దేశ‌భ‌క్తిని నిరూపించుకోవాలంటే ఆ ప‌నులు చేయాల్సిందేనా?

ఒక దేశంలో పుట్టిన పౌరునికి ఆ దేశంపై క‌చ్చితంగా భ‌క్తి ఉండాలి. ఎందుకంటే అమ్మ జ‌న్మ‌నిస్తే పుట్టిన గ‌డ్డ జీవితాన్ని ఇస్తుంది. అమ్మ రుణం తీర్చుకునేందుకు అవకాశాలు ఉంటాయోమో కానీ జ‌న్మ‌భూమి రుణం తీర్చుకోవ‌డం అంత సులువు కాదు. అందుకే పుట్టిన గ‌డ్డకు జీవితాంతం రుణ ప‌డి ఉండాలి. దేశ సంక్షేమం కోసం ఏ చిన్న అవకాశం వ‌చ్చినా సేవ చేసేందుకు ప్ర‌తీ పౌరుడు సిద్ధంగా ఉండాలి. ఇటీవ‌లి కాలంలో ప్ర‌సార మాధ్య‌మాల్లో, సోష‌ల్ మీడియాలో దేశ‌భ‌క్తి అంశం చ‌క్క‌ర్లు కొడుతోంది. ముఖ్యంగా సినిమా హాళ్లలో జాతీయ గీతం ప్ర‌ద‌ర్శించ‌డం, సినిమా చూసేందుకు వ‌చ్చిన‌ ప్రేక్ష‌కులు నిల్చుని జాతీయ గీతాన్ని గౌర‌వించ‌డంపై ప్ర‌జ‌లు రెండు వ‌ర్గాలుగా విడిపోయి వాడి వేడి చ‌ర్చ‌కు తెర‌లేపారు. దేశ‌భ‌క్తి అనేది అంత‌ర్గ‌త విష‌య‌మా లేక బ‌ల‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌జేసేదా అన్న దానిపై మొదటి నుంచి రెండు ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌ అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ప్ర‌భుత్వం దేశ‌భ‌క్తి అనే దాన్ని బ‌ల‌వంతంగా ప్ర‌జ‌ల‌పై రుద్ద‌డం, ఈ సున్నిత‌మైన విష‌యాన్ని అడ్డుపెట్టుకుని త‌మ లోపాల‌ను కప్పిపుచ్చుకోవాలని ప్ర‌య‌త్నించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. దేశ‌భ‌క్తి అంటే బ‌య‌ట‌కు ప్ర‌ద‌ర్శించే బాహ్య విష‌యం అస్స‌లు కాదు, అది నిజాయితీతో కూడిన అంత‌ర్గ‌త విష‌యం. విద్యార్ధులు, ఉద్యోగులు ఈ కీల‌క విష‌యాన్ని గుర్తిస్తే వాస్త‌వానికి,భ్ర‌మ‌కు మ‌ధ్య ఉన్న స‌న్నని గీత ద‌ర్శ‌న‌మిస్తుంది.

 

 

దేశభ‌క్తికి ప్రామాణికం ఏంటి?

 

