వృత్తులందు యాచక వృత్తి మేలయా!

 

ప్ర‌తీ మ‌నిషి త‌న జీవితంలో ఏదో ఒక సంద‌ర్భంలో చేయి చాచి ప‌క్క‌వాడ్ని యాచించే ఉంటాడు. మ‌రీ అడుక్కోవ‌డం అన్న మాట‌ను ఉప‌యోగించడం ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ యాచించ‌డం అనేది స్థాయిని పెద్ద చిన్న అని మారుతూ ఉంటుంది. కొంద‌రు అవ‌స‌రాల‌కు స‌హాయాన్ని యాచిస్తే కొంద‌రు చేసిన స‌హాయాన్ని కృత‌జ్ఞ‌త‌ను, డ‌బ్బును,వ‌స్తువుల‌ను యాచిస్తారు. అస‌లు ఇంత‌కీ యాచ‌న కోసం ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే తాజాగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కుమార్తె హైద‌రాబాద్ లో ఓ గ్లోబ‌ల్ స‌మిట్ లో పాల్గొంటోంద‌ని న‌గ‌రంలోని బిచ్చ‌గాళ్లంద‌రినీ న‌గ‌ర శివార్ల‌కు త‌ర‌లించారు. వాస్త‌వాల‌ను దాచిపెట్టి ఎవ‌రో మెప్పు పొందాల‌ని వాళ్ల‌ను తాత్కాలిక‌ శిబిరాల‌కు త‌ర‌లించ‌డం విమ‌ర్శ‌ల పాలైంది. చిత్త‌శుద్ధితో పరిష్కారించాల్సిన ఒక జ‌ఠిల‌ స‌మ‌స్య‌ను ఆది నుంచి పెంచి పోషిస్తూ ఇప్పుడు ఉన్న‌ది లేనట్టుగా చూపేందుకు తాపత్ర‌య‌ప‌డ‌టం విడ్డూరంగా అనిపిస్తోంది. భార‌తీయ జీవ‌న విధానంలో యాచ‌న లేదా బిక్షాట‌న అనేది ఒక అంత‌ర్భాంగా ఉంటూ వ‌స్తోంది. ఆధ్మాత్మిక జీవ‌న శైలిలో ఒక భాగ‌మైన బిక్షాట‌న త‌ర్వాత మెల్ల‌మెల్ల‌గా స్వార్ధ‌ప‌రులు, సోమ‌రుల‌కు జీవ‌నోపాధిగా మారింది. పురాణ కాలం నుంచి నేటి వ‌ర‌కూ వివిధ మార్పులు చెందుతూ వ‌చ్చిన బిక్షాట‌న నేటి స‌మాజాన్ని ప‌ట్టి పీడించే ఒక విష వ‌ల‌యంగా మారిపోయింది. విద్యార్ధులు ఆ ప‌రిణామ క్ర‌మాన్ని ఓసారి గ‌మ‌నిస్తే సామాజిక బాధ్య‌త‌పై అవ‌గాహ‌న తెచ్చుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది.

 

 

అస‌లు ఈ యాచ‌న ఎక్క‌డ మొద‌లైంది?

 

