసిక ఒత్తిడి లేన‌ప్పుడు విద్యార్ధి త‌ర‌గ‌తి గ‌దిలో ఉత్సాహంగా, ఆనందంగా ఉండ‌గ‌లుగుతాడు.

స‌వాళ్లకు బెద‌ర‌కండి!

 

ఈ ర్యాంకుల విధానంలో పోటీ అనేది స‌ర్వ‌సాధార‌ణం. ఈ విష‌యాన్ని విద్యార్ధులు ఎల్ల‌వేళ‌లా గుర్తుంచుకోవాలి. ఒక్క‌సారి ఏదో ర్యాంకులు, మార్కులు త‌గ్గితే ఫ‌ర్వాలేదు కానీ వ‌రుస‌గా ర్యాంకు త‌గ్గుతూ వ‌స్తే మాత్రం విద్యార్ధి వెంట‌నే జాగ్ర‌త్త‌ప‌డాలి. మిగిలిన వారితో పోటీప‌డి మంచి ర్యాంకు సాధించేందుకు ప్ర‌య‌త్నించాలి. ఆ పోటీ ఆత్మ‌విశ్వాసంతో కూడిన‌దై ఉండాలి అదే స‌మ‌యంలో ఆత్మ‌న్యూన‌తను దరికి రానీయ‌కుండా చూసుకొండి. నేను ఫ‌లానా ప్ర‌య‌త్నంలో విఫ‌లం చెందుతాను!నేను పరీక్ష‌ల్లో ఫెయిల్ అవుతాను.. అన్న భ‌యాల‌ను పార‌ద్రోలండి. భ‌యమే అన్ని అన‌ర్ధాల‌కు మూలం. క‌ష్ట‌ప‌డి మీ సామ‌ర్ధ్యం మేర‌కు ప్ర‌య‌త్నించండి అంతేకానీ ఫ‌లితం కోసం తీవ్రంగా ఆలోచించి ఆందోళ‌న చెంద‌కండి. ఎందుకంటే ఆందోళ‌న చెంద‌డం మీ సామ‌ర్ధ్యాన్ని తీవ్రంగా దెబ్బ‌తీస్తుంది. విద్యార్ధులు త‌మ‌కు ఎదురైన స‌వాళ్ల‌ను స‌రికొత్త అవ‌కాశాలుగా మార్చుకునే నేర్పును విద్యార్ధులు సంపాదించుకోవాలి. అప్పుడే విఫ‌ల‌మ‌వుతామెమో అన్న ఆందోళ‌నకు చెక్ పెట్ట‌వ‌చ్చు.

మీ బ‌లాల‌ను ప్ర‌ద‌ర్శించండి!

 

 

ఎన్ని స‌బ్జెక్ట్ లు ఉన్న‌ప్ప‌టికీ మీకు ప్ర‌త్యేకించి ఒక స‌బ్జెక్ట్ పై మంచి ప‌ట్టు ఉంటుంది. ఆ సబ్జెక్ట్ పై  శ్రద్ధ పెట్టి దాంట్లో మరింతగా రాణించేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వలన మీరు మిగతా వాళ్ల కంటే కాస్త ప్రత్యేకంగా కనిపిస్తారు. అన్ని సబ్జెక్ట్ ల్లోనూ మంచి మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే బాగా పట్టు ఉన్న సబ్జెక్ట్ ను మెరుగు పెట్టుకోవడం వలన ఆ సబ్జెక్ట్ పై మంచి నైపుణ్యత వస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కచ్చితంగా పెంచుతుంది. దీంతో పాటు భవిష్యత్ లో మీ జీవిత గమ్యాన్ని నిర్దేశించుకునేందుకు, ఒక వృత్తిని ఎంచుకునే క్రమంలో మీకున్న నైపుణ్యత మీకు కెరీర్ కు సహాయపడుతుంది. కాబట్టి మీ బలాన్ని ప్రదర్శించడం ఎంత ముఖ్యమో, ఆ బలాన్ని పెంచుకునేందుకు తగిన కసరత్తు చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని విద్యార్ధులు బాగా గుర్తుంచుకోవాలి.

 

టీచర్ నుంచి దూరం జరగొద్దు

 

విద్యార్ధిని ఎటువంటి సంక్షోభం నుంచి అయినా బయటపడేయగలిగే శక్తి ఒక్క టీచర్ కే ఉంది. కాబట్టి విద్యార్ధులు ఎప్పుడూ టీచర్ కు దూరంగా జరగొద్దు. సబ్జెక్ట్ కు సంబంధించి టీచర్ తో ఏ విషయాన్నైనా స్వేచ్ఛగా పంచుకోగలిగే చనువు విద్యార్ధికి ఉండాలి. విద్యార్ధులు తమ బలహీనతలను గుర్తించినప్పుడు, సబ్జెక్ట్ అర్ధం కాని సందర్భం ఎదురైనప్పుడు టీచర్ తో ఆ విషయాన్ని తక్షణం చెప్పాలి. అలా చెప్పకుంటే మీకే నష్టం. సబ్జెక్ట్ మీకున్న సందేహాలను టీచర్ కు వివరిస్తేనే అతను మిమ్మల్ని ఆ స్థితి నుంచి బయట పడేయగలుగుతాడు. సందేహాలు తీర్చడమే కాకుండా మీకు మరింత స్పూర్తి నిచ్చేలా తీర్చిదిద్దడంలో టీచర్ ను మించిన ప్రత్యామ్నయం లేదు. కాబట్టి ఎప్పుడూ ఉపాధ్యాయుడికి దూరంగా జరగొద్దు. మనం చెప్పుకున్న ఈ నాలుగు జాగ్రత్తలు తీసుకుంటే మీరు విభిన్న విషయాల నుంచి ప్రేరణ పొంది మంచి విద్యార్ధులుగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.