పిల్లల్ని కనాలంటే ముందు గాలిపటం ఎగరేయడం తెలియాలి!!

 

ఈ ప్రపంచంలో తనను తాను తెలుసుకోవడం ఎంత కష్టమే పిల్లల పెంపకం కూడా అంతే కష్టం. ఆత్మ జ్జానాన్ని సంపాదించుకోలేక చాలా మంది తమ వ్యక్తిగత జీవితాలను చిక్కుల్లో పడేసుకుంటున్నారు. అలాగే పిల్లల పెంపకం అనే అర్హత సాధించకుండానే పసివాళ్ల జీవితాలను కూడా చిక్కుల్లో పడేస్తున్నారు. ముఖ‌్యంగా మన దేశంలో పిల్లల పెంపకం అనేది అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న విషయం. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండి పిల్లల పెంపకంపై అవగాహన ఉన్న తల్లిదండ్రులే దేశానికి మంచి పౌరులను అందించగలరు. కానీ దురదృష్టవశాత్తూ మన దగ్గర పిల్లల పెంపకాన్ని ఒక అషామాషీ విషయంగా తీసుకుంటున్నారు. ఓ మేధావి చెప్పినట్టు పిల్లలను పెంచడం చేతకాకపోతే వాళ్లను కనడం అన్నది అత్యంత బాధ్యతారాహిత్యమైన విషయం. ఇజ్రాయెల్ వంటి కొన్ని దేశాల్లో పిల్లల పెంపకంపై తగిన శిక్షణ తీసుకుని మానసికంగా సిద్ధమయ్యాకే పిల్లలను కనేందుకు అక్కడ దంపతులు సిద్ధమవుతున్నారు.

 

 

మీకు పిల్లల్ని పెంచడం తెలుసా?

 

పూర్వం ఒక దేశంలో ఏ సమస్యనైనా చిటికెలో పరిష్కరించే మేధావి ఉండేవాడు. తన తెలివితేటలతో అందరి మన్ననలు పొందాడు. ఆ మేధావి పరిష్కరించని సమస్య అంటూ ఉండదని ప్రజలు భావించేవారు. అయితే అప్పటికే మధ్య వయస్సులోకి వచ్చిన ఆ మేధావి ఒకతను ఇలా ప్రశ్నించాడు. ‘అయ్యా తమరు ఇంకా పెళ్లి చేసుకోలేదు? మీకు పిల్లలు కూడా లేరు. ఎందుకు?’ అని అడిగాడు. దానికి ఆ మేధావి ఇలా సమాధానం చెప్పాడు. ‘నాకు పిల్లల్ని పెంచడం అస్సలు చేతకాదు. అది అంత సులువైన విషయమేమీ కాదు. నా పిల్లలు సమాజాన్ని పాడు చేయడం నాకిష్టం లేదు. నేను సరైన పెంపకం కనుక చేయకుంటే నా పిల్లలు సమాజాన్ని మలినం చేసే వ్యక్తులుగా తయారవుతారు.’ అని చెప్పాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లల పెంపకం అనేది మనం ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో అత్యంత శ్రద్ధగా చేయాల్సిన పని. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా మనం దేశానికి , సమాజానికి బాధ్యత లేని తరాన్ని అందించినట్టే. ఆ తరం అక్కడితో ఆగిపోతుంది అనుకుంటే పొరపాటు . తల్లిదండ్రుల నిరాదరణకు గురైన సరైన పద్ధతిలో పెరగని ఒక పిల్లవాడు తాను పెద్దవాడు అయ్యాక తన పిల్లలను సరైన మార్గంలో ఎలా పెంచగలడు?

 

 

మీ పిల్లల బాల్యం మీ చేతుల్లో ఉంది!

 

ప్రతీ ఒక్కరు జీవితంలో గడిచిపోయిన తమ బాల్యాన్ని గుర్తు చేసుకుని చింతిస్తూ ఉంటారు. బాల్యంలో తన జీవితం ఎంత అద్భుతంగా ఉండేదో కదా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు కోటీశ్వరులైనా, మిలియన్ డాలర్లు వెచ్చించినా సరే మీ బాల్యాన్ని మీరు వెనక్కి తీసుకురాలేరు..కదా ..ఎందుకంటే అది మీ చేతుల్లో లేదు. కానీ మీ పిల్లల బాల్యం మాత్రం కచ్చితంగా మీ చేతుల్లో ఉంది. వాళ్య బాల్యాన్ని వాళ్ల జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం మనకు ఉంది. వాళ్లకు అప్యాయత, అనురాగం, ప్రేమతో కూడిన స్పర్శ ను అందిస్తూ ఒక మంచి వాతావరణంలో పెంచితే అదే వాళ్లకు మీరు ఇచ్చే అందమైన, అద్భుతమైన బహుమతి అవుతుంది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు భవిష్యత్ లో మంచి జీవితాన్ని ఇచ్చేందుకు వాళ్లతో సరైన సమయం కూడా గడపకుండా పని పని అంటూ ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. మీరు పెద్దయ్యాక అతనికి కోట్ల రూపాయలు ఇచ్చినా అతను కోట్ల రూపాయలు సంపాదించినా తన బాల్యాన్ని మాత్రం వెనక్కు తెచ్చుకోలేడు కదా? కాబట్టి డబ్బు సంపాదనతో పాటు మీ పిల్లలతో నాణ్యమైన కొన్ని గంటలు గడిపేందుకు వారిని ప్రేమతో పెంచేందుకు, వారి బాల్యాన్ని సుసంపన్నం చేసే తగిన సమయపట్టిక వేసుకోండి.

