‘పొగడ్త’ మంచిదే!!

 

త‌ల్లిదండ్రులుగా మార‌డం అన్న‌ది ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో ఒక మ‌ధురానుభూతి. పిల్లలు పుట్టాకే మ‌నిషి జీవితం ఒక అర్ధ‌వంత‌మైన మ‌లుపు తిరుగుతుంది. మ‌నిషిగా జీవితానికి ఒక సార్ధ‌క‌త ఏర్ప‌డుతుంది. అయితే పిల్ల‌ల పెంప‌కం అనేది అంత సులువైన‌ విష‌యం కాదు. పిల్ల‌ల వ‌య‌స్సు ఎంత ఉన్న కానీ త‌ల్లిదండ్రుల బాధ్యత అన్న‌ది తీరిపోయేది కాదు. పిల్ల‌లను ఎలా ప్రేమించాలి? వాళ్ల‌కు భ‌ద్ర‌మైన వాతావ‌ర‌ణం ఎలా క‌ల్పించాలి? ఏది మంచి..ఏది చెడు అన్న‌ది విడ‌మ‌ర్చి చెప్ప‌డం.? అన్న‌ది నిరంత‌రం సాగే ప్ర‌క్రియ‌. చివ‌రికి ఒక పిల్ల‌వాడు స్వ‌తంత్రంగా, విలువ‌ల‌తో, పెద్ద‌ల ప‌ట్ల గౌర‌వంతో, పూర్తి ఆత్మ‌విశ్వాసంతో ఎంత బాగా ఎదిగాడ‌న్న‌ది త‌ల్లిదండ్రుల పెంప‌కంపై ఆధార‌ప‌డి ఉంటుంది. మంచి స‌మ‌ర్ధ‌త క‌లిగిన త‌ల్లిదండ్రులు మాత్రమే మ‌న ఇప్పుడు చెప్పుకున్న ల‌క్ష‌ణాల‌తో త‌మ పిల్ల‌ల‌ను పెంచ‌గ‌ల‌రు. అంద‌రూ తాము మంచి తల్లిదండ్రులుగా ఉంటూ త‌మ పిల్ల‌ల‌ను బాగా పెంచాల‌ని అనుకుంటారు. అయితే చివ‌రికి కొంద‌రు మాత్ర‌మే మంచి త‌ల్లిదండ్రులు అనిపించుకుంటారు. అయితే కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే అంద‌రూ త‌మ పిల్ల‌ల‌కు మంచి పెంప‌కాన్ని అందించి గుడ్ పేరెంట్స్ గా మారొచ్చు. పిల్ల‌ల‌కు అంద‌మైన భవిష్య‌త్ ను కానుక‌గా ఇవ్వొచ్చు.

 

 

మీ పిల్ల‌ల‌కు ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల‌ను పంచిపెట్టండి!

 

