శ‌వాల‌కూ హ‌క్కులుంటాయా?

 

‘బ‌తికున్న నాడు బువ్వ పెట్ట‌ని వాడు చ‌చ్చిపోయాక చ‌క్కెర పొంగ‌ళితో ముష్టాన్న భోజనం పెట్టాడ‌న్న‌ది’ సామెత‌. ఎందుకంటే మ‌న స‌మాజంలో పూర్వ కాలం నుంచి చ‌నిపోయిన వాళ్ల‌కు ఇచ్చే గౌర‌వం చాలా గొప్ప‌గా ఉంటుంది. చనిపోయిన వ్య‌క్తుల అంతిమ యాత్ర‌లో వాళ్ల‌కు ఇష్ట‌మైన వ‌స్తువుల‌ను, ఆహార ప‌దార్ధాల‌ను ఇత‌ర విష‌యాల‌కు అధిక ప్రాధాన్య‌తనిస్తారు. దాదాపుగా చ‌నిపోయిన మ‌నిషి ఒక దైవ స‌మానంగా భావిస్తారు. మ‌న భారతీయ సంస్కృతిలో ఇది ఓ భాగం. అయితే మారుతున్న సామాజిక, ఆర్థిక ప‌రిణామాలు చ‌నిపోయిన మ‌నిషిపై, శవంపై మ‌న దృక్కోణాన్ని మార్చేస్తున్నాయి. భార‌తీయ‌, ఈజిప్ట్ వంటి పురాత‌న సంస్కృతుల్లో శ‌వానికి ఇచ్చే గౌర‌వాన్ని మర్చిపోయిన నేటి త‌రం శ‌వాన్ని త్వ‌ర‌లో పాడైపోయే ఒక మాంసం ముద్ద‌లా మాత్ర‌మే చూస్తున్నాయి. ముఖ్యంగా ప్ర‌భుత్వ యంత్రాంగాల్లో శ‌వాల ప‌ట్ల తీవ్ర‌మైన నిర్ల‌క్ష్యం రాజ్య‌మేలుతోంది. ముఖ్యంగా శ‌వాగారాల్లోని శ‌వాలను ఎలుక‌లు, పందికొక్కులు పీక్కుతింటున్నా అడిగే నాథుడు కూడా లేడు. శ‌వాల‌పై కొన‌సాగుతున్న ఈ నిర్ల‌క్ష్యంపై ప్ర‌తీ రోజూ వార్త‌లు వ‌స్తున్నా స్పందించేందుకు ఎవ్వ‌రూ సిద్ధంగా లేరు. ఇటువంటి ప‌రిస్థితుల్లో అస‌లు శ‌వాల‌కూ హ‌క్కులు ఉంటాయా? ఆత్మీయులు లేని అనాధ శ‌వాల‌పై ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శిస్తున్న నిర్లక్ష్య వైఖ‌రిని ప్ర‌శ్నించొచ్చా?

 

 

చ‌చ్చిన శ‌వాలంటే అంత చిన్న చూపా?

 

