‘లిఫ్ట్’ కావాలా నాయ‌నా??

 

జీవితంలో ఉన్న‌తంగా ఎద‌గాల‌ని గొప్ప ల‌క్ష్యాల‌ను సాధించాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ కోరుకుంటారు. అయితే చాలా త‌క్కువ మంది మాత్ర‌మే గొప్ప‌వాళ్లుగా ఎదుగుతారు. మిగిలిన వాళ్లంతా అనుకోవ‌డం ద‌గ్గ‌రే ఆగిపోతారు? పైగా తాము ఎందుకు ఎద‌గ‌లేక‌పోయారో కార‌ణాలు చెపుతూ, సాకులు వెతుకుతూ త‌మ‌ను తాము మోసం చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వ్య‌క్తులు చెప్పే కార‌ణాల లిస్ట్ లో మొద‌ట‌ ఉండేది త‌మ‌కు ఎవ‌రూ లిఫ్ట్ ఇవ్వ‌లేద‌ని, ఆలా లిఫ్ట్ ఇచ్చి ఉంటే ఎక్క‌డో ఉండి ఉండేవార‌మ‌న్న‌ది. అయితే ఇటువంటి వ్య‌క్తుల‌కు అర్ధం కాని విష‌య‌మేమిటంటే అస‌లు ఎవ‌రైనా ఎందుకు లిఫ్ట్ ఇస్తారు? పోనీ లిఫ్ట్ ఇచ్చినా అర్హ‌త చూసి మాత్ర‌మే ఆ స‌హాయం చేస్తారు. ఈ ప్ర‌పంచంలో అర్హ‌త లేని వారికి, క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌లేని వారికి ఎవ‌రూ లిప్ట్ ఇవ్వ‌రు. వెహిక‌ల్ పై లిఫ్ట్ ఇచ్చేందుకే ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించే ఈ ప్ర‌పంచంలో జీవితంలో మీకు ఎవ‌రో లిఫ్ట్ ఇస్తార‌ని, వాళ్లు మీ జీవితాన్ని మార్చుతార‌ని అనుకోవ‌డం మూర్ఖ‌త్వం మాత్రమే. సొంతంగా త‌మ‌ను తాము ఉన్న‌తంగా తీర్చిదిద్దుకుని క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారికి మాత్ర‌మే విజ‌యాన్ని అందుకునే అర్హ‌త ఉంది.

 

 

అస‌లు మీకెందుకు అంద‌రూ స‌హాయం చేయాలి?

 

మ‌న‌లో చాలా మందికి స‌హాయం కావాల్సి వ‌చ్చిన‌ప్పుడు ట‌క్కున ఉన్న‌త స్థానంలో ఉన్న‌బంధువులో, స‌న్నిహితులో గుర్తుకువ‌స్తారు. వాళ్ల స‌హాయం తీసుకుని ఆ ప‌నిని పూర్తి చేయాల‌నో, లేక ఏదైనా ప్ర‌యోజ‌నం పొందాల‌నో ఆశిస్తూ ఉంటాం. అప్ప‌టి వ‌ర‌కూ వారితో స‌న్నిహిత సంబంధాలు నెర‌ప‌క‌పోయినా స‌రే వాళ్ల ద్వారా స‌హాయం పొందాల‌నుకోవ‌డం ఎంత వ‌ర‌కూ స‌బ‌బు అన్న ఆలోచ‌న‌న ఎవ‌రికీ రాదు. ఉన్న‌త స్థానంలో వ్య‌క్తుల ద్వారా ప్ర‌యోజ‌నం పొందాలనుకోవ‌డం త‌ప్పు కాదు. అయితే ఇక్క‌డ రెండు కీల‌క‌మైన విష‌యాలు దీనిని నిర్ణ‌యిస్తాయి. అందులో ఒక‌టి మీరు సహాయం పొందాల‌నుకుంటున్న వ్య‌క్తుల‌తో మీరు స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉన్నారా? లేక అవ‌సరం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే వాళ్లు గుర్తుకు వ‌స్తారా? ఇక రెండోది అస‌లు మీకు అర్హ‌త లేకుండా అవ‌త‌లి వ్య‌క్తులు మీకెందుకు స‌హాయం చేయాలి? మీకు స‌రైన స‌మ‌ర్ధ‌త లేకుండా వాళ్లు మీకు స‌హాయం చేస్తే వాళ్ల విశ్వ‌స‌నీయ‌త‌, న‌మ్మ‌కం దెబ్బ‌తింటాయి క‌దా? స‌రైన అర్హ‌త‌లు లేకుండా మీకు ఎంత‌టి స‌న్నిహితులైనా స‌హాయం చేయ‌లేరు. అది ఎప్ప‌టికీ సాధ్యం కూడా కాదు.

 

 

నిందించుకోవాల్సింది మిమ్మ‌ల్ని మీరే!