మీ పిల్ల‌ల‌కు ప్రేమ‌ను అందిస్తూ వాళ్ల‌తో ఆప్యాయంగా మెల‌గ‌డం అన్న‌ది పేరెంటింగ్ లో చాలా కీల‌కం. ప్రేమ అనేదే పిల్ల‌ల‌తో మీ బంధానికి పునాది. ఒక వెచ్చ‌ని స్ప‌ర్శ‌, ఒక భ‌ద్ర‌త‌తో కూడిన కౌగిలి వాళ్ల‌ను మీకు మానసికంగా చాలా ద‌గ్గ‌ర చేస్తాయి. చ‌క్క‌టి అనుబంధంతో త‌ల్లిదండ్రులతో పెరిగిన పిల్ల‌లు ఉన్న‌త స్థానానికి ఎదిగిన‌ట్టు శాస్త్రీయ ప‌రిశోధ‌న‌లు రుజువు చేస్తున్నాయి. ఒక అప్యాయ‌పూరిత కౌగిలి, మొఖంపై చ‌క్క‌ని చిరున‌వ్వు, ఒక మెచ్చుకోలు, ప్రేమ‌తో కూడిన అనుమతి పిల్ల‌ల ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది. ప్ర‌తీ రోజూ వాళ్ల‌ను మీరు ఎంత ప్రేమిస్తున్నారో తెలియ‌జేయండి. కోపంలో ఉన్నాస‌రే వాళ్ల‌పై మీకు ఎంత ప్రేమ ఉంద‌న్న విష‌యం వాళ్ల‌కు తెలియాలి. మీ పిల్ల‌లు పుట్టిన ద‌గ్గ‌ర్నుంచి వాళ్ల‌కు వీలైన‌ప్పుడ‌ల్లా కౌగిలించుకొండి. వాళ్ల‌కు ఇబ్బంది లేకుండా ముద్దు పెట్టండి. స్ప‌ర్శ ద్వారా భద్రతను, ప్రేమను ఫీల్ అవుతారు. ఇది వాళ్లకు మానసిక ఎదుగులకు చాలా ముఖ్యమని పరిశోధకులు చెపుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు హద్దులు లేని ప్రేమను అందివ్వాలి. మీరు మా ప్రేమను పొందాలంటే ఫలానా విధంగా చేయాలి? ఈ పనులు చేస్తేనే మిమ్మల్ని ప్రేమిస్తాం..వంటి మాటలు పిల్లలు దగ్గర అస్సలు ఉపయోగించకండి.

 

 

మెప్పుకోలు పిల్లలకు ఉత్సాహాన్ని ఇస్తుంది!

 

పొగడ్త , మెచ్చుకోలు అనేది ఎవరికైనా సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది పిల్లల పెంపకంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. వాళ్లు ఏదైనా ఒక మంచి పని చేయగానే మనస్ఫూర్తిగా అభినందించి, ఆ పని చేసినందుకు వాళ్లను మెచ్చుకోండి. ఇది వాళ్లకు ఎనలేని శక్తిని ఇస్తుంది. మీరు ఇలాంటి పని కనుక చేయకుంటే వాళ్లు తమపై తాము నమ్మకం కోల్పోయి మెల్లగా ఈ ప్రపంచం నుంచి వేరై తమను తాము ఎందుకు పనికిరానివారుగా భావించుకుంటారు. మీ పిల్లలను ఒక మంచి పని చేసినప్పుడు వాళ్లను బాగా మెచ్చుకోవడంతో పాటు ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు సున్నితంగా మందలించాలి. అయితే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అనేది వాళ్లపై చాలా ప్రభావం చూపుతుంది. మందలించిటప్పుడు చాలా నెమ్మదిగా చెప్పి ఆ పని చేయడం వలన వచ్చే పర్యవసానాలు వివరించాలి. నువ్వు చాలా మంచి పిల్లాడివి కదా ఆ పని ఎందుకు చేసావు? అన్న రీతిలో ఆ మందలింపు ఉండాలి. పిల్లలకు ప్రోత్సాహం లభిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అయితే మెచ్చుకోలు లో నిజాయితీ, వివరణ కూడా ఉండాలి.

 

 

ఇతరులతో మీ పిల్లలను అస్సలు పోల్చకండి

 