ఇటీవ‌లి కాలంలో ఏ ప‌త్రిక తిర‌గేసినా నేరాలు, హ‌త్య‌లు, రోడ్డు ప్ర‌మాదాల‌కు సంబంధించిన వార్త‌లే అధికంగా క‌నిపిస్తున్నాయి. ప్ర‌మాదాల్లో అనాధ‌లుగా ప్రాణాలు కోల్పోయిన వాళ్లు, అయిన వాళ్లు లేక అనారోగ్యంతో క‌న్ను మూసిన వాళ్లు మ‌న దేశంలో ప్ర‌తీ రోజూ వంద‌ల సంఖ్య‌లో ఉంటారు. అనాధ శవాలుగా ప్ర‌భుత్వ మార్చురీల్లోకి వ‌చ్చి చేరే శ‌వాలు ఎక్కువ‌గానే ఉంటాయి. మ‌నం ముందు చెప్పుకున్న‌ట్టు బ‌తికున్న‌ప్పుడు విష‌యం తెలియ‌దు కానీ చ‌నిపోయాక ఒక మ‌నిషికి ఇవ్వాల్సిన క‌నీస‌మైన గౌర‌వం ఇవ్వాలి కానీ మ‌న ప్ర‌భుత్వ యంగ్రాంగం మాత్రం గౌర‌వం సంగ‌తి త‌ర్వాత శ‌వాల‌ను అత్యంత దారుణంగా అవ‌మానిస్తోంది. ప్ర‌భుత్వ ఆసుపత్రుల్లోని శ‌వాగారాల్లో స‌రైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోవ‌డంతో ఎలుక‌లు, పందికొక్కులు శ‌వాల‌ను పీక్కుతింటున్న‌ట్టు ప్ర‌తీరోజూ పత్రిక‌ల్లో వార్త‌లు వ‌స్తున్నాయి. అయినా అడిగే వారు లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వ యంత్రాంగం తమ వైఖ‌రిని మార్చుకోవడం లేదు. తాజాగా ఉస్మానియా ఆసుప‌త్రిలో ఒక గృహిణి శవం చెవులు, ముక్కును పందికొక్కులు తినేడం హాట్ టాపిక్ గా మారింది. అలాగే గ‌తంలో గుంటూరు జ‌న‌ర‌ల్ ఆసుపత్రి ఐసీయూలో ఒక చిన్నారిని కూడా ఇలాగే పందికొక్కులు చేతులు, కాలివేళ్లు కొరికిన ఘ‌ట‌న‌లు మ‌న‌కు తెలుసు.

 

 

మానవ హ‌క్కులు మ‌నుష్యుల‌కేనా? శ‌వాల‌కు ఉండ‌వా?

 

బ‌తికున్న మ‌నిషికి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ఎన్నో చ‌ట్టాలున్నాయి. పైగా వ్య‌క్తిగ‌త హ‌క్కుల‌కు భంగం క‌లిగినప్పుడు వ్య‌క్తి స్వేచ్ఛ‌కు విఘాతం క‌లిగి న‌ప్పుడు అత‌ని హ‌క్కుల‌ను కాపాడేందుకు మానవ హ‌క్కులు సంఘాలున్నాయి. మ‌నిషి హ‌క్కుల‌కు భంగం క‌లిగిన‌ప్పుడు అత‌ని వ్యక్తిగ‌త భ‌ద్ర‌త‌కు ర‌క్ష‌ణ లేన‌ప్పుడు మానవ హ‌క్కులు క‌మీష‌న్ ముందుండి పోరాడుతుంది. గ‌తంలో నెల్స‌న్ మండేలా, మ‌హాత్మా గాంధీ, మ‌లాలా వంటి వారు మానవ హ‌క్కుల ఉల్లంఘ‌న‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసి ఖ్యాతి గ‌డించారు. ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉంది. బ‌తికున్న మ‌నుష్యుల‌కు హ‌క్కులు కావాలి కాబ‌ట్టి పోరాటం చేసి సాధించుకుంటున్నారు. మ‌రి చ‌నిపోయిన శ‌వాల సంగ‌తేంటి? ఇండియా లాంటి దేశంలో శ‌వాల‌ను దైవంతో స‌మానంగా చూసుకుంటారు. క‌దా? మ‌రి వాటి హ‌క్కుల‌ను కాపాడేందుకు ఏమైనా చ‌ర్య‌లు తీసుకుంటున్నారా? ఈ ప్ర‌శ్న‌కు లేదు అనే స‌మాధానం చెప్పాల్సి వ‌స్తుంది. అత్యంత హేయ‌మైన ప‌రిస్థితుల్లో ఒక శ‌వాన్ని రోజుల త‌ర‌బ‌డి ఒక ఐస్ రూమ్ లో ఉంచుతున్నారు. ఒక వేళ ఆధారాల కోసం ఉంచాల్సిన వ‌చ్చిన‌ప్పుడు స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకుని వాటిని జాగ్ర‌త్త‌గా గౌరవంతో భ‌ద్ర‌ప‌రిస్తే మ‌న సంస్కృతికి, చనిపోయిన వారి ఆత్మ‌కు శాంతి క‌లుగుతుంది. ఒక వేళ శవం యొక్క సంబంధీకుల‌కు హ‌క్కులు క‌ల్పిస్తున్నా వాటిని కాపాడేందుకు స‌రైన సంస్థ‌, వ్య‌వ‌స్థ కూడా లేవు.

