పిల్ల‌లు చూస్తారు జాగ్ర‌త్త‌!!

 

మ‌నం ఏదైనా త‌ప్పు చేసేట‌ప్పుడు చాలా భ‌య‌ప‌డుతూ ఉంటాం. మ‌న‌ల్ని ఎవ‌రు చూసినా చూడ‌క‌పోయినా మ‌న మ‌న‌స్సాక్షికి, దేవుడికి భ‌య‌పడి మనం త‌ప్పు చేయకూడదు అని అనుకుంటాం. అయితే ఇది ఎవ‌రికైనా వ‌ర్తిస్తుందేమో కానీ త‌ల్లిదండ్రుల‌కు అస్స‌లు వ‌ర్తించ‌దు. ఎందుకంటే వాళ్లు మ‌న‌స్సాక్షికో, దేవుడికో భ‌య‌ప‌డి కాదు పిల్ల‌ల‌కు భ‌య‌ప‌డి ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. ఎందుకంటే త‌ల్లిదండ్రులు చేసే ప్ర‌తీ త‌ప్పు తెలియ‌కుండానే పిల్ల‌ల జీవితాన్ని ప్ర‌భావితం చేస్తుంది. పిల్లలకు తల్లిదండ్రులే ఆది గురువులు. తండ్రి చేయి పట్టుకుని నడక నేర్చుకుంటారు..తల్లి పలుకు విని మాట నేర్చుకుంటారు. వాళ్లు ఏం చేస్తే అది తామూ చేయాలని అనుకుంటారు. సైకాలజీ ప్రకారం చెప్పే విషయం కంటే చూసే విషయం ఎక్కువ ప్రభావితం చేస్తుంది. పెంపకంలో ఇదే చాలా కీలకమైన విషయం. మీ పిల్లలకు మంచి పెంపకం అందించాలని ఆరాటపడే తల్లిదండ్రులు ముందు తమను తాము మార్చుకుని వాళ్లకు ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు చూస్తారు జాగ్రత్త.

 

 

పెంపకంలో నిజాయితీ ముఖ్యం!

 

ఒక తండ్రి తన భార్య , ఇద్దరు పిల్లలతో కలిసి సర్కస్ చూడటానికి వెళ్లాడు. 5 ఏళ్లు పైబడిన పిల్లలకు టిక్కెట్ తప్పనిసరి అని అక్కడ బోర్డ్ ఉంది. తన పిల్లలు 5 ఏళ్లు దాటిన వారు అయినా చూడటానికి ఇంకా చిన్నపిల్లల్లానే కనిపిస్తారు. కాబట్టి టిక్కెట్ తీయాలా? వద్దా అన్న మీమాంస ఆ తండ్రికి ఎదురైంది. చాలా మంది తల్లిదండ్రులు అలా టిక్కెట్ తీయకుండానే తమ పిల్లలను లోపలకు తీసుకెళ్లిపోతున్నారు. కొద్ది సేపు సంఘర్షణ పడ్డ ఆ తండ్రి చివరికి తన పిల్లలకు టిక్కెట్ తీయాలనే నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే తన పిల్లలు ఇదంతా చూస్తున్నారు…టిక్కెట్ తీయకుండా సర్కస్ కంపెనీ వాళ్లను మోసం చేసి తాను తన పిల్లలకు ఎటువంటి సందేశం ఇవ్వదల్చుకున్నాడు? తన పిల్లలకు నిజాయితీ నేర్పించాలి. నిబంధనల ప్రకారం నడుచుకోవడం నేర్పించాలి. చిన్న మొత్తం మిగులుతుందని కక్కుర్తి పడితే తన పిల్లలు ఎటువంటి విలువలు నేర్చుకుంటారు. ఈ తండ్రి ఆలోచన విధానం ప్రతీ ఒక్క తల్లిదండ్రులకూ రావాలి. మీరు నిజాయితీగా ఉంటేనే మీ పిల్లలు నిజాయితీగా ఉంటారు. మీకు నిజాయితీ లేకపోతే మీ పిల్లల నుంచి కూడా నిజాయితీ ఆశించకండి. ఎందుకంటే పిల్లలు చూస్తారు జాగ్రత్త.

 

 

మీరు ఏం చేస్తే పిల్లలూ అదే చేస్తారు!

