2018 లో తల్లిదండ్రులు ఈ తీర్మానాలు తప్పక తీసుకోవాలి!

 

కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాము. కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త లక్ష్యాలతో ఈ ఏడాదిని ప్రారంభించాలని అందరూ తీర్మానాలు చేసుకుంటారు. కొందరు కెరీర్ ను నిర్మించుకోవాలని మరికొందరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఇంకొందరు ప్రణాళికాబద్ధంగా జీవించాలని ఇలా ఏవేవో ప్లానింగ్ చేస్తారు. వ్యక్తిగత తీర్మానాలను కాస్త పక్కన పెడితే ఈ నూతన సంవత్సరంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పెంపకంలో కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. విలువలతో కూడిన పెంపకాన్ని వారికి అందించేందుకు వాళ్లను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇప్పటి వరకూ చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని కొంగ్రొత్తగా తీర్మానాలు చేసుకుని వాటికి అనుగుణంగా పిల్లల బంగారు భవిష్యత్ కు బాటలు వేయాలి.

 

1. పిల్లలకు అభద్రతా భావం కలగనీయకండి

 

భయంభయంగా పెరిగే పిల్లల్లో అభద్రతా భావం గూడుకట్టుకుపోతుంది. ఇటువంటి పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి పిరికివాళ్లుగా తయారవుతారు. తమ పిల్లలు ధైర్యంతో ఉన్నారా? లేదా అన్నది తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలి. చాలా మంది తల్లిదండ్రులు తమకు తెలీకుండానే పిల్లలకు అభద్రతాభావాన్ని కలిగిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మీ పిల్లలను అలా ఎప్పటికీ కానీయకండి. వారు ఎటువంటి భయాలకు లోనుకాకుండా పూర్తి భద్రతతో స్వేచ్ఛగా పెరిగేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. కాబట్టి పెంపకంలో అభద్రత అనేదాన్ని మీ పిల్లల దరిచేరకుండా చూసుకొండి.

 

 

2. పిల్లలు మంచి లక్ష్యాన్ని ఏర్పరుచుకునేలా చేయండి

 

పిల్లలు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకునేలా మీ పిల్లలను ప్రోత్సహించండి. అలా జరగాలి అంటే పిల్లలు చేసే మంచి పనులను ఎప్పటికప్పుడు మెచ్చుకొండి. గుర్తింపు లభించడం అన్నది పిల్లలకు ఎనలేని శక్తిని ఇస్తుంది. గుర్తింపు పొందే వాతావరణం అన్నది పిల్లల పెంపకంలో చాలా ముఖ్యమైన విషయం. ఈ కొత్త సంవత్సరంలో తల్లిదండ్రులు ఈ తీర్మానాన్ని కచ్చితంగా తీసుకోవాలి.

 

3. మీ పిల్లలతో అధిక సమయం గడపండి!

 

ఈ ఏడాది మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సిన తీర్మానాల్లో ఇది కచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలతో అధిక సమయం గడపలేకపోతున్నారు. ఉద్యోగం, కెరీర్ అంటూ పరుగెత్తడంతో పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతుంది. ఇది పెంపకంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. కెరీర్ కు ఉద్యోగానికి ఇంపార్టెన్స్ ఇస్తూనే అదే సమయంలో వాళ్లతో గడిపేందుకు తగిన సమయ ప్రణాళిక వేసుకోండి. వాళ్లతో కలిసి ఆటలాడేలా, వాళ్లతో కలిసి పుస్తకాలు చదివేలా ప్రణాళిక తయారు చేసుకుంటే మంచిది. వాళ్లలో ఒకడిలా , స్నేహితుడిలా కలిసిపోతే అది వాళ్లకు మధుల జ్ఝాపంగా మిగిలిపోతుంది.

 

 

4. ఎట్టి పరిస్థితుల్లోనూ సహనాన్ని కోల్పోకండి!

 

పిల్లల పెంపకంలో సహనం అనేది చాలా చాలా ముఖ్యం. మీరు సహనం కోల్పోతే మీరు మంచి తల్లిదండ్రులు ఎప్పటికీ కాలేరు. గతంలో మీరు సహనం కోల్పోయిన సమయాలను వదిలేయండి . ఈ కొత్త ఏడాదిలో సహనం కోల్పోకుండా ఉండాలని గట్టిగా అనుకోండి. పిల్లలు ఎంత విసిగించినా సహనాన్ని మాత్రం కోల్పోకండి. ఇలా మీరు సహనంతో ఉండటం అనేది వాళ్లలో ఓపికను పెంచుతుంది. మీ నుంచి ఈ మంచి గుణాన్ని వారు నేర్చుకుంటారు.

 

5. కల్మషం లేకుండా ఉండండి!