ప్రతీ పిల్లవాడు ఒక ప్రత్యేకం. తనదైన ప్రత్యేక లక్షణం, ప్రతిభతో ప్రతీ ఒక్కరిలో ఎనలేని శక్తి ఉంటుంది. ఇతరులతో పోల్చడం అనేది పిల్లల పెంపకంలో అస్సలు వద్దు. మిగిలిన పిల్లలతో పోల్చి నువ్వు ఎందుకూ పనికిరావు అన్న ఒక వ్యాఖ‌్య మీ పిల్లవాడిని పాతాళంలోకి తోసేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి నిజంగానే ఎందుకూ పనికిరాకుండా పోతాడు. పిల్లలపై విష‍యంలో తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రతికూల వ్యాఖ్యలు చేయకూడదు. ఇలా చేయడం వలన వాళ్లలో ఆత్మన్యూనతా భావం పెరిగిపోతుంది. ఈ సృష్టిలో మీ పిల్లవాడు ఒక ప్రత్యేకమైన వాడు. అతన్ని అతని తోబుట్టువులతోనూ ఇతర స్నేహితులతోనూ ఎప్పుడూ పోల్చకండి. అతను ఇక్కడ మిగిలిన వాళ్లతో పోటీపడటానికి, వాళ్లలా మారడానికి లేడు. తనదైన ప్రతిభతో తన ప్రత్యేకతను చాటుకుంటూ స్వేచ్ఛగా ఎదిగేందుకు సృష్టించబడ్డాడు. అలాగే పిల్లల్లో ఎవర్నో ఒకర్ని ఎక్కువగా ఇష్టపడటం మిగిలిన వారిని అంతగా ఇష్టపడకపోవడం అన్నది కూడా చాలా తప్పు. అలా చేయడం పిల్లల ఎదుగుదలన తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పెంపకంలో పిల్లల మధ్య వ్యత్యాసం చూపించడం వాళ్లను మానసికంగా కుంగదీస్తుంది.

 

 

పిల్లలు చెప్పింది వినండి!

 

మీ పిల్లలతో మీకెప్పుడూ ఆరోగ్యకరమైన సంభాషణ ఉండాలి. మీరు చెప్పింది వాళ్లు వింటున్నట్టే వాళ్లు చెప్పింది కూడా మీరు ఓపిగ్గా వినండి. వాళ్లు మనసులో ఏమనుకుంటున్నారో , వాళ్లు మీతో చెప్పాలనుకుంటున్నారో అర్ధం చేసుకోండి. మీతో ఏ విష‍యమైనా స్వేచ్ఛగా చెప్పగలిగే వీలు కల్పించండి. అప్పుడే వాళ్లు మీతో స్నేహితులుగా ఉంటారు. లేదంటే అన్ని విషయాలు తమలో దాచుకుని సమస్యకు సరైన పరిష్కారం కనుక్కోలేక తప్పుడు సలహాలతో దారి తప్పుతారు. పిల్లవాడు సందిగ్దంలో ఉన్నప్పుడు అతనికి మంచి సలహా చెప్పే స్నేహితుడు మీరే కావాలి. ప్రతీరోజూ పడుకునే ముందు కానీ బ్రేక్ ఫాస్ట్ సమయంలో కానీ వాళ్లతో కొంచెం సమయం గడపండి. పిచ్చాపాటీ మాట్లాడండి. మీరెప్పుడు మీ పిల్లవాడి తెలివిని తక్కువ అంచనా వేయకండి. వాళ్లు చెప్పాలనుకుంటున్న విషయాన్ని శ్రద్ధగా వినండి. వాళ్లకు తగిన ధైర్యం ఇవ్వండి.

 

 

మీ పిల్లల కోసం సమయాన్ని సృష్టించుకోండి!

 

ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం అస్సలు సమయమే కేటాయించలేకపోతున్నారు. మీరు మీ పిల్లల కోసం తగినంత సమయం కేటాయించలేకపోతున్నారంటే మీరే దేనికోసమైతే పగలు రాత్రీ కష్టపడుతున్నారో అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మీ పిల్లలకు తగిన సమయం కేటాయించండి. వాళ్లతో మాట్లాడండి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడండి. వాళ్లతో కొంచెం సమయం గడపండి. వాళ్లతో పార్క్ లకు జూకి, మ్యూజియం కు ఇలా వాళ్లకి ఇష్టమైన ప్రదేశానికి వెళుతూ ఉండండి. వాళ్ల స్కూల్ ఫంక్షన్ కు హాజరుకండి. అలాగే పిల్లల ప్రవర్తనపై టీచర్ తో మాట్లాడండి. వాళ్ల చదువు గురించి టీచర్ తో చర్చించండి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)