బీ కేర్‌ఫుల్..పిల్లలను క‌బ‌ళించే ‘పిశాచాలు’ ఉన్నాయి!

     

దిమ కాలంలో మ‌నిషి జంతు ప్ర‌వృత్తి క‌లిగి ఉండేవాడు. సొంతంగా ఆలోచించ‌డం మొద‌లుపెట్టి సంఘ‌జీవిగా మారి నాగ‌రిక‌త‌లను నిర్మించుకుని ఆధునిక మాన‌వునిగా రూపాంతరం చెందాడు. ఎల్ల‌లు లేని  ఆత్మ‌విశ్వాసంతో అద్భుత ప్ర‌యోగాలు చేస్తూ అంత‌రిక్షానికి కూడా నిచ్చెన‌లు వేస్తున్నాడు. అయితే సృష్టికి ప్ర‌తిసృష్టి చేయ‌గ‌లుగుతున్న‌ మ‌నిషి త‌న‌లోని జంతు ప్ర‌వృత్తిని మాత్రం వ‌ద‌ల్లేక‌పోతున్నాడు. క్రూర మృగాలు సైతం త‌న సొంత జాతిని చంపేందుకు సిద్ధ‌ప‌డ‌వు. అలాంటిది మ‌నుష్యులు మాత్రం అత్యంత అమానుషంగా, క‌ర్క‌శంగా త‌న తోటి వారి ప్రాణాల‌ను తీస్తున్నారు. హ‌త్య‌లు, అత్యాచారాలు చేస్తూ ఈ భూప్ర‌పంచంలో తానే అత్యంత ప్ర‌మాద‌క‌రమైన జంతువున‌ని ప‌దే ప‌దే రుజువు చేస్తున్నాడు. అన్నింటికంటే కంటే ఘోరం ఏంటంటే ఇటీవ‌లి కాలంలో చిన్న పిల్ల‌ల‌పై అకృత్యాలు పెచ్చుమీరిపోతున్నాయి. కొంద‌రు మాన‌సిక ఉన్మాదులు ముక్కుపచ్చలారని చిన్నారుల‌పై శారీర‌క‌, లైంగిక దాడులు చేయ‌డం చూస్తుంటే మ‌నం ఎటువంటి స‌మాజంలో జీవిస్తున్నాం అన్న అనుమానం క‌లుగుక‌మాన‌దు. ఇటువంటి భ‌యాన‌క ప‌రిస్థితుల్లో త‌ల్లిదండ్రులు మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించి త‌మ చిన్నారుల‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. దేశంలో క్రైం రికార్డ్స్ ను ప‌రిశీలిస్తే దిగ్భ్రాంతిక‌ర‌మైన వాస్త‌వాలు క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. పేరెంట్స్, స‌భ్య స‌మాజం ఎంత ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలో అన్న విష‌యాన్ని అనుక్ష‌ణం గుర్తుకు చేస్తున్నాయి.

హ‌రియాణా ఉదంతంతో అయినా క‌ళ్లు తెరుస్తారా? 

తాజాగా హ‌రియాణాలోని ర్యాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ లో జ‌రిగిన ఏడేళ్ల చిన్న పిల్ల‌వాడి హ‌త్య మాన‌వతావాదుల గుండెల్ని పిండేసింది. స్కూల్ బాత్రూమ్ లో ఆ చిన్న పిల్ల‌వాడ్ని క‌ర్క‌శంగా గొంతు కోసి హ‌త‌మార్చారు. ఆ స్కూల్ లో ప‌నిచేసే ఓ బ‌స్ కండ‌క్ట‌ర్ లైంగిక దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్టు పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఒక ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ లోనే ఒక పిల్ల‌వాడికి ర‌క్ష‌ణ లేన‌ప్పుడు బ‌య‌ట స‌మాజంలో ప‌రిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు. త‌ల్లిదండ్రులు పిల్ల‌వాడిని స్కూల్ కు పంపేసాం. మా ప‌ని అయిపోయింది అని నిబ్బరంగా ఉండేందుకు వీలులేని ప‌రిస్థితులు నెల‌కొని ఉన్నాయి. స‌మాజంలో మానవ మృగాలు పెరిగిపోయిన క్ర‌మంలో అనుక్ష‌ణం ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణ‌తో తమ చిన్నారుల‌ను కాపాడుకోవాలి. అన్ని భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు స‌రిగ్గా ఉన్నాయ‌ని న‌మ్మ‌కం క‌లిగాకే మీ పిల్ల‌ల‌ను స్కూల్ లో జాయిన్ చేయండి.విదేశాల‌తో పోల్చుకుంటే మ‌న‌దేశంలో పిల్ల‌ల‌కు స‌రైన భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు లేవు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉండే అన్ని ప్ర‌తికూల‌తలు మ‌న‌దేశంలో ఉన్నాయి. కాబ‌ట్టి త‌మ పిల్ల‌ను భ‌ద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రులదే.

