మా పిల్ల‌ల‌ను చావ చిత‌క్కొడితే మీకెందుకు నొప్పి??

కృష్ణా జిల్లా నందిగామలో దీక్షా ఇంట‌ర్ కాలేజీ విద్యార్ధుల‌ను ఒక లెక్చ‌ర‌ర్ అమానుషంగా కొట్ట‌డం మ‌న‌ తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. నూనూగు మీసాల యువ‌కులను అమాన‌వీయంగా ప‌శువుల‌ను కొట్టిన‌ట్టు క‌ర్ర‌తో కొట్డడం చూప‌రుల‌కు బాధ‌తో పాటు ఆగ్ర‌హాన్ని కూడా తెప్పించింది. దీక్షా కాలేజీలో ఇంట‌ర్ విద్యార్ధుల‌కు గ‌ణితం భోధించే శ్రీనివాస్ ప్ర‌సాద్ అనే లెక్చ‌ర‌ర్, ఈ అమానుషానికి పాల్ప‌డ్డాడు. వాట్స‌ప్ లో వైర‌ల్ అయిన ఈ వీడియో ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోనూ ప్ర‌కంప‌న‌లు రేపింది.

 

వేగంగా స్పందించిన స‌ర్కారు!

 

పిల్ల‌ల‌ను చావ చిత‌క్కొడుతున్న వీడియో సామాజిక మాధ్య‌మాల్లో విసృతంగా వ్యాప్తి చెంద‌డంతో విష‌యం ప్ర‌భుత్వం వ‌ర‌కూ వెళ్లింది. దీంతో వెంట‌నే కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు. దీక్షా క‌ళాశాల‌ను త‌దుప‌ది ఆదేశాలు వ‌చ్చేవ‌ర‌కూ మూసేయాల‌ని, పిల్ల‌ల‌పై పైశాచికంగా దాడి చేసిన లెక్చ‌ర‌ర్ శ్రీనివాస్ పై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. గ‌తంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు దానికి ప్ర‌భుత్వాలు స్పందించిన విధానం చూస్తే దీక్షా కాలేజీ ఘ‌ట‌న‌లో వ్య‌వ‌స్థ వేగంగా ప‌నిచేసింది.

 

 

స్పంద‌న స‌రే..ప‌ర్య‌వ‌సానాలు ఆలోచించారా?

 

పిల్ల‌ల‌ను అమానుషంగా కొట్టిన లెక్చ‌ర‌ర్ పై కాలేజీపై ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లు బాగానే ఉన్నాయి. మ‌రి ఉన్న ప‌ళంగా కాలేజీకి తాళం వేస్తే విద్యార్ధుల భ‌విష్య‌త్ ఏంటి? ఈ విష‌యంపై మాత్రం ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర స‌మాధానం లేన‌ట్టుగానే క‌నిపిస్తోంది. స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు వేగంగా స్పందిచ‌డ‌మే కాదు దానికి ప‌రిష్కార మార్గాలు కూడా చూపించిన‌ప్పుడే నిజ‌మైన స‌మ‌ర్ధ‌త బ‌య‌ట‌ప‌డుతుంది. దీక్షా కాలేజీ విష‌యంలో ఈ విష‌యాన్ని పూర్తిగా విస్మ‌రించిన‌ట్టు ఉన్నారు. విద్యా సంవ‌త్స‌రం మ‌ధ్య‌లో కాలేజీ మూసేస్తే ఇప్పుడు వాళ్ల‌కు ఎక్క‌డ అడ్మిష‌న్ దొరుకుతుంది?

 

మీడియా అతిపై పేరెంట్స్ ఫైర్!

 

కార్పోరేట్ కాలేజీల నుంచి ల‌క్ష‌లాది రూపాయ‌ల‌ను యాడ్స్ రూపంలో సంపాదిస్తున్న మీడియా సంస్థ‌లు కూడా ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు అనాలోచితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. టీఆర్పీ లు మాత్ర‌మే ల‌క్ష్యంగా విద్యార్ధుల భ‌విష్య‌త్ తో ఆట‌లాడుకుంటున్నాయి. విద్యార్ధుల‌పై అమానుషంగా ప్ర‌వ‌ర్తించిన లెక్చ‌ర‌ర్, కాలేజీపై చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో, విద్యా సంవ‌త్స‌రం మ‌ధ్య‌లో ఉన్న విద్యార్ధుల భ‌విష్య‌త్ కూడా అంతే ముఖ్యం. అయితే ఈ విష‌యంపై మాత్రం ఏ మీడియా సంస్థ కూడా క‌థ‌నం ప్ర‌సారం చేయ‌లేదు. వార్త రాయ‌లేదు. అందుకే దీక్షా కాలేజీ అంశంలో మీడియా ప్ర‌తినిధుల‌పైకి విద్యార్ధుల త‌ల్లిదండ్రులు తిర‌గ‌బ‌డ్డారు. వ్య‌వ‌హ‌రాన్ని జ‌ఠిలం చేసి త‌మ పిల్ల‌ల జీవితాల‌తో ఆడుకోవ‌ద్ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

 

చైనా సంస్థ‌ల‌కూ తాళాలు వేయ‌గ‌ల‌రా?

 

దీక్షా కాలేజీ విష‌యంలో ఆఘ‌మేఘాల మీద స్పందించిన ప్ర‌భుత్వం మిగ‌తా విద్యా సంస్థల విష‌యంలోనే ఇలానే స్పందించ‌గ‌లుగుతుందా? ఎందుకు ఇలా చెప్పాల్సి వ‌స్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అగ్ర‌శ్రేణి కార్పోరేట్ విద్యా సంస్థ‌లు కూడా ఇలానే పిల్ల‌ల‌ను హింసించిన ఘ‌ట‌న‌లు వెలుగు చూసినా వాటి యాజమాన్యాల‌పై ప్ర‌భుత్వాలు ఎప్పుడు కూడా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవు. అయినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఒక్క‌టే కాదు. ఇటువంటి ఇబ్బందిక‌ర సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్పు చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డ ఎంత ముఖ్య‌మో అలానే విద్యార్ధుల భ‌విష్య‌త్, క్షేమం ఆలోచించ‌డం కూడా అంతే ముఖ్యం. లేకుంటే కొండ నాలుక‌కు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా త‌యారవుతుంది వ్య‌వ‌హారం.

 

(ఈ ఆర్టిక‌ల్ ను స్పాన్స‌ర్ చేసిన‌వారు)