పిల్ల‌లు చెప్పింది పెద్ద‌లు వినాలి!!

 

పిల్ల‌ల‌కు తల్లిదండ్రులే ఆది గురువులు. స్కూల్ కు వెళ్ల‌కుముందు వెళ్లిన త‌ర్వాత కూడా పిల్ల‌లు చాలా విష‌యాల‌ను త‌ల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. ఆత్మ‌విశ్వాసం, ఆస‌క్తి, మ‌ర్యాద‌, శ్ర‌ద్ధ ఇలా ఏ విష‌య‌మైనా పిల్ల‌లు పేరెంట్స్ నే ఆద‌ర్శంగా తీసుకుంటారు. పిల్ల‌ల‌కు ఆద‌ర్శంగా ఉండ‌టం అనేదే పేరెంటింగ్ లో అతిముఖ్య‌మైన స‌వాలు. ఈ స‌వాలును స్వీక‌రించి నిజాయితీతో, గౌర‌వంతో, ఆద‌ర్శ‌ప్రాయ‌మైన జీవన విధానాన్ని ఎవ‌రు ఆచ‌రిస్తారో వాళ్ల పిల్ల‌లు మాత్ర‌మే ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో పెరుగుతున్న‌ట్టు. ముఖ్యంగా కొత్త‌గా బ‌య‌టి ప్ర‌పంచంలోకి వెళ్లిన‌ప్పుడు పిల్ల‌ల చిన్ని బుర్ర‌లో ఎన్నో సందేహాలు, ప్ర‌శ్న‌లు పుడ‌తాయి. వాటిని జాగ్ర‌త్త‌గా త‌మ చిన్ని బుర్ర‌లో దాచుకుని వాటికి స‌మాధానాలు చెప్ప‌మ‌ని త‌ల్లిదండ్రుల‌ను అడుగుతారు. కానీ కెరీర్ కే అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్న ఈ త‌రం త‌ల్లిదండ్రులకు పిల్ల‌ల సందేహాల‌ను తీర్చేందుకు స‌మ‌య‌మూ, ఓపిక రెండూ ఉండ‌టం లేదు. ఈ ప‌రిణామం పిల్ల‌ల మానసిక ఎదుగుద‌ల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది.

 

 

పేరెంటింగ్ లో మొద‌టి మెట్టు ఓపిక‌ను పెంచుకోవ‌డ‌మే!

 

 

ఒక జంట పిల్ల‌ల్ని క‌న‌డానికి సిద్ధ‌మ‌వ‌డం అంటే త‌మ‌ను తాము పూర్తిగా మార్చుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ‌ట‌మే. ఎందుకంటే ప్ర‌స్తుత కాలంలో పిల్ల‌ల్ని పెంచ‌డం అనేది ఆషామాషీ విష‌యం కాదు. శారీర‌కంగా, మాన‌సికంగా పూర్తి స్థాయిలో సంసిద్ధ‌మైతేనే ఈ పెద్ద‌ బాధ్య‌తను విజ‌య‌వంతంగా నిర్వ‌ర్తించేందుకు వీలు క‌లుగుతుంది. ముఖ్యంగా వైఖ‌రి ప‌రంగా భావోద్వేగాల‌ను అదుపు చేసుకుని ఓపిక‌ను పెంచుకోవ‌డ‌మే పిల్ల‌ల పెంప‌కంలో మొద‌టి మెట్టు. ఎందుకంటే శైశ‌వ ద‌శ నుంచి కౌమారం వ‌ర‌కూ పిల్ల‌లు ప్ర‌తీ క్ష‌ణం తల్లిదండ్రుల ఓపిక‌కు ప‌రీక్ష పెడుతూనే ఉంటారు. ముఖ్యంగా అప్పుడే స్కూల్ కు వెళ్తున్న పిల్ల‌లు త‌ల్లిదండ్రుల ఓపిక‌ను ప‌రీక్షిస్తారు. తాము చూసిన తాము నేర్చుకున్న విష‌యాల‌ను ఇంటికి రాగానే త‌ల్లిదండ్రుల‌కు గుక్క తిప్పుకోకుండా చెపుతారు. ఎన్నో ప్ర‌శ్న‌లు అడుగుతారు. అలాగే తాము నేర్చుకున్న విష‌యాన్ని త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర ప్రద‌ర్శించ‌డానికి ఆస‌క్తి చూపిస్తారు. అయితే వాళ్ల ఉత్సాహాన్ని చాలా మంది పేరెంట్స్ నీరుగారుస్తారు. వాళ్ల చెప్పే విష‌యాల‌ను వినేందుకు ఓపిక లేక వాళ్ల‌పై చిరాకు ప‌డ‌తారు.