సినిమా హాళ్ల‌లో సినిమా ప్ర‌ద‌ర్శించే ముందు జాతీయ గీతం త‌ప్ప‌న‌స‌రిగా ఉండాల‌న్న నిబంధ‌న తెచ్చిన‌ప్పుడు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. జాతీయ గీతం కోసం నిమిషం పాటు నిల‌బ‌డి ఉండ‌లేమా అని కొంద‌రు. నిమిషం పాటు నిల‌బ‌డితే దేశంపై ప్రేమ ఉన్న‌ట్టా? అని మ‌రికొంద‌రు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. అయినా ప్ర‌భుత్వం మాత్రం సినిమా హాళ్ల‌లో జాతీయ గీతాన్ని త‌ప్ప‌ని స‌రి చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో అయిష్టంగా నిల‌బ‌డే వారు కొంద‌రైతే నిల‌బ‌డని వారిపై సాటి ప్రేక్ష‌కులు దాడి చేసిన ఘ‌ట‌న‌లు చాలానే చోటు చేసుకున్నాయి. ఒక సున్నిత‌మైన విష‌యాన్ని ప్ర‌భుత్వం ఇలా జ‌ఠిలం చేసి దేశ‌భ‌క్తికి ప్రామాణికాన్ని త‌యారు చేయాల‌ని అనుకోవ‌డం వివాదాల‌కు దారితీసింది. ఇక నోట్ల రద్దు స‌మయంలోనూ దేశ‌భ‌క్తి అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. నోట్ల ర‌ద్దుతో ఇబ్బందుల తలెత్తిన‌ప్పుడు దేశ‌భ‌క్తి ఉన్నవాళ్లు ఈ ఇబ్బందిని సంతోషంగా భ‌రించాల్సిందేనని ప్ర‌భుత్వ వ‌ర్గాలు మ‌రోసారి సున్నిత‌మైన విష‌యాన్ని వాడుకున్నారు. దేశ‌భక్తి ఉన్నావాళ్లు ఏటీఎం ల ముందు ఎన్ని గంట‌లైనా నిల్చుంటార‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. ఏటీఏం ల ముందు గంట‌ల కొద్దీ నిల్చోవ‌డానికి ,దేశ‌భ‌క్తికీ మ‌ధ్య సంబంధం ఏంటో చాలా మందికి ఇప్ప‌టికీ అర్ధం కాలేదు.

 

 

దేశ‌భ‌క్తిని నిరూపించుకోవాలంటే ఏం చేయాలి?

 

దేశ‌భ‌క్తిని నిరూపించుకోవ‌డం అంటే సినిమా థియేట‌ర్ లో జాతీయ గీతం రాగానే లేచి నిల‌బ‌డి త‌ర్వాత దేశం ప‌ట్ల బాధ్య‌త లేకుండా ప్ర‌వ‌ర్తించ‌డం కాదు. దేశ‌భ‌క్తి అంటే దేశం ప‌ట్ల బాధ్య‌త క‌లిగి ఉండ‌టం. మ‌న చుట్టు ప‌క్క‌ల ప‌రిస‌రాల ప‌ట్ల‌, మ‌నుష్యుల ప‌ట్ల‌, స‌మాజం ప‌ట్ల ఒక బాధ్య‌త‌ను క‌లిగి ఉండ‌టం నిజ‌మైన దేశభ‌క్తి. అనాధ‌లు, వ‌యోవృద్ధుల‌కు చేత‌నైన స‌హాయం చేయ‌డం వారు స‌మాజంలో ధైర్యంగా బ‌తికేందుకు అనువైన ప‌రిస్థితుల‌ను క‌ల్పించ‌డం కూడా దేశ‌భ‌క్తిలో ఒక భాగ‌మే. అంతే కానీ తీరిగ్గా సినిమా చూడ‌టానికి వెళ్లి నిమిషం పాటు మొక్కుబ‌డిగా న‌లుగురితో పాటు నిల్చుని నాకు దేశం ప‌ట్ల అప‌రిమిత‌మైన ప్రేమ‌, భ‌క్తి ఉన్నాయి అనుకుంటే అంత‌కంటే ఆత్మ‌వంచ‌న మ‌రొక‌టి ఉండ‌దు. మూడు గంట‌ల పాటు సినిమా చూసో లేక డ‌బ్బులు డ్రా చేయ‌డానికి ఏటీఎం ముందు నిల్చునో నేనే ఏ దేశంలో అతిపెద్ద దేశ‌భ‌క్తి అనుకుంటే మన‌ల్ని ఆ దేవుడు కూడా కాపాడ‌లేడు. అది మ‌న అజ్ఞానం మాత్ర‌మే కాక దేశ‌భ‌క్తి పేరు చెప్పి మ‌న‌ల్ని ఉచ్చులోకి లాగుతున్న రాజ‌కీయ నాయకుల వ‌ల‌లో మ‌నం ప‌డిన‌ట్టే.