 

ఇక త‌మ‌కు స‌హాయం కావాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఆప్తులు అనుకున్న వాళ్లు స‌హాయం చేయ‌లేద‌ని చాలా మంది నిందులు వేస్తుంటారు. త‌మ చుట్టాలు, ఆప్తులు అయ్యిండి త‌మ‌కు అవ‌స‌రం అయిన‌ప్పుడు ఎందుకూ కొర‌గాకుండా పోయార‌ని ఆవేద‌న చెందుతూ ఉంటారు. అంతేకానీ త‌మ‌లో ఉన్న లోపం ఏమిటో గుర్తించేందుకు సిద్ధంగా ఉండ‌రు. అస‌లు వాస్త‌వానికి లిఫ్ట్ వేరు రిఫ‌రెన్స్ వేరు. మీ ద‌గ్గ‌ర పెద్ద‌గా విష‌య ప‌రిజ్ఞానం గానీ అర్హ‌తులు కానీ లేకున్న‌ప్ప‌టికీ చాలా మంది మ‌న‌కు రిఫ‌రెన్స్ ఇస్తారు. ఎందుకంటే రిఫ‌రెన్స్ ఇచ్చిన‌ప్ప‌టికీ మీరు మ‌రో వేదిక వ‌ద్ద మీ అర్హ‌త‌ల‌ను, స‌మ‌ర్ధ‌త‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే లిఫ్ట్ ఇచ్చే విష‌యంలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఒక వ్య‌క్తి మీకు లిఫ్ట్ ఇచ్చి మీ పురోగ‌తికి స‌హాయం చేయాలంటే మీరు అత‌ని ద‌గ్గ‌ర మీ సామ‌ర్ధ్యాల‌ను ఎంత‌గా నిరూపించుకోవాలి? ఎంత న‌మ్మ‌కాన్ని సంపాదించుకోవాలి? అర్హ‌త లేదు అనుకుంటే సొంత వారికైనా ఎవ‌రూ లిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండ‌రు. ముందు మిమ్మ‌ల్ని మీరే నిరూపించుకుని త‌ర్వాత ఏదైనా చిన్న విష‌యానికి లిఫ్ట్ ను ఆశిస్తే దాని వ‌ల‌న ఫ‌లితం ఉంటుంది. అస‌లు లిఫ్ట్ నే ఆశ్ర‌యించ‌కుండా మీకు మీరుగా ఎదిగేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటే మ‌రీ మంచిది.

 

 

మ‌నం ఎక్కాల్సిన లిఫ్ట్ కూడా మ‌న‌కు ఎన్నో పాఠాలు నేర్పుతుంది!

 

అపార్ట్ మెంట్ లో మ‌నం లిఫ్ట్ ఎక్కాల్సి వ‌చ్చిన‌ప్పుడు స‌రిగ్గా గ‌మ‌నిస్తే మ‌నకు ఎన్నో విష‌యాలు అర్ధ‌మ‌వుతాయి. మ‌నం వ‌చ్చేస‌రికి దాదాపు 90 శాతం సంద‌ర్భాల్లో లిఫ్ట్ మ‌న‌కు అందుబాటులో ఉండ‌దు. చాలా త‌క్కువ సంద‌ర్భాల్లో మాత్ర‌మే మ‌నం వెళ్లేస‌రికి లిఫ్ట్ రెడీగా ఉంటుంది. మ‌నం కొద్ది సేపు నిరీక్షించి ఓపిక‌తో ఉన్నాకే లిఫ్ట్ ఎక్కేందుకు వీలు క‌లుగుతుంది. లిఫ్ట్ అప్ప‌టికే ఉన్న వ్య‌క్తులు మ‌న కోసం మ‌న వెళ్లాల్సిన ఫ్లోర్ కోసం బ‌ట‌న్ నొక్కిపెట్ట‌రు. మ‌నమే మ‌న వెళ్లాల్సిన గ‌మ్య‌స్థానాన్ని నిర్ణ‌యించుకుని బ‌ట‌న్ ను నొక్కాలి. ఎందుకంటే ఎక్క‌డ దిగాల‌న్న‌దానిపై మ‌న‌కు మాత్ర‌మే స్ప‌ష్టత ఉంటుంది. ఈ విష‌యం వేరే వ్య‌క్తుల‌కు తెలియ‌దు క‌దా? అటువంటి స‌మ‌యంలో వాళ్లు మీకెందుకు స‌హాయం చేస్తారు. స‌హాయం చేయాల‌ని ఉన్నా మీ గ‌మ్యాన్ని నిర్దేశించుకోలేని మీ అస‌మ‌ర్ధ‌త‌ను గ‌మ‌నించి ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకుంటారు. కాబ‌ట్టి ముందు క‌ష్ట‌ప‌డి చేస్తూ కావాల్సిన అర్హ‌త‌ల‌ను సంపాదించుకోండి. అప్పుడు లిఫ్ట్ దొరికినా దొర‌క‌కున్నా మీరు అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోగ‌లుగుతారు.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నావారు)