 

 

పిల్ల‌ల మాట‌ల ప్ర‌వాహానికి అడ్డుక‌ట్ట వేయ‌కండి!

 

పిల్లలు ఉత్సాహంగా చెపుతున్న విష‌యాలకు, క‌బుర్ల‌కు, ప్ర‌శ్న‌ల‌కు అస్స‌లు అడ్డుక‌ట్ట వేయ‌కండి. వాళ్లు చెప్పింది శ్ర‌ద్ధగా , ఆస‌క్తిగా వినండి. ఆ వినడంలో ఒక‌ర‌క‌మైన ఉత్సాహాన్ని చూపించండి. తాము చెపుతున్న విషయం త‌ల్లి లేదా తండ్రి ఆస‌క్తిగా విన‌డం అన్న‌ది పిల్ల‌లకు ఆనందాన్ని క‌లిగిస్తుంది. పిల్ల‌లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు విసుగు క‌న‌బ‌ర్చ‌కుండా ప్రేమ‌తో స‌మాధానాలు చెప్పాలి. వాళ్లు అడిగిన ప్ర‌శ్న‌నే ప‌దే ప‌దే అడుగుతున్నా స‌రే. చిరాకును ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దు. పిల్ల‌లు మిమ్మ‌ల్ని ప్ర‌శ్న‌లు అడుగుతున్నారు అంటే బ‌య‌ట ప్ర‌పంచంలో వాళ్లు చాలా విష‌యాల‌ను చూసి అవి ఏంటి అనే జిజ్ఞాస‌ను పెంచుకుంటున్నార‌ని అర్ధం. అన్నీ తెలుసుకోవాల‌న్న వాళ్ల జిజ్ఞాస‌ను ఆదిలోనే చిదిమేయ‌కండి. ఎంత బిజీగా ఉన్నా స‌రే వాళ్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానం చెప్పాలి. వాళ్లు చెప్పే విష‌యాల ద్వారా స్కూల్ బ‌స్ లోనూ, స్కూల్ లోనూ, ట్యూష‌న్ లోనూ ఏం జ‌రుగుతుందో తెలుసుకునేందుకు వీలు క‌లుగుతుంది. ఏదైనా అస‌హ‌జంగా అనిపిస్తే వెంట‌నే త‌గిన చ‌ర్య‌లు తీసుకునేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

 

మీరు విన‌కుంటే ఇక చెప్ప‌డం మానేస్తారు!

 