మ‌న పురాణాల్లో, ఇతిహాసాల్లోనూ యాచ‌న‌, బిక్షాట‌న అనే ప‌దాలు చాలా విరివిగా క‌నిపిస్తాయి. శ్రీకృష్ణుడు, కుచేలుని స్నేహం, స్నేహితుడ్ని నోరు తెరిచి యాచించేందుకు నోరు రాని కుచేలుడు త‌నే తిరిగి త‌న స్నేహితునికి అటుకుల‌ను కానుక‌గా ఇచ్చి అక్క‌డ నుంచి వెళ్లిపోవ‌డం ఇవ‌న్నీ మ‌నం భాగ‌వతంలో చ‌దువుకున్నాం. త‌ను భార్య పిల్ల‌ల‌తో ఉన్న గృహ‌స్తు క‌నుక స్నేహితున్ని స‌హాయం కూడా యాచించ‌కుండా వెళ్లిపోయాడు. మ‌రోవైపు కుటుంబాన్ని త్య‌జించిన స‌న్యాసులు, మ‌హ‌ర్షులు మాత్రం ఎటువంటి బెరుకు లేకుండా బిక్షాట‌న చేస్తారు. క‌ర్ణుడి క‌వ‌చ కుండ‌లాల‌ను తీసుకోవాలి అనుకున్న‌ప్పుడు ఇంద్రుడు, బ‌లి చ‌క్ర‌వ‌ర్తి అహంకారాన్ని అణిచేందుకు వామ‌నుడు…మ‌హ‌ర్షుల వేషంలోనే దానాన్ని తీసుకున్నారు. అలాగే బుద్ధుడు, సాయి బాబా వంటి వారు కూడా బిక్షాట‌న చేసిన వారే. వారు స‌ర్వం త్య‌జించిన స‌న్యాసులు క‌నుక త‌మ పొట్ట కూటి కోసం యాచించే వారు. వాళ్ల యాచ‌న‌లో ఒక ప‌విత్ర‌త‌, ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. ప్ర‌జ‌లు ఆహారాన్ని సంపాదించుకునే క్ర‌మంలో త‌మ‌కు తెలీకుండానే ఎన్నో పాపాలు మూట‌గ‌ట్టుకుంటారు. దైవ‌త్వం క‌లిగిన మ‌హ‌ర్షులకు ఆ ఆహారాన్ని బిక్ష‌గా వేసిన‌ప్పుడు వాళ్లు ఆ పాప ఫ‌లితాల నుంచి విముక్తి పొందుతారు. భారతీయ సంస్కృతీ, సంప్ర‌దాయాల్లో బిక్షాట‌న‌, యాచ‌న‌, దానం, ధ‌ర్మం వెనుక ఇన్ని నిగూఢ అర్ధాలు ఉంటాయి.

 

 

మ‌త గ్రంధాల ఊహ‌కు అంద‌ని మాఫియా ఏర్పాటైంది!

 

హిందూ మ‌తంలో , సంస్కృతిలో దానం చేయ‌డం అనేది చాలా ముఖ్య‌మైన విష‌యం. హిందువులు ప్ర‌తీ కార్య‌క్ర‌మంలో దాన ధ‌ర్మాల ప్ర‌స్తావ‌న ఉంటుంది.పండ‌గ‌ల్లోనూ, పెళ్లిళ్ల‌లోనూ, వేడుక‌ల్లోనూ పేద‌వారికి, నిస్స‌హాయుల‌కు స‌హాయం చేయ‌మ‌ని శాస్త్రాలు చెపుతాయి. అలాగే ఇస్లాం లో కూడా ఇదే ర‌క‌మైన ప్ర‌స్తావ‌న ఉంటుంది. ప్ర‌తీ ముస్లిం త‌న సంపాద‌న‌లో కొంత మొత్తాన్ని పేద‌వారికి, అభాగ్యుల‌కు దానం చేయ‌మ‌ని ఖురాన్ చెపుతుంది. దాన ధ‌ర్మాల‌కు క్రైస్త‌వం కూడా అతీతం కాదు. ఆ మతంలో కూడా ఎటువంటి ప‌నిచేయ‌లేని, క‌ష్టాల్లో ఉన్న వారికి స‌హాయం చేయ‌మ‌ని ఉంటుంది. అయితే ఎంతో మంచి ఉద్దేశ్యంతో మ‌తాలు, మ‌త గ్రంధాలు ఉద్భోధించిన దాన ధ‌ర్మాలు కాలం మారుతున్న కొద్దీ కొంద‌రికీ బ‌తుకు తెరువుగా మారిపోయాయి. అస‌హాయుల‌కు, నిర్భాగ్యుల‌కు, విక‌లాంగుల‌కు స‌హాయం చేయాల‌న్న మతాల ఉద్భోధ‌ను కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్నారు. ప‌నిచేసే శ‌క్తి ఉన్నా, అన్ని అవ‌య‌వాలు స‌రిగ్గా ప‌నిచేస్తున్నా చాలా మంది సోమ‌రిపోతులుగా మారి బిచ్చ‌గాళ్లుగా చెలామ‌ణీ అవుతున్నారు. మ‌న సంస్కృతి అందించిన మంచి విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ఎంత‌లా పెరిగిపోయింది అంటే బిచ్చ‌గాళ్లు అంద‌ర్నీ కంట్రోల్ చేసే ఒక నెట్ వ‌ర్క్ తో పాటు చిన్న పిల్ల‌ల‌తో, ఆడ‌వాళ్ల‌తో బిక్షాట‌న చేయించే గ్యాంగ్ లు ఏర్ప‌డి బెగ్గింగ్ మాఫియాను ఏర్పాటు చేసారు. దేశంలోని బొంబాయి, ఢిల్లీ వంటి మ‌హా న‌గ‌రాల‌ను ప‌క్క‌న పెడితే కోటి మంది జ‌నాభా ఉన్న హైద‌రాబాద్ న‌గ‌రంలో దాదాపు 14 వేల మంది బిచ్చ‌గాళ్లు ఉన్నారు. వీళ్లంద‌రి సంవ‌త్స‌ర ఆదాయం 25 కోట్ల రూపాయ‌ల‌కు పైమాటే. అయితే వీరిలో నిజమైన యాచ‌కులు కేవ‌లం 2 శాతం మంది మాత్ర‌మేన‌ని స‌ర్వేలో తేలింది. మిగిలిన 98 శాతం మంది ప‌నిచేసే స‌త్తా ఉన్న‌వారేన‌ని అయినా బిక్షాట‌న‌ను ఎంచుకున్నార‌ని తేలింది. కొంద‌రు వ్య‌క్తులు మాఫియాగా ఏర్ప‌డి చిన్న పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేసి వాళ్ల‌తో బిక్షాట‌న చేయిస్తున్నారు.