 

నిజ‌మైన దేశ‌భ‌క్తులకు గౌర‌వం ద‌క్కుతోందా?

 

మ‌న దేశంలో నిజ‌మైన దేశ‌భ‌క్తులంటే స‌రిహ‌ద్దులో కాపలా కాసే సైనికులు, జ‌నాల‌కు తిండి పెట్టే రైతు, భావి భార‌త పౌరుల‌ను త‌యారు చేసే ఉపాధ్యాయుడు. కానీ మ‌నం దేశంలో ఈ దేశ‌భ‌క్తుల‌కు ద‌క్కాల్సినంత గౌర‌వం ద‌క్కుతుందా అంటే అవును అని ట‌క్కున స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే వీళ్లు ఎప్పుడూ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారి గానే మిగిలిపోతారు. ప్ర‌జ‌ల నుంచి రావాల్సినంత గుర్తింపు రాదు. పోనీ ప్ర‌భుత్వం వీరి సంక్షేమం కోసం ఏమైనా చ‌ర్య‌లు చేప‌డుతుందా అంటే అదీ లేదు. నిజ‌మైన దేశ‌భ‌క్తులకు మ‌న దేశంలో ద‌క్కే గౌర‌వం ఇలా ఉంటుంది. డ‌బ్బులు కోసం సినిమాల్లో యాక్ట్ చేస్తూ త‌మ‌ను తాము దైవాంశ‌సంభూతులుగా భావించుకునే సినీ స్టార్లు, కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన వ్యాపార‌స్తులకే సోసైటీలో క్రేజ్. ప్ర‌భుత్వం కూడా ఇటువంటి వారిని కాపాడేందుకే అధిక ప్రాధాన్య‌త‌నిస్తుంది.

 

త‌ప్పులు క‌ప్పిపుచ్చుకునేందుకు తెర‌పైకి దేశ‌భ‌క్తి కార్డు!

 

ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తీ ఒక్క‌రికీ కొన్ని హ‌క్కుల‌తో పాటు కొన్ని బాధ్య‌తలు కూడా ఉంటాయి. అలాగే ప్ర‌భుత్వాలు కూడా త‌మ సొంత అజెండాతో కాకుండా దేశానికి, ప్ర‌జ‌ల‌కు మేలు చేసే నిర్ణ‌యాల‌ను తీసుకుని అందుకు అనుగుణంగా ప‌రిపాలించాల్సి ఉంటుంది. కానీ గ‌డిచిన కొన్ని రోజులుగా ప్ర‌భుత్వం తాము తీసుకున్న నిర్ణ‌యాలు విఫ‌లం కావ‌డంతో ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు దేశ‌భ‌క్తి అనే కొత్త అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. దేశ‌భ‌క్తి అనేది పౌరుల వ్య‌క్తిగ‌త విష‌యం. మీరు త‌ప్ప‌నిసరిగా దేశ‌భ‌క్తిని క‌లిగి ఉండాల‌ని ఆదేశించ‌డం అంటే అది నియంతృత్వం కింద‌కు వ‌స్తుంది. ముంద‌స్తు ప్ర‌ణాళిక లేకుండా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం అది విఫ‌లం కాగానే వాటిపై వ్య‌తిరేక‌త రాగానే అలా వ్య‌తిరేకించే వారిని దేశ‌ద్రోహులుగా ముద్ర వేయ‌డం స‌మంజ‌సం కాదు. అది ప్ర‌జాస్వామ్యానికి విరుద్దం.

 

(ఈ ఆర్టిక‌ల్ ను స్పాన్సర్ చేసినవారు)