 

 

పిల్లల పెంపకం గాలిపటం ఎగరేయడం లాంటిది!

 

మనం గాలిపటం ఎగరవేసేటప్పుడు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తారం. గాలిపటం కు స్వేచ్ఛ వచ్చే వరకూ జాగ్రత్తగా, మెల్లగా పైకి తీసుకెళ్తాం. తర్వాత దానికి మరింత స్వేచ్ఛనిచ్చి ఇంకాస్త పైకి వదులుతాం. ఇంకా నమ్మకం కుదిరాక మరింత పైకి వెళ్లనిస్తాం. కానీ ఇవన్నీ చేస్తున్నా నియంత్రణ పై మాత్రం పట్టు కోల్పోకుండా చూసుకుంటాం. ఎందుకంటే ఒక్కసారి నియంత్రణ కోల్పోతే గాలి పటం మీ చేతినుంచి చేజారినట్టే. స్వేచ్ఛ , నియంత్రణల సమన్వయమే గాలిపటం ఎగరేయడంలో మూల సూత్రం. ఇదే సూత్రం పిల్లల పెంపకానికి వందశాతం వర్తిస్తుంది. పిల్లలకు తగినంత స్వేచ్ఛనిస్తూనే వాళ్లకు ఏ సమయంలో నియంత్రణ అవసరమో తెలుసుకుని అప్పుడు దాన్ని అమల్లో పెట్టడం తెలియాలి. లేకుంటే మరింత పైకి వెళ్లి నియంత్రణ కోల్పోయిన గాలిపటంలా మీ పిల్లల జీవితం కూడా మీ చేతుల్లోంచి జారిపోతుంది. చెట్టు పెరిగే క్రమంలో చిన్న చిన్న కొమ్మలను తొలిగించిన అది నిటారుగా పెరిగేట్టు ఏ విధంగా చేస్తామో పిల్లల పెంపకంలో కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఎగుదలలకు అడ్డంకిగా మారిన విషయాలను ఎప్పటికప్పుడు చాకచక్యంగా తొలిగించాలి. వారు మరింత ఉన్నతంగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

 

 

పిల్లల సామ్రాజ్యానికి పిల్లలే రాజులు!

 

పిల్లల పెంపకంలో మొదటి ఐదేళ్లు చాలా కీలకమైనవి. బడిలో చేరకముందు తల్లిదండ్రుల చెంత తీరుబడిగా నేర్చుకునే విషయాలు అతని జీవితంలో అత్యంత అమూల్యమైనవి. ప్రేమతో , అప్యాయతతో కూడిన స్పర్శతో తల్లిదండ్రులతో గడిపే ఆ క్షణాలు వాళ్లను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతులను చేస్తాయి. మనం ముందు చెప్పుకున్నట్టు పిల్లల పెంపకం అంత ఆషామాషీ విషయం కాదు. ఎందుకంటే పిల్లల రాజ్యం ఒక గాజుమేడ. అందులో ఉన్న పిల్లవాడు రాయి విసిరినా, బయట ఉన్న వాళ్లు రాయి విసిరినా కూలేది, పగిలేది పిల్లల రాజ్యమే. నష్టపోయేది పిల్లవాడే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల కలల రాజ్యాన్ని నిర్మించడంలో రాజీ పడొద్దు. వాళ్లకు ప్రేమను, అప్యాయతను అందించండి. విలువలతో ఎలా బతకాలో నేర్పించండి. స్వేఛ్చనిస్తూనే నియంత్రణ చేయండి. తప్పటడుగులు వేస్తున్నప్పుడు సరి చేయండి. తప్పటడుగులు తప్పిదాలుగా మారకుండా జాగ్రత్త పడండి. అంతేకానీ పిల్లలను గాలికొదిలి వాళ్ల భవిష్యత్ కోసం డబ్బులు సంపాదిస్తాం అని చెప్పకండి. అన్ని విధాలుగా పతనమైన వాడికి డబ్బులు ఇచ్చి ఏం చేస్తారు? మనం ముందే చెప్పుకున్నాం. పిల్లల పెంపకం చాలా కష్టతరమైన విష‍యం అని. మరి ఆ కష్టతరమైన విషయాన్ని అర్ధం కాకుండే నేర్చుకోండి. అవసరమైతే శిక్షణ తీసుకోండి. అంతే కానీ మీ పిల్లల పెంపకం విష‍యంలో రాజీపడకండి.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)