త‌మ స్కూల్ లో బ‌య‌ట జ‌రిగిన విష‌యాల‌ను, చూసిన సంఘ‌ట‌న‌ల‌ను పిల్ల‌లు చెపుతున్న‌ప్పుడు శ్ర‌ద్ధ‌గా విన‌డం ఒక్క‌టే కాదు వాళ్లు వాస్త‌వానికి ఏం చెప్పాల‌నుకుంటున్నారో అర్ధం చేసుకోవాలి. నాలుగైదు సంద‌ర్భాల్లో మీరు స‌రైన ప్ర‌తిస్పంద‌న లేకుండా వాళ్లు చెప్పిన విష‌యాన్ని విన‌డం లేద‌ని తెలిస్తే పిల్ల‌లు ఇక మీతో ఏ విష‌యం చెప్ప‌డం మానేస్తారు. అది దీర్ఘ‌కాలంలో మీకు మీ పిల్ల‌ల మ‌ధ్య దూరాన్ని పెంచుతుంది. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే మీ పిల్ల‌ల‌కు ఒక మంచి స్నేహితునిలా వాళ్లు చెప్పింది వింటూ స‌రైన స‌మాధానం , స‌ల‌హా ఇచ్చే స‌న్నిహితుని పాత్ర పోషించాలి. అలా మీకు ఫ్రెండ్స్ లా ఉంటేనే పిల్ల‌లు మీతో ఏదైనా విష‌యం చెపుతారు. మీరు వారు చిన్న ప్ర‌శ్న‌ల‌కు , స‌రైన స‌మ‌యానికి వాళ్ల‌కు కావాల్సి వ‌చ్చే స‌ల‌హాల‌ను ఇచ్చేందుకు మీరు అందుబాటులో లేకుంటే వాళ్లు కొత్త స్నేహితుల‌ను వెతుక్కుంటారు. వాళ్ల ప్ర‌శ్న‌లు, వాళ్ల బాధ‌ల‌ను చెప్పుకునేందుకు వేరే వాళ్ల‌ను వెతుక్కుంటారు. ఆ స్నేహితులు చెడ్డ వాళ్లు అయితే మీ పిల్ల‌లు కూడా చెడు దారిలోకి వెళ్లిపోతారు.

 

 

శిక్ష‌ణ‌తో రాటుదేలేలా చేయండి!

 

పిల్ల‌ల‌కు వారి వ‌య‌స్సుకు త‌గిన‌ట్టుగా ఏదైనా ఒక విష‌యంపై శిక్ష‌ణ ఇవ్వండి. అది క‌రాటే, కుంగ్ ఫూ, మ్యూజిక్, చిత్ర‌లేఖ‌నం ఏదైనా కావ‌చ్చు. ఇలా ఓ కొత్త విష‌యం, కొత్త ఆట‌, కొత్త నైపుణ్యం నేర్చుకోవ‌డం వ‌ల‌న పిల్ల‌ల్లో ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది.వాళ్ల‌కు సంబంధించిన చిన్న ప‌నులు వారే సొంతంగా చేసుకునేలా వాళ్ల ప‌నిపై వాళ్లే నిర్ణ‌యాలు తీసుకునేలా వాళ్ల‌ను ప్రొత్సాహించాలి. దీనివల‌న చిన్న‌తనం నుంచే త‌మ ప‌నులు తాము చేసుకోవ‌డం చిన్న ప‌నుల‌కు త‌ల్లిదండ్రుల మీద ఆధార‌క‌ప‌డ‌పోవ‌డం వాళ్ల‌కు అల‌వాట‌వుతాయి. అదే విధంగా వ‌య‌స్సుకు త‌గిన‌ట్టు వాళ్ల‌కు కొత్త పుస్త‌కాలు చ‌దివే అలవాటును కూడా నేర్పించాలి. విజ్ఞానం పెర‌గ‌డం అనేది వాళ్ల‌కు ఆత్మ‌విశ్వ‌సాన్నే కాదు ఒక విష‌యాన్ని విభిన్న కోణాల్లో చూసే శ‌క్తి వ‌స్తుంది. పిల్ల‌ల‌తో ఎప్పుడూ స్నేహితుల్లా ఉంటూ వారు అడిగే ప్ర‌శ్న‌లు విసుగు లేకుండా స‌మాధానం చెప్పిన‌ప్పుడే పెంప‌కంలో కీల‌క‌మైన ద‌శ‌లో విజ‌య‌వంత‌మైన‌ట్టు.

 

(ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్న‌వారు)