 

 

శ‌వం దేశానికి చెందుతుంది!

 

అస‌లు ఒక మ‌నిషి చ‌నిపోయాక అతని శ‌వం దేశానికి చెందుతుంది. ఆత్మీయులు, ర‌క్త సంబంధీకులు లేని అనాధ శ‌వాల బాధ్య‌త‌ను పూర్తిగా ప్ర‌భుత్వ‌మే తీసుకోవాలి. మ‌న పురాత‌న సంస్కృతిని అనుస‌రించి వాటికి త‌గిన గౌరవం ఇవ్వాలి. వాటికి స‌రైన ప‌ద్ధ‌తిలో శ‌వ సంస్కారాన్ని నిర్వ‌హించాలి. ఇవ‌న్నీ ప్ర‌భుత్వం యొక్క బాధ్య‌త‌లు అని ప్ర‌ముఖ ఫోరెన్సిక్ వైద్యుడు డాక్ట‌ర్ విద్యాసాగ‌ర్ చెప్పుతున్నారు. అయితే ప్ర‌భుత్వం త‌మ బాధ్య‌త‌లను స‌రైన విధంగా నిర్వ‌హించ‌డం అన్న‌దే ఇప్పుడు శ‌వాల హ‌క్కుల ఉల్లంఘ‌న‌గా పిల‌వ‌బ‌డుతోంది. లేదంటే ప్రాణం లేని శ‌వాలకు హ‌క్కులెందుకు? వ‌ంద‌ల సంఖ్య‌లో శ‌వాలు వ‌స్తున్న‌ప్పుడు డాక్ట‌ర్ల‌కు వీటిని నిర్వ‌హ‌ణ చేయ‌డం అనేది క‌ష్ట సాధ్యంగానే ఉంటుంది. అయితే చిత్త‌శుద్దితో ప్ర‌య‌త్నిస్తే ఇది అసాధ్యం ఏమీ కాదు. మ‌రోవైపు అనాధ శ‌వాల‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు కొన్ని స్వ‌చ్ఛంధ సంస్థ‌లు పనిచేస్తున్నాయి. కొన్ని విమ‌ర్శ‌లు ఉన్నా అనాధ‌ శ‌వాల‌కు స‌రైన విధంగా అంత్యక్రియ‌లు చేయ‌డంలో అటువంటి సంస్థ‌లు ఫ‌ర్వాలేద‌నిపిస్తున్నాయి.

 

 

చనిపోయిన వాళ్ల‌ను క‌చ్చితంగా గౌర‌వించాల్సిందే!

 

మ‌న దేశంలో మ‌న సంస్కృతిలో శ‌వంతో మ‌న‌కు ఒక ఎమోష‌న‌ల్ అటాచ్ మెంట్ ఉంటుంది. అంటే దాన‌ర్ధం అనాధ శ‌వ‌మైనంత మాత్రాన ఒక శ‌వాన్ని మార్చురీలో అధ్యాన్నమైన స్థితిలో జంతువులకు ఆహారంగా వేయ‌డం అన్న‌ది చాలా దుర్మార్గ‌మైన విష‌యం. శ‌వాన్ని గౌర‌వంగా సాగ‌నంప‌డం అనేది మ‌న సంస్కృతిని కాపాడుకోవ‌డ‌మే. శ‌వాల‌కు ప్ర‌త్యేక‌మైన హ‌క్కులు ఉండేలా..వాటిని గౌర‌వించేందుకు ప్ర‌త్యేక‌మైన చ‌ట్టం తీసుకొస్తే మ‌న సంస్కృతితో ప‌రిర‌క్ష‌ణ జ‌రుగుతుంది. అదే స‌మ‌యంలో అనాధ ఆత్మ‌ల‌కు శాంతి క‌లుగుతుంది.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)