చిన్నారుల‌పై పేట్రేగిపోతున్న ఉన్మాదులు! 

ఇండియాలో వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త అనేది చాలా క‌ష్ట‌మైన వ్య‌వ‌హారం. అధిక జ‌నాభా క‌లిగిన దేశం కావ‌డం వ‌ల‌న పౌరుల‌కు భద్ర‌త క‌ల్పించ‌డం ప్ర‌భుత్వాల‌కు త‌ల‌కు మించిన ప‌ని. భద్ర‌తా విష‌యంలో ఈ డొల్ల‌త‌నాన్ని ఆస‌రా చేసుకునే మాన‌సిక ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. మానవ‌త్వం మ‌రిచి ఆడవాళ్లు, చిన్నారుల‌పై దాడులు చేస్తున్నారు. 2005 లో చిన్న పిల్ల‌ల‌పై జ‌రిగిన నేరాల సంఖ్య‌ 14,975 ఉంటే 2015 నాటికి ఆ సంఖ్య 94,172 కు చేరుకుంది. అంటే మ‌న దేశంలో జ‌నాభా పెరుగుద‌ల రేటు కంటే చిన్న పిల్ల‌ల‌పై పెరుగుతున్న నేరాల రేటే ఎక్కువ‌.  ధ‌న‌వంతులతో పోలిస్తే మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పేద కుటుంబాల్లో పిల్ల‌ల‌కు మ‌రింత‌ ముప్పు పొంచి ఉంది. చిన్న పిల్ల‌ల‌పై దాడులు ఎక్కువ‌గా పేద కుటుంబాల్లోనే జ‌రుగుతున్నాయి. పేద కుటుంబాల్లో పిల్ల‌ల‌పై దాడులు చేయ‌డ‌మే కాదు వారిని చ‌దువుకు దూరం చేసి నేర‌గాళ్లుగా త‌యారు చేస్తున్నారు. పిల్ల‌ల‌పై దాడులు జ‌రిగే అవ‌కాశ‌మున్న ప‌రిస్థితుల‌ను, ప్రాంతాల‌ను గుర్తించి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ప్ర‌భుత్వాలు మీన మేషాలు లెక్కిస్తూ కూర్చోవ‌డం భావి త‌రాల‌కు శాపంగా మారింది.

పిల్లల‌పై నేరాలు అరిక‌ట్టాలంటే ఏం చేయాలి? 

పిల్ల‌ల‌పై ఈ దారుణ దాడుల‌ను అరికట్టేలా చేయ‌డంలో ప్ర‌భుత్వాలదే ప్ర‌ధాన బాధ్య‌త‌. పోలీస్ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్టం చేసి, స్కూల్ యాజ‌మాన్యాల‌కు క‌ఠినమైన నియ‌మ‌, నిబంధ‌న‌ల‌ను విధిస్తే ఇటువంటి ఘోరాలు కొంత‌వ‌ర‌కు అయినా త‌గ్గేందుకు వీలుంది. ముఖ్యంగా పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ త‌క్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో భ‌ద్ర‌త‌ను పెంచాలి. అయితే అటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ప్ర‌భుత్వ యంత్రాంగాలు విఫ‌ల‌మ‌వుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు హైద‌రాబాద్ లోని పేద‌లు, వ‌ల‌స వ‌చ్చిన వారు ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో చిన్నారుల‌పై దాడులు వ‌రుసగా పెరుగుతున్నా ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. దీంతో ఇటువంటి ఘోరాలు వ‌రుస‌గా జ‌రుగుతూనే ఉన్నాయి.

