నిన్ను నువ్వు తెలుసుకోవ‌డ‌మే విజ‌యం!

ఎప్పుడూ నెమ్మ‌దిగా, సైలెంట్ గా ఉండే ఒక వ్య‌క్తి అక‌స్మాత్తుగా కోపంతో ఊగిపోవ‌డాన్ని మీరు చాలా సంద‌ర్భాల్లో చూసి ఉంటారు. అంత సావ‌ధానంగా మ‌సులుకునే వ్య‌క్తి ఈ విధంగా ప్ర‌వ‌ర్తించ‌గానే మ‌నం సాధారణంగా ఒక మాట అంటుంటాం. ‘వీడి లోని అస‌లు మ‌నిషి నిద్ర లేచాడు. ఇప్పుడు మ‌నం చూస్తున్నది నిజంగా వీడినేనా?’  అవ‌త‌లి వాళ్ల కోపం మితిమీరిపోయిన‌ప్పుడు ఇదీ వీడి అస‌లైన స్వ‌భావం అంటూ విమ‌ర్శలు కూడా గుప్పిస్తాం. మ‌నం చూస్తున్న దృష్టి కోణం నుంచి మ‌నం ప్ర‌తీ ఒక్క‌రిపై ఒక్కో ర‌క‌మైన అభిప్రాయాన్ని ఏర్ప‌రుచుకుంటూ ఉంటాం. అదే స‌మ‌యంలో మ‌న‌కు సంబంధించి, మ‌న ప్ర‌వ‌ర్త‌నకు సంబందించి ఒక స్వీయ గుర్తింపును కూడా ఏర్ప‌రుచుకుంటాం. మెల్ల‌గా అన్ని విష‌యాల్లో మ‌న‌మే చాలా గొప్ప‌వాళ్లం. మ‌నం చేసిన‌వ‌న్నీ ఒప్పులే. మ‌నం త‌ప్పు చేయ‌డానికి చాలా ఫ‌లానా విష‌యం కార‌ణం అంటూ మ‌న‌ల్ని మ‌నం స‌మ‌ర్ధించుకుంటూ ఉంటాం. అదే స‌మ‌యంలో ఇత‌రులు త‌ప్పుల‌ను, లోపాల‌ను ఎత్తిచూపుతూ వాళ్ల‌ను త‌క్కువ చేయ‌డానికి, నింద‌లు మోప‌డానికి అల‌వాటు ప‌డ‌తాం. ఎంత‌సేపు ఇత‌రుల‌ను నిందించ‌డంలో మునిగిపోయి మ‌న‌లోని లోపాల‌ను, పొర‌పాట్ల‌ను గుర్తించ‌డం పూర్తిగా మానుకుంటాం. స‌రిగ్గా ఇక్క‌డే వ్య‌క్తిత్వ నిర్మాణం, వికాసం దెబ్బ‌తింటాయి. మ‌నిషి సంబంధాల ప‌రంగా, విలువ‌ల ప‌రంగా ప‌త‌నం కావ‌డం మొద‌ల‌వుతుంది.

అంద‌రూ మీలా ఎందుకు ఉంటారు?

 