 

మీ పిల్లలను మీరు పరిపూర్ణ వ్యక్తులుగా చూడాలి అనుకుంటే ముందు మీరు అలా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనసులో ఎటువంటి కల్మషం వ్యక్తులు మాత్రమే పరిపూర్ణులవుతారు. మీ పిల్లలపై అదుపుతో కూడా అమితమైన ప్రేమను కురిపించండి. అలాగే మీ మాటలో, ప్రేమలో చివరికి కోపంలో కూడా ఎటువంటి కల్మషం లేకుండా నిజాయితీగా ఉండండి. వారు మెల్లగా ఆ గుణాన్ని మీ నుంచి నేర్చుకుంటారు. వాళ్ల మానసిక ఆరోగ్యం కుదుటపడి మంచి ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు.

 

 

6. భార్యభర్తల బంధం విలువను తెలియజేయండి!

 

మీ పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడకండి. ఇది పిల్లల మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. భార్యాభర్తలు గొడవ పడే ఇళ్లలో పెరిగే పిల్లలు పెద్దయ్యాక వాళ్ల వైవాహిక జీవితం కూడా చిధ్రమైనట్టు పరిశోధనలో తేలింది. కాబట్టి మీ పిల్లల ముందు ఎప్పుడూ గొడవ పడొద్దు. పైగా మీ బంధం ఎంత ధృఢమైనదో వాళ్ల తెలియజేసేలా చెప్పండి. ఒకరిని ఒకరు ఎంత గౌరవించుకుంటారో ఎంత సామరస్యంగా ఉంటారో వాళ్లకు తెలిసేలా చేయండి. ఇలా చేయడం వలన మీపై గౌరవం పెరగడమే కాదు భవిష్యత్ లో ప్రేమ విలువను వాళ్లు తెలుసుకుంటారు.

 

7. అవసరమైన సందర్భంలో పిల్లల్ని పొగడండి!

 

మీ పిల్లలు ఏదైనా ఒక ఘనత సాధించినప్పుడు వాళ్లను వెంటనే మెచ్చుకొండి. వాళ్లు చేసిన మంచి పనుల్ని కీర్తించండి. నువ్వు అలా చేసి మంచి పిల్లాడివి అని నిరూపించుకున్నావు..నువ్వు చాలా మంచి అబ్బాయివి. అని బాహాటంగా చెప్పండి. ఇలా చెప్పడం వాళ్లకు ఎనలేని శక్తిని ఇస్తుంది. తర్వాత మంచి పనులు చేసేందుకు వాళ్లను ప్రేరేపిస్తుంది.

 

 

8. అమర్యాదను అస్సలు సహించకండి!

 

మంచి పెంపకంలో ఇటువంటి చెడు సందర్భం అస్సలు ఎదురుకాదు. కానీ ఇప్పటికే మీరు కాస్త నిర్లక్ష్యం చేసి ఇకపై మంచి పెంపకం అందించాలనుకుంటున్నప్పుడు మీరు చేయాల్సిన ప్రక్షాళన కార్యక్రమాల్లో ఇదొకటి. తల్లిని కానీ లేదా తండ్రిని కానీ గౌరవించకపోతే అసలు సహించకండి. అది ఎంత చెడు విష‍యమో వాళ్ల తెలియేజేయండి. అలా మాట్లాడటం తగదని తల్లిదండ్రులను గౌరవించడం ఎలానో చెప్పండి. ఈ విష‍యంలో అలసత్వం అసలు పనికిరాదు.

 

9. ఆదర్శనీయుల కథలు చెప్పండి!

 

పిల్లలకు నిద్రపోయే సమయంలో వాళ్ల పక్కన కొద్ది సమయం గడపండి. స్పూర్తినిచ్చే ఆదర్శనీయుల జీవితాలను వాళ్లకు విడమర్చి చెప్పండి. ఎందుకు అతన్ని అందరూ కీర్తిస్తున్నారో, అతని ఏ గుణాలు ఇంతలా అందరికీ నచ్చాయో తెలియజెప్పండి. ఇధి వాళ్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. తమకు తెలికుండానే మీరు గొప్పగా చెప్పిన ఫలానా వ్యక్తిలా మారేందుకు వాళ్ల ప్రయత్నం వాళ్లు చేస్తారు.

 

10. విలువల యొక్క విలువ తెలియజెప్పండి

 

మీరు దయతో , నిజాయితీతో, గౌరవంతో ఉన్నప్పుడు మీ చుట్టు ఉన్న వారు కూడా అదే విధంగా ఉంటారు. ఎందుకంటే మీరు ఏది ఇస్తే అదే మీకు తిరిగి వస్తుంది. విలువ యొక్క గొప్పతనం అది. మీ పిల్లలకు కూడా విలువల యొక్క ప్రాముఖ్యతను వివరించి చెప్పండి. విలువలతో బతికితేనే భవిష్యత్ ఉంటుందని చెప్పండి. దాని కోసం మీరు విలువలతో జీవించడం నేర్చుకోండి. అప్పుడే మీ పిల్లలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)