మీలో కొత్త ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపే విష‌యాలు ఏంటో తెలుసా?

 

కొన్ని విష‌యాలు చూడ‌టానికి చాలా సామాన్యంగా, స‌మాజం దృష్టిలో ప‌నికిరాని అంశాలుగా క‌నిపించినా త‌ర‌చి చూస్తే వాటి నుంచి ఎన్నో జీవ‌న నైపుణ్యాల‌ను నేర్చుకోవ‌చ్చు. ఎవ‌రైనా సినిమాకు వెళ్లినా లేక క్రికెట్ మ్యాచ్ ల‌కు వెళ్లినా మ‌నం ఏ విధంగా ఆలోచిస్తాం? అందులో ఏముంది..ఏదో టైమ్ పాస్ కి, ఎంట‌ర్ టైన్ మెంట్ కోసం వెళ్లారు అనుకుంటాం. ఇంకా ముందుకెళ్లి ఎంజాయ్ మెంట్ అన్న చిన్న ప‌దంతో తీసిపారేస్తాం. కానీ అందులోనే ఒక అద్భుత‌మైన ఉత్తేజ‌క‌ర‌మైన ఉత్ప్రేర‌కం దాగి ఉంది. అది మ‌నిషికి అనుక్ష‌ణం శ‌క్తినిచ్చి రెట్టింపు ఉత్సాహంతో ప‌నిచేసేందుకు అవ‌స‌ర‌మైన ఇంధ‌నాన్ని అందిస్తుంది. ప్ర‌తీ మ‌నిషి ఏదో ఒక సంద‌ర్భంలో కాస్త నిరుత్సాహానికి, నిరాశ‌కు గుర‌వుతాడు. అలాంటి ప‌రిస్థితుల్లో మ‌న‌కు స‌రైన స‌ల‌హా ఇచ్చేందుకు లేక మ‌న‌సుకు స్వాంత‌ననిచ్చే వ్య‌క్తులు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు. ఉద్వేగాలను నియంత్రించుకోలేని అటువంటి సంద‌ర్భాల్లో ఒక మంచి సినిమాకు వెళ్ల‌డం లేదా ఒక మంచి ఆట‌ను చూడ‌టం అన్న‌ది మ‌న‌లో నిరాశ‌ను పొగొడుతుంది. సినిమాలో హీరో చేసే సాహ‌సాలు నిజం కాక‌పోవ‌చ్చు కానీ అటువంటి స‌న్నివేశాలు చూస్తున్న‌ప్పుడు మ‌న‌కు తెలీకుండానే ఒక ర‌క‌మైన ఫాంట‌సీలో విహ‌రిస్తూ నిరాశ‌ను వ‌దులుకుని కొత్త ఉత్తేజాన్ని పొందుతాం.

 

 

సినిమా ఉల్లాసాన్నిచ్చే ఉత్ప్రేర‌కం!

 

ఒక సినిమాలో హీరో త‌న చేతుల మీదుగా కార్లు పోనిచ్చుకుంటాడు. మార్ష‌ల్ ఆర్ట్స్ లో త‌న‌కున్న నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తాడు. అలానే డ్యాన్స్ లో త‌న‌కున్న నైపుణ్యాన్ని చూపిస్తాడు. ఇవ‌న్నీ సినిమా చూస్తున్న ప్రేక్ష‌కుడు ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోవ‌చ్చు కానీ సినిమా ముగిసేంత వ‌ర‌కూ ఆ స‌న్నివేశాలు అత‌నిలో ఉత్సాహాన్ని నింపుతాయి. అప్ప‌టి వ‌ర‌కూ అత‌ను అనుభ‌విస్తున్న మానిసిక అల‌స‌ట‌ను, చికాకును సినిమా మ‌రిపిస్తుంది. పైగా ఎంత క‌ష్ట‌త‌ర‌మైన ప‌రిస్థితుల్లోనైనా క‌ష్టాల‌ను ఎలా ఎదుర్కోవాల‌న్న దానిపై సినిమాలోని స‌న్నివేశాలు అతనిలో ప‌ట్టుద‌ల‌ను, సానుకూల దృక్ఫ‌దాన్ని పెంచుతాయి. సినిమాను ఎంత బాగా ఎంజాయ్ చేస్తే అంత‌గా మానసిక ఉల్లాసాన్ని పొందేందుకు వీలుంటుంది. సాధార‌ణ టిక్కెట్ కొనుక్కుని తెర‌కు ద‌గ్గ‌ర‌గా సినిమా చూసే మాస్ ఆడియ‌న్స్ సినిమాను ఎంత‌గా ఎంజాయ్ చేస్తారో మ‌న‌కు అంద‌రికీ తెలిసిన విష‌యమే. వాళ్ల‌కంద‌ర‌కూ జీవితంలో ఎన్నో క‌ష్టాలు, క‌న్నీళ్లు ఉంటాయి. అయినా స‌రే అన్నింటిని చాలా తేలిగ్గా తీసుకుని జీవితాన్ని , జీవనాన్ని కొన‌సాగిస్తూ ఉంటారు. సినిమా చూసే మూడు గంట‌లే కాదు సినిమాలోని స‌న్నివేశాల నుంచి ఉత్తేజం పొంది రోజువారీ జీవితాన్ని కూడా ఉల్లాసంగా గ‌డప‌డం అల‌వాటు చేసుకుంటారు. సినిమాకు ఉన్న శ‌క్తి అలాంటిది మ‌రి. సినిమా అంటే కేవ‌లం ఎంజాయ్ మెంట్ , ఎంట‌ర్ టైన్ మెంట్ మాత్ర‌మే కాదు. లైఫ్ ను ఎలా గ‌డ‌పాలో దేన్నిఎక్క‌డ వ‌ర‌కూ తీసుకోవాలో నేర్పిస్తూ బాధ‌ల‌ను మ‌రిపించే అద్భుతమైన వినోద సాధ‌నం.