ఈ ప్ర‌పంచంలో ఒక్కొక్క‌రు ఒక్కో ర‌క‌మైన వైఖ‌రిని, వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉంటారు.  పుట్టి పెరిగిన సామాజిక ప‌రిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, విలువ‌లు, నేప‌థ్యం ఆధారంగా ఒక మ‌నిషి వ్య‌క్తిత్వం నిర్మించ‌బ‌డుతుంది.  ఒక మనిషి ప్ర‌వ‌ర్త‌న‌, వ్య‌క్తిత్వం మ‌రో మ‌నిషిని ఎట్టిప‌రిస్థితుల్లోనూ పోలి ఉండ‌దు. ఒకే ఇంట్లో పెరిగిన‌ప్ప‌టికీ వారి వారి అనుభ‌వాలు, ఆలోచ‌న‌లు బ‌ట్టి కుటుంబ సభ్యులే విభిన్నమైన ఆలోచ‌నల‌ను, వ్యక్తిత్వాన్ని క‌లిగి ఉంటారు. మ‌నిషికి మ‌నిషికి మ‌ధ్య ఆలోచ‌న‌ల్లో సారూప్య‌తులు ఉంటాయి కానీ అచ్చుగుద్దిన‌ట్టు ఒకే ర‌క‌మైన ఆలోచ‌న‌లు ఉండ‌టం అసాధ్యం అనే చెప్పాలి. కాబ‌ట్టి అంద‌రూ మీలా ఆలోచించాలి..మీలా ఉండాలి..అన్న ఒంటెత్తు పోక‌డ‌ల‌ను వ‌దిలేయండి. మీకు ఏ విధంగా అయితే ఒక ప్ర‌త్యేకమైన వ్య‌క్తిత్వం ఉందో అలానే మిగిలిన వారికి కూడా ఒక ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిత్వం ఉంటుంద‌ని గుర్తించండి. ఎంత‌సేపూ అవ‌త‌లి వ్య‌క్తుల‌ను మీ దారిలోకి తెచ్చుకోవడానికి ప్ర‌య‌త్నించ‌డం  అన్న‌ది మీ స‌మ‌యాన్ని వృధా చేస్తుంది త‌ప్ప మ‌రేమీ లేదు. ఒక‌రికి ఒక‌రు గౌర‌వంఇచ్చుకుని అపార్ధాలకు, అహాల‌కు తావులేకుండా స‌ర్దుకుపోవ‌డం అన్న‌ది జ‌రిగిన‌ప్పుడు మాత్ర‌మే ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి ప్ర‌యాణం చేయ‌గ‌ల‌రు. అది స్నేహితులైనా, భార్యాభ‌ర్త‌లైనా, కుటుంబ స‌భ్యులైనా.

 

‘నేను’ అనే దాన్ని మీ మ‌న‌స్సులోంచి తీసేయండి! 

 

మీరు గొప్ప ఉపాధ్యాయుల‌ను, నాయ‌కుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే వాళ్లు ఎప్పుడు ‘నేను’ అనే మాట‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప‌యోగించ‌రు. ‘నేను’ అనే మాట మీలో అహంభావాన్ని క‌లిగిస్తుంది. అహంభావం మ‌నిషిని నైతికంగా దెబ్బ‌తీసి ప‌త‌నం దిశ‌గా న‌డిపిస్తుంది. ‘నేను’ అన్న‌దాన్ని మ‌న ఆలోచ‌న‌ల్లోంచి పూర్తిగా తొలిగించ‌డం కాస్త‌ క‌ష్ట‌మైన ప‌నే. అయినా ప్ర‌య‌త్నం చేయాలి. చ‌దువుకునే చోట‌, ప‌నిచేసే చోట, ప‌నిచేయించే చోట ఎక్క‌డైనా కానీయండి ‘నేను’ అనే మాట‌ను వాడ‌టంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి. నిజంగా మీరు ఒక్క‌రే బాగా క‌ష్ట‌ప‌డినప్ప‌టికీ మ‌నం క‌ష్ట‌ప‌డ‌టం వ‌ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని చెప్పండి. నేను అనే మాట అపార్ధాల‌కు, అపోహ‌ల‌కు దారి తీస్తుంది. సంబంధాల‌ను మెరుగుప‌ర్చుకోవాల‌న్నా, వ్యక్తుల‌కు గౌర‌వించాల‌న్నా ‘నేను’ అన్న ప‌దాన్ని మీ డిక్ష‌న‌రీ నుంచి పూర్తిగా తొలిగించి ఆ స్థానంలో ‘మేము’ అన్న ప‌దాన్ని చేర్చండి.

మిమ్మ‌ల్ని మీరు స‌రిదిద్దుకోండి! 

