బేతాళ క‌థ‌ల‌కు సీక్వెల్ గా మారిన విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌లు!

చంద‌మామ క‌థ‌ల పుస్త‌కం చ‌దివిన వారంద‌రికీ బేతాళ క‌థ‌లు సుప‌రిచిత‌మే. ఆ క‌థ‌ల్లో చెట్టుపై నుంచి శ‌వాన్ని దించి భుజంపై వేసుకుని మౌనంగా న‌డక సాగిస్తున్న విక్ర‌మార్కున్ని శ‌వంలోని బేతాళుడు ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. విక్ర‌మార్కుని మౌనాన్ని భ‌గ్నం చేసేందుకు ఇలా చెప్పిన క‌థ‌లు బేతాళ క‌థ‌లుగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌లు కూడా బేతాళ క‌థ‌ల‌ను గుర్తుకుతెస్తున్నాయి. స‌మ‌స్య‌కు ప‌రిష్కారాలు స్ప‌ష్టంగా తెలిసినా విక్ర‌మార్కుని మౌనం భంగం కాగానే ఎగిరిపోయే బేతాళునిలా స‌మ‌స్య మాత్రం మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తుంది. కార్పోరేట్ విద్యా సంస్థ‌ల మార్కుల దాహానికి విద్యార్ధులు పిట్ల‌ల్లా రాలుతున్నా రెండు రోజులు హ‌డావుడి చేసి త‌ర్వాత మ‌ళ్లీ స‌మ‌స్య‌ను శ‌వంలా మూట‌గ‌ట్టి చెట్టెక్కిస్తున్నారు. చివ‌రికి విద్యార్ధుల ఆత్మ‌ల‌కు కూడా శాంతి క‌లిగించ‌కుండా కార్పోరేట్ యాజ‌మాన్యాల‌కు కొమ్ము కాస్తూ విద్యార్ధుల ఆత్మ‌లు చెట్టు కొమ్మ‌ల్లోనే మ‌గ్గిపోయేలా చేస్తున్నారు.

 

ర్యాంకులు తీసుకొచ్చే యంత్రాలు అర్ధంత‌రంగా ఆగిపోతున్నాయి!

 

ఇటీవ‌లి కాలంలో కార్పోరేట్ విద్యా సంస్థ‌ల్లో విద్యార్ధుల‌ ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి. ఒత్తిడి త‌ట్టుకోలేక అంద‌మైన భ‌విష్య‌త్ ను, ప్రాణంగా ప్రేమించే త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలి పెట్టి బ‌ల‌వ‌ర్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు. కేవ‌లం డ‌బ్బు సంపాద‌నే ధ్యేయంగా న‌డుస్తున్న కార్పోరేట్ విద్యా సంస్థ‌లకు పిల్లల ఆత్మ‌హ‌త్య‌లు ప‌ట్ట‌వు. వారి మాన‌సిక స్థితి ప‌ట్ట‌దు. ఎంత సేపు వాళ్ల‌ను మార్కులు, ర్యాంకులు తీసుకు వ‌చ్చే యంత్రాలుగానే చూస్తారు. మ‌రోవైపు ఘ‌ట‌న జ‌ర‌గ్గానే రెండు రోజులు హ‌డావుడి చేసి త‌ర్వాత దాన్ని మ‌ర్చిపోవ‌డం మీడియాకు అల‌వాటుగా మారింది. ఇక ఈ పెను స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారాన్ని చూపించాల్సిన ప్ర‌భుత్వాలే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించడ‌మే ఇప్పుడు దుర‌దృష్ట‌క‌ర అంశం.

 

 

విద్యార్ధుల ఆత్మ‌హత్య‌లకు నివార‌ణ చ‌ర్య‌లు ఎక్క‌డ‌?

 

గ‌తంలో ఏమైనా రెండు మూడు ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు తూతూ మంత్రంగా చ‌ర్య‌లు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వాలు అవి స‌రిగ్గా అమ‌లవుతున్నాయో లేదో అన్న విష‌యాన్ని కూడా స‌రిగ్గా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. గ‌డిచిన రెండేళ్లుగా విద్యార్ధులు ఆత్మ‌హ‌త్యల శాతం పెరిగిపోతున్నా ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న శాశ్వ‌త చ‌ర్య‌లు మాత్రం శూన్యం. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌తీ నెలా ఇలా విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నా ప్ర‌భుత్వం నుంచి మాత్రం స్పంద‌న రావ‌డం లేదు. గ‌తంలో ఇలాంటి దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు అది చేస్తాం..ఇది చేస్తాం..అని ప్ర‌భుత్వ పెద్ద‌లు హ‌డావుడి అయినా చేసే వారు. ఇప్పుడు అటువంటి ప్ర‌తిస్పంద‌న కూడా ఎక్క‌డా కాన‌రావ‌డం లేదు. విద్యార్ధుల ఆత్మ‌హత్య‌ల‌కు వాళ్లు అల‌వాటు ప‌డిపోయారో లేక జ‌నాలు వీటికి అల‌వాటు ప‌డిపోయి ఉంటారులే అని అనుకుంటున్నారో తెలియ‌దు కానీ అంతులేని నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

 

ఇంత జ‌రుగుతున్నా విద్యా సంస్థ‌ల్లో మానసిక నిపుణుల ఊసేదీ??

 

ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డుతూ విద్యార్ధులు పిట్ట‌ల్లా రాలిపోతున్నా అటు కార్పోరేట్ కాలేజీలు కానీ ఇటు ప్ర‌భుత్వాలు శాశ్వ‌త చ‌ర్య‌లు తీసుకుంటున్న ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. క‌నీసం నిబంధ‌న‌ల‌ను కూడా అమ‌లు చేసేందుకు అధికారులు మీన‌మేషాలు లెక్కిస్తున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థ‌ల్లో సైకాల‌జిస్ట్ ల‌ను నియ‌మించాల‌న్న నిబంధ‌న అమ‌లు కావ‌డం లేదు. ఆ నిబంధ‌న‌ను పాటించి ఉంటే క‌నీసం స‌గం మంది ప్రాణాలు అయినా ద‌క్కి ఉండేవి. విద్యార్ధుల మానసిక ఆరోగ్యంపై ఎప్ప‌టిక‌ప్పుడు శ్ర‌ద్ధ వ‌హిస్తూ వారి మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించేందుకు సైకాల‌జిస్ట్ ల‌ స‌హాయం అవ‌స‌ర‌మ‌వుతుంది. వాళ్ల‌కు కౌన్సిలింగ్ లు నిర్వ‌హించ‌డం వాళ్ల ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది, ఒత్తిడిని త‌గ్గించుకునే మార్డాల అన్వేష‌ణ తదిత‌ర విష‌యాల‌పై చ‌ర్చ జ‌రిగేందుకు అవ‌కాశం ఏర్ప‌డి ఉండేది. కానీ కార్పోరేట్ కాలేజీలు మాత్రం సైకాల‌జిస్ట్ ల‌ను నియ‌మించుకునే విష‌యంలో మాత్రం మీనమేషాలు లెక్క‌పెడుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికైనా కార్పోరేట్ విద్యా సంస్థ‌లు నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుంటే కొన్ని ప్రాణాలు అయినా ద‌క్కుతాయి. త‌ల్లిదండ్రుల‌కు క‌డుపు కోత బాధ త‌ప్పుతుంది.

(ఈ ఆర్టిక‌ల్ ను స్పాన్స‌ర్ చేసిన‌వారు)