 

 

కోటీశ్వ‌రులే బిచ్చ‌గాళ్లుగా మారారు!

 

ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్ కు వ‌స్తున్న సంద‌ర్భంగా నగ‌రంలోని బిచ్చ‌గాళ్ల‌ను శివార్ల‌లోని ఒక పున‌రావాస శిబిరానికి త‌ర‌లించారు. అంత‌ర్జాతీయ ప్ర‌తినిధులకు న‌గ‌రం గొప్ప‌త‌నాన్ని చూపించేందుకు వాళ్ల‌ను తాత్కాలిక గుడారాల‌కు తర‌లిస్తూ ప్ర‌భుత్వం త‌న మ‌న‌స్సాక్షిని దెబ్బ‌తీసుకుంటోంది. అయితే ఈ యాచ‌కుల త‌రలింపులో క‌న్నీరు పెట్టించే క‌థ‌లు, వ్య‌థ‌లు లు వెలుగు చూస్తున్నాయి. మొత్తం బిచ్చ‌గాళ్ల‌తో కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగా బిచ్చ‌గాళ్లు అయిన వారు ఉంటే మ‌రికొంద‌రు బ‌ల‌వంతంగా లాక్కురాబ‌డిన‌వారు. కొంద‌ర్ని ప‌రిస్థితులు, క‌ష్టాలు బిచ్చ‌గాళ్లుగా మార్చాయి. లండ‌న్ లో ఎంబీయే చేసి ఉన్న‌తోద్యోగం చేసిన వారూ, అమెరికా లో గ్రీన్ కార్డు హోల్డ‌ర్ కూడా న‌గ‌ర వీధుల్లో బిచ్చ మెత్తుకుంటున్నారు. ఒక‌ప్పుడు కోటీశ్వ‌రులైన వీళ్లు బిచ్చ‌గాళ్లుగా మారిన వైనం ఆలోచింప‌జేయ‌డంతో పాటు కంట‌త‌డి కూడా పెట్టిస్తుంది. హైద‌రాబాద్ లో ఆనంద్ బాగ్ కు చెందిన 60 ఏళ్ల ఫ‌ర్జానా హైద‌రాబాద్ లో డిగ్రీ పూర్తిచేసి ఆ త‌ర్వాత లండ‌న్ లో ఎంబీయే కంప్లీట్ చేసింది. అక్క‌డే ఓ ఉన్న‌తోద్యోగం కూడా చేసింది. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ కు వ‌చ్చి పెళ్లి చేసుకుంది. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే భ‌ర్త మ‌ర‌ణించ‌డంతో మానసికంగా కుంగిపోయిన ఫ‌ర్జానా మానసిక ప్ర‌శాంత‌త కోసం లంగ‌ర్ హౌజ్ ద‌ర్గా ద‌గ్గ‌ర ఉండిపోయి అక్కడే భిక్షాట‌న చేస్తోంది. పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ లో ఆమెను కూడా పున‌రావాస కేంద్రానికి తీసుకొచ్చారు.అయితే అన‌ర్గ‌ళంగా ఇంగ్లీష్ మాట్లాడం చూసి అవాక్కై ఆరా తీస్తే ఈ విష‌యాలు తెలిసాయి. ఇక ర‌బియా బ‌సిరిది మ‌రో దీన‌గాధ‌. అమెరికా హోట‌ల్ వ్యాపారం చేస్తున్న ఒక బిజినెస్ మ్యాన్ కు ఆమె మూడో భార్య‌. అమెరికాలో ఆమెకు గ్రీన్ కార్డు కూడా ఉంది. కొన్నాళ్ల క్రితం తండ్రి చనిపోవ‌డంతో హైద‌రాబాద్ కు వ‌చ్చింది. తండ్రి చ‌నిపోయాడ‌న్న బాధ‌కు తోడు అయిన‌వాళ్లంతా ఆమెను మోసం చేసి ఆస్తిని కాజేయ‌డంతో మాన‌సికంగా కుంగిపోయి ఇక్క‌డే ఉండిపోయింది. తర్వాత పొట్ట‌కూటి కోసం లంగ‌ర్ హౌజ్ ద‌ర్గాకు చేరుకుని అక్క‌డే ఉండిపోయింది.