 

ప్ర‌తీ మ‌నిషిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. సంపూర్ణ‌మైన మ‌నిషి అంటూ ఎవ‌రూ ఉండ‌రు. అయితే త‌న‌లోని లోపాల‌ను గుర్తించ‌డం, వాటిని స‌రిదిద్దుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డ‌మే నిజ‌మైన విజ‌యం. ‘నాకు అన్నీ తెలుసు…నేను చేసిన ప‌నికి తిరుగుండ‌దు.’ అని అనుకోవ‌డం పొర‌పాటు. ఆత్మ‌విశ్వాసానికి, అతి విశ్వాసానికి వెంట్రుక‌వాసి తేడా మాత్ర‌మే ఉంటుంది. ఆత్మ‌విశ్వాసం క‌చ్చితంగా ఉండాల్సిందే అయితే అది అతి విశ్వాసంగా మార‌కుండా చూసుకోవాలి. సంబంధాల విష‌యంలోనూ, ప్ర‌వ‌ర్త‌న విష‌యంలోనూ ఎప్ప‌టిక‌ప్పుడు స్వీయ స‌మీక్ష చేసుకోవాలి. నిజాయితీగా స‌మీక్ష చేసుకున్న‌ప్పుడు మ‌న‌లోని లోపాలు, చేసిన పొర‌పాట్లు క‌చ్చితంగా మీ దృష్టికి వ‌స్తాయి. త‌ప్పులు చేయ‌డం స‌హ‌జం కాబ‌ట్టి దాన్ని అక్క‌డే వ‌దిలేసి అటువంటి త‌ప్పులు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చూసుకొండి. కెరీర్ లోనూ, కుటుంబంలోనూ సంబంధాలు, గౌర‌వం ఇచ్చుపుచ్చుకోవ‌డంలో త‌ప్ప‌నిస‌రిగా స్వీయ స‌మీక్ష చేసుకోవాలి. మీదే త‌ప్పు ఉంద‌ని తేలితే లేదా ఎటువంటి భేజ‌షాల‌కు పోకుండా త‌ప్పును స‌రిదిద్దుకునేందుకు ప్ర‌య‌త్నం చేయండి. అవ‌స‌ర‌మైతే క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు కూడా వెనుకాడ‌కండి. క్ష‌మాప‌ణ చెప్ప‌డం అంటే మిమ్మ‌ల్ని మీరు త‌గ్గించుకున్న‌ట్టు కాదు మీరు సంబంధాల‌కు అధిక విలువ ఇస్తున్న‌ట్టు.

 

మీ అభిప్రాయాల‌తో ప్ర‌పంచానికి ప‌నిలేదు! 

 

మీరు కొంద‌రు వ్య‌క్తుల‌పై లేదా కొన్ని వ్య‌వస్థ‌ల‌పై ఒక నిర్దిష్ట‌మైన అభిప్రాయాల‌ను  క‌లిగి ఉండ‌టం మంచిదే. కానీ అది మీ ఎదుగుద‌ల‌ను దెబ్బ‌తీయ‌కుండా చూసుకోండి. ఎందుకంటే అభిప్రాయం క‌లిగి ఉండ‌టం వేరు అదే అభిప్రాయాన్ని మిగిలిన వారు కూడా క‌లిగి ఉండాల‌ని అనుకోవ‌డం వేరు. ప్ర‌తీ వ్యక్తికి ఒక నిర్దిష్ట‌మైన అభిప్రాయాల‌ను క‌లిగి ఉంటాడ‌ని గుర్తించ‌డ‌మే నిజ‌మైన విజ‌యం. అంద‌ర్నీ గౌర‌వించిన‌ప్పుడే మీకు గౌర‌వం ల‌భిస్తుంది. మీకు ఉన్న ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఏ ప‌నీ జ‌ర‌గ‌దు. మీదైన వ్య‌వ‌స్థ‌లో అది సాధ్య‌మేమో కానీ విభిన్న మ‌న‌స్త‌త్వాల మ‌నుష్య‌లు ఉన్న ప్ర‌పంచంలో అది అస్స‌లు సాధ్యం కాదు. ఎందుకంటే మీ అభిప్రాయాల‌తో ఏకీభ‌వించ‌ని వాళ్లు కూడా ఇక్క‌డ మ‌నుగ‌డ సాగించ‌గ‌ల‌రు. కాబ‌ట్టి అంద‌రి అభిప్రాయాల‌ను, వ్య‌క్తిత్వాల‌ను గౌర‌విస్తూ ముందుకు సాగితేనే విజ‌యం మీ ద‌రికి చేరుతుంది. లేకుంటే మాన‌సిక సంఘ‌ర్ష‌ణ త‌ప్ప ఎటువంటి ఉప‌యోగం ఉండ‌దు.