 

 

క్రీడ‌లు జీవితాన్నే మార్చేస్తాయి!

 

క్రికెట్ నే తీసుకోండి బ్యాట్స్ మెన్ బ్యాట్ తో బంతిని కొట్టేందుకు ప్ర‌య‌త్తిస్తే ప‌ద‌కొండు మంది ప్ర‌త్య‌ర్ధి ఆట‌గాళ్లు ఆ బాల్ ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఈ ఇరు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగే పోరు ర‌సవ‌త్త‌రంగా ఉంటుంది. ఒక‌ర్ని మ‌రొక‌రు ఛాలెంజ్ చేసుకుంటూ ప‌ట్టుద‌ల‌తో ఆడే ఆ గేమ్ చూసే వాళ్ల‌లో కూడా ప‌ట్టుద‌లను పెంచుతుంది. మ్యాచ్ చూస్తున్నంత సేపు ఆ ఉత్కంఠ మైదానంలోని ఆట‌గాళ్ల‌కే కాదు చూసే ప్రేక్ష‌కుల‌కు కూడా కొత్త అనుభ‌వాన్ని క‌లిగిస్తుంది. జీవితాన్ని చూసే విధానంలో మార్పును తీసుకొస్తుంది. ఇక ఫుట్ బాల్ ఆట‌లో బాల్ ను ప్ర‌త్య‌ర్ధి గోల్ పోస్ట్ లోకి నెట్టాల‌న్న ఆట‌గాళ్ల ప్ర‌య‌త్నం దాన్ని అడ్డుకోవాల‌నే గోల్ కీప‌ర్ ప్ర‌య‌త్నం రోమాంచితంగా ఉంటాయి. ఇరు జ‌ట్ల మ‌ధ్య ఈ పోరు చూసే వాళ్ల మ‌దిలో కొత్త ఛాలెంజ్ ను నింపుతుంది. ఆ ఆట చూసి ప్రేక్ష‌కుడు కేవ‌లం ఎంజాయ్ మాత్ర‌మే చేయ‌డు. ఉత్తేజం పొందుతాడు. ఆట‌లోని ఆ స‌వాలును జీవితానికి అన్వ‌యించుకోగ‌లుగుతాడు. ఎంట‌ర్ టైన్ మెంట్ పొంద‌డానికి, ఉత్తేజం పొంద‌డానికి ఒక స్ప‌ష్ట‌మైన తేడా ఉంది. ఆ తేడాను అర్ధం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యే చాలా మంది సినిమాల‌ను, ఆట‌ల‌ను కేవ‌లం వినోదం అని అనుకుంటున్నారు. అది చాలా త‌ప్పుడు అభిప్రాయం. సినిమాలు, క్రీడ‌లు అనేవి మ‌న‌లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపి మ‌న జీవితాన్ని మార్చేసే ఉత్ప్రేర‌కాలు.

 

 

వేడుక‌లు, ప‌ర్య‌ట‌న‌లు జీవిత దృక్ఫ‌దాన్ని మారుస్తాయి!

 