 

 

శాశ్వ‌త ప‌రిష్కారం ఊసేదీ?

 

అస‌లు జీవితంలో బిచ్చ‌గాళ్ల‌ను చూడ‌లేదు అన్న వ్య‌క్తులు న‌గ‌రానికి అకస్మాత్తుగా ఊడిప‌డుతున్నారు అన్న చందంగా ప్ర‌భుత్వం చేస్తున్న అతి ఆపేక్ష‌ణీయంగా ఉంది. ముఖ్యంగా బిచ్చ‌గాళ్ల సంఖ్య‌ను త‌గ్గించ‌డానికి ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌లు శూన్యం. ఎవ‌రు నిజ‌మైన బిచ్చ‌గాళ్లు ఎవ‌రు బ‌ల‌వంతంగా ఈ రొంపిలోకి వ‌చ్చారు అన్న విష‌యం తేల్చ‌డం ప్ర‌భుత్వానికి ఏమంత క‌ష్టం కాదు. కానీ ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవు. ముఖ్యంగా చిన్న పిల్ల‌ల‌ను, మ‌హిళ‌ల‌ను బ‌ల‌వంతంగా శాశ్వ‌త బిచ్చ‌గాళ్లుగా మారుస్తున్న బెగ్గింగ్ మాఫియా ఆట‌క‌ట్టించేందుకు ఒక్క ముంద‌డుగు కూడా ప‌డ‌లేదు. ఇప్పుడు ఎవ‌రి ప్రాప‌కం కోసమో బిచ్చ‌గాళ్లును నెల‌రోజులు అక్క‌డ ఇక్క‌డా తిప్పి మ‌ళ్లీ వ‌దిలేస్తారు. బెగ్గింగ్ ను పూర్తిగా అరిక‌ట్ట‌లేకున్నా బెగ్గ‌ర్స్ సంఖ్య‌ను త‌గ్గించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి అదీ జ‌ర‌గ‌డం లేదు. ప్ర‌భుత్వం అత్య‌వ‌స‌రంగా చేయాల్సింది రెండు రోజులు ఉండి వెళ్లిపోయే విదేశీ ప్ర‌తినిధుల కోసం కాదు. బిచ్చ‌గాళ్ల‌కు శాశ్వ‌త పున‌రావాసం క‌ల్పించి వాళ్ల పిల్ల‌లు ఆ వృత్తి వైపు రాకుండా ఆలాగే కొత్త వాళ్లు ఆ వృత్తి రాకుండా చేసి బెగ్గింగ్ మాఫియాకు అరిక‌ట్ట‌డం. ఏ ప‌ని చేయ‌కుండా యాచించ‌డం ఎంత త‌ప్పో వాళ్ల పిల్ల‌ల‌కు చిన్న‌త‌నం నుంచి స‌రైన విధంగా భోధించ‌గ‌లిగితే బెగ్గింగ్ అనే దాన్ని మ‌న‌దేశంలో లేకుండా చేయొచ్చు.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)