 

ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చెరో లక్ష రూపాయల డొనేషన్ కట్టి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించాడు. ఉదయాన్ని తన పిల్లలను స్కూల్లో దింపేందుకు తీసుకెళుతూ రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేస్తూ , రాంగ్ రూట్ లో డ్రైవ్ చేస్తూ, రోడ్డుపై బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ పిల్లలను స్కూల్ వద్ద దింపాడు. తన పిల్లలను కరెక్ట్ సమయానికి స్కూళ్లో దింపానని ఆనందపడ్డాడు. కానీ ఈ తండ్రి ప్రాథమిక దశలోనే విఫలం చెందాడు. అతని పిల్లలు ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూళ్లో చదివినా మంచి పౌరులుగా , మంచి వ్యక్తులుగా ఎప్పటికీ తయారు కాలేదు. ఎందుకంటే అతని పిల్లలు అతని నుంచి ఒక ప్రతికూల విషయాన్ని నేర్చుకుంటున్నారు. రోడ్డుపై బాధ్యత లేకుండా ప్రవర్తించడం, ట్రాఫిక్ రూల్స్ ను పాటించకపోవడం వంటి చెడు అలవాట్లు అతను తనకు తెలీకుండానే తన పిల్లలకు నేర్పిస్తున్నాడు. ఇలా పిల్లలకు ఒక నెగెటివ్ అంశం నేర్పిస్తున్నప్పుడు అతను మంచి తండ్రి ఎలా కాగలడు? అతని పిల్లల భవిష్యత్ కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ఆదర్శంగా ఉండటమే పేరెంటింట్ లో ఆదర్శంగా ఉండటమే ముఖ్యమైనది. ఎందుకంటే పిల్లలు చూస్తారు జాగ్రత్త.

 

 

పిల్లలు అబద్దాలు నేర్చుకునేది తల్లిదండ్రుల నుంచే!

 

పిల్లల ముందు వ్యవహారాలు నడిపేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రోజువారీ కార్యక్రమాల్లో కొన్ని సార్లు అబద్దాలు చెప్పాల్సిన రావడం సహజమే. అయితే అది పిల్లలు ముందు చెప్పకుండా తల్లిదండ్రులు కచ్చితంగా జాగ్రత్త పడాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. చాలా మంది తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్నప్పటికీ లేను అని చెప్పిస్తారు. ఫోన్ లో అబద్దాలు మాట్లాడుతూ ఉంటారు. ఇంకొందరు మరికాస్త ముందుకెళ్లి పిల్లలతోనే అబద్దాలు చెప్పిస్తారు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు నేను లేను అని వాళ్లకు చెప్పు అని చెపుతూ ఉంటారు. ఇటువంటి పద్ధతి చాలా పెద్ద పొరపాట్లకు దారితీస్తుంది. పిల్లల మనసుల్లో ఆ అబద్దాలు ప్రతికూల ఆలోచనలను రేకెత్తిస్తాయి. తల్లిదండ్రులపై గౌరవం పోవడమే కాదు. వాళ్లు కూడా తప్పుడు పనులు చేస్తూ తల్లిదండ్రులు ప్రశ్నించినప్పుడు చాలా సులువుగా అబద్దాలు చెప్పేస్తూ ఉంటారు. మా అమ్మా నాన్న చెప్పగా లేనిది నేను అబద్దాలు చెపితే తప్పేంటి? అన్న భావన వారి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అబద్దాలను చాలా సులువుగా చెపుతూ తమ భవిష్యత్ ఇబ్బందుల్లోకి నెట్టుకుంటారు. తల్లిదండ్రులు ఇది గమనించాలి. ఎందుకంటే పిల్లలు చూస్తారు జాగ్రత్త.

 

 

నేటి పౌరులే రేపటి బాలలు!

 

అదేంటి నేటి బాలలే రేపటి పౌరులు కదా? మీరెంటి పొరపాటుగా చెపుతున్నారు. అనుకుంటున్నారా? మేం పొరపాటు పడలేదు. నేటి పౌరులే రేపటి బాలలు. ఎందుకంటే నేటి పౌరుల ప్రవర్తనే రేపటి బాలల యొక్క భవిష్యత్. తల్లిదండ్రులు పెంపకంలో జాగ్రత్తలు తీసుకుని నిజాయితీగా ఉంటూ ఆదర్శంగా మసలగలిగితే మంచి బాలలు తయారవుతారు. మనం గతంలో చెప్పుకున్నట్టు మన బాల్యం మన చేతుల్లో లేదు కానీ మన పిల్లల బాల్యం మాత్రం కచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. వాళ్ల బాల్యాన్ని ఆనందమయం చేసి పెంపకంలో నిజాయితీని చూపగలిగితే మంచి పౌరులను తీర్చిదిద్దిన వారమవుతాం. పేరెంటింగ్ లో పిల్లలకు లైఫ్ స్కిల్స్ నేర్పించాలి కానీ తప్పులు చేస్తూ, అబద్దాలు చెపుతూ వాళ్లు ముందు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉంటే అది వాళ్ల లైఫ్ కిల్స్ గా మారుతుంది. నిజాయితీ ఉండండి, ఆదర్శంగా ఉండండి, వాళ్లకు స్పూర్తిగా నిలవండి . మిమ్మల్ని మీరు సదిదిద్దుకొండి. ఎందుకంటే పిల్లలు చూస్తారు జాగ్రత్త.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)