  • నిర్మాన్యుషంగా ఉండే ప్ర‌దేశాలు, పార్క్ ల‌లో భ‌ద్ర‌త‌ను ప‌టిష్ఠం చేయాలి.
  • నేరాలు జ‌రిగే అవ‌కాశం ఉంటే ప్రాంతాలు, ప్ర‌దేశాల్లో శాత్వ‌తంగా కొంద‌రు పోలీసుల‌ను నియ‌మించాలి.
  • మ‌న దేశంలో ల‌క్ష మంది పౌరుల‌కు కేవ‌లం 130 మంది పోలీసులు మాత్ర‌మే ఉన్నారు. ఇందులో రాజ‌కీయ‌నాయ‌కులు, ఇత‌రుల‌ భ‌ద్ర‌త‌కే ఎక్కువ మంది ఉన్నారు.
  • చిన్నారుల‌పై దాడులు అరిక‌ట్టాలంటే ముందుగా పోలీసు వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ఠం చేయాలి.
  • నేరాలు జ‌రిగే ఆస్కారం ఉన్న‌ ప్రాంతాల్లో త‌ల్లిదండ్రుల‌కు కౌన్సిలింగ్ నిర్వ‌హించాలి. పిల్ల‌ల‌ను ఎలా జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలో తెలియజేయాలి.
  • టెక్నాల‌జీని ఉప‌యోగించి నేరగాళ్లు తిరిగే ప్రాంతాల‌ను గుర్తించి అక్క‌డ భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయాలి.

చిన్నారుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో త‌ల్లిదండ్రుల‌దే కీల‌క‌పాత్ర‌! 

ప్ర‌భుత్వాలు, పోలీసు వ్య‌వ‌స్థలు ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్టాయ‌న్న‌ది ప‌క్క‌న పెడితే త‌మ చిన్నారుల‌ను కాపాడుకోవ‌డంలో పేరెంట్స్ దే ముఖ్య‌పాత్ర. స్కూల్ లో జాయిన్ చేసేసాం మ‌న ప‌ని అయిపోయింది. మా పిల్ల‌లు క్షేమంగా ఉంటార‌ని ఆలోచించ‌డం ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అవివేకం అనిపించుకుంటుంది. మీ చుట్టుప‌క్క‌ల ప‌రిస‌రాలు మొద‌లుకుని, స్కూల్ ప‌రిస‌రాల వ‌ర‌కూ పిల్ల‌ల భ‌ద్రంగా ఉన్నార‌ని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష చేసుకోవాల్సిందే.

  • అప‌రిచితులు మీ పిల్ల‌ల‌తో చ‌నువుగా మెలిగేందుకు ప్ర‌య‌త్నిస్తే వెంట‌నే జాగ్ర‌త్త ప‌డండి.
  • స్కూల్ లో లేదా బ‌స్, ఆటోల్లో ఎవ‌రైనా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని పిల్ల‌లు చెపితే తేలిగ్గా తీసిపారేయ‌కండి.
  • పిల్ల‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక దాడుల్లో అధిక శాతం మంది నిందితులు ఆ కుటుంబానికి ప‌రిచ‌య‌స్తులే . కావున పరిచ‌య‌స్తులైనా స‌రే వారి ప‌రిధి దాటి పిల్ల‌ల‌తో చ‌నువుగా ఉండేందుకు అనుమ‌తించ‌కండి.
  • పిల్ల‌ల‌ను ఒంటరిగా దుకాణాల‌కు పంప‌డం, రాత్రిళ్లు వేరే చోట‌కి వెళ్లేందుకు అనుమ‌తించ‌డం అస్స‌లు చేయ‌కండి.
  • అప‌రిచితులు ఏమైనా తినుబండారాలు, బ‌హుమ‌తులు ఇస్తే తిర‌స్క‌రించడాన్ని పిల్ల‌ల‌కు నేర్పించండి.
  • పిల్ల‌ల భ‌ద్ర‌త కోసం వారితో ప్ర‌త్యేకమైన కోడ్ ను కంఠ‌తా చేయించండి. మీరు కాకుండా వారిని తీసుకెళ్లేందుకు వేరే వ్య‌క్తులు వ‌స్తే ఆ కోడ్ చెప్ప‌మ‌ని అడిగేలా పిల్ల‌ల‌కు త‌ర్ఫీదు ఇవ్వండి.
  • ప్ర‌తీ రెండు వారాల‌కు ఒక‌సారి స్కూల్ కు వెళ్లి అక్క‌డ మీ పిల్ల‌ల‌కు ఎటువంటి స‌దుపాయాలు ఉన్నాయో తెలుసుకొండి. అక్క‌డ మీ పిల్ల‌ల‌కు భ‌ద్ర‌త లేద‌ని అనిపిస్తే వెంట‌నే  ఆ స్కూల్ మార్చేయండి.