మ‌న‌లో చాలా మంది ఫంక్ష‌న్ ల‌కు, వేడుక‌ల‌కు వెళ్ల‌డాన్ని టైం పాస్ వ్య‌వ‌హారంగా కొట్టిపారేస్తారు. కానీ వాస్త‌వానికి వేడుక‌ల‌కు వెళ్ల‌డం అనేది జీవితం ప‌ట్ల మ‌న దృక్కోణాన్ని మారుస్తుంది. ఏదైనా ఒక ఫంక్ష‌న్ కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ విభిన్న రంగాల నుంచి విభిన్న నేప‌థ్యాల నుంచి ఎంద‌రో కొత్త వ్యక్తులు వ‌స్తారు. వాళ్ల‌తో మాట్లాడితే మ‌న‌లో ఉన్న బెరుకు పోవ‌డమే కాదు కొత్త విష‌యాలు తెలుస్తాయి. అలాగే ఆ ఫంక్ష‌న్ జ‌రిగే విధానం నుంచి స్ఫూర్తి పొంది మ‌నం కూడా అటువంటి వేడుక చేయాల‌న్న ఆలోచ‌న క‌లుగుతుంది. ఇక ఎప్పుడూ మ‌నం చూడ‌ని కొత్త ప్ర‌దేశాల‌కు, ఎన్ని సార్లు చూసినా త‌నివితీర‌ని సుంద‌ర ప్ర‌దేశాల‌కు వెళ్లిన‌ప్పుడు మ‌న‌కు మ‌నమే కొత్త‌గా ఆవిష్కృత‌మ‌వుతాం. అటువంటి పర్య‌ట‌న‌ల‌కు వెళ్లిన‌ప్పుడు రోటీన్ జీవితం నుంచి స్వాంత‌న పొంది కొత్త శ‌క్తిని పొందేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. ఇటువంటి ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లిన‌ప్పుడు మ‌నం ప్ర‌తీ రోజూ ఎలా ఉంటామో అలా కాకుండా కాస్త విభిన్నంగా, సౌక‌ర్యంగా ఉండే ప్ర‌య‌త్నం చేయాలి.ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా ఫార్మ‌ల్ ఫ్యాంట్, ష‌ర్ట్ ఇన్ సర్ట్ కాకుండా వ‌దులు దుస్తులు ధ‌రిస్తే మ‌న‌సుకు ఉల్లాసంగా ఉంటుంది. విజ‌యవంత‌మైన వ్య‌క్తులు టూర్ కు వెళ్లిన‌ప్పుడు వాళ్లు ఎటువంటి ఆహార్యంలో ఉంటారో ఒకసారి గ‌మ‌నించండి. రోజువారీ జీవితం మ‌న‌కు విసుగు క‌లిగించ‌కూడ‌దు అనుకుంటే కొత్త ఉత్సాహాన్ని పొందాలి అనుకుంటే మిగిలిన వారు టైం పాస్ అనుకున్నా మంచి ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లి రావాలి.

 

 

అన్నింటినీ తీసేసి జీవితాన్ని జీరో చేసుకోకండి!

జీవితాన్ని సంపూర్ణంగా జీవించిన‌ప్పుడు దానికి సార్ధ‌క‌త ఏర్ప‌డుతుంది. ఎవ‌రో ఏదో అన్నార‌నో లేదో ఏమైనా అనుకుంటార‌నో అన్న భ‌యంతో బెరుకుతో చాలా మంది లైఫ్ ను అసంపూర్ణంగానే జీవిస్తున్నారు. మ‌న చుట్టూ ఉన్న విష‌యాలు, జరిగే సంఘ‌ట‌న‌ల నుంచే మ‌నం ఎన్నో జీవిత పాఠాల‌ను నేర్చుకోవ‌చ్చు. ముఖ్యంగా సినిమా చూసి ఉత్తేజం పొంది జీవితాన్ని మార్చుకున్న వాళ్లు ఎంద‌రో ఉన్నారు. మ‌నం కూడా సినిమాలోని పాజిటివ్ అంశాల‌ను ఫీల్ అయితే అందులోని ఉత్తేజాన్ని అర్ధం చేసుకుంటే సినిమా చూడ‌టం అనేది టైం పాస్, ఎంట‌ర్ టైన్ మెంట్ అన్న మాటే రాదు. అలాగే క్రీడ‌ల నుంచి జీవితాన్ని కొత్త‌గా మ‌లుచుకోవ‌చ్చు. మిల్కా సింగ్, చ‌క్ దే ఇండియా, దంగ‌ల్ లాంటి క్రీడా నేప‌థ్యం ఉన్న సినిమాలు చూసిన‌ప్పుడు మ‌న‌కు తెలియ‌కుండానే అందులో లీన‌మై ఒక ర‌క‌మైన ఉత్తేజాన్ని పొందుతాం. అలాగే క్రీడ‌ల‌ను చూసినా మ‌న‌కు తెలియ‌కుండానే స‌వాళ్ల‌ను స్వీక‌రించే గుణాన్ని అల‌వ‌ర్చుకుంటాం. కాబ‌ట్టి క్రీడ‌లు చూడ‌టం టైం పాస్ విష‌యం అస్స‌లు కానేకాదు. కాబ‌ట్టి సినిమాలు చూడాలి. క్రీడా మ్యాచ్ లు చూడాలి. ప‌ర్య‌ట‌న‌లు చేయాలి. కొత్త ఫంక్ష‌న్ ల‌కు వెళ్లాలి. అక్క‌డ విలువైన జీవిత‌పు పాఠాలు నేర్చుకుని స్ఫూర్తి పొందాలి. అప్పుడే జీవితం మారుతుంది. లైఫ్ జీరో నుంచి సెంచ‌రీ స్కోర్ దిశ‌గా సాగుతుంది.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్సర్ చేసిన‌వారు)