ముఖ పుస్త‌క ఉల్లాసమే…మాన‌వ‌ సంబంధాల‌కు ఖ‌ల్లాస్..!

 

మ‌నిషి జీవితంలో మాన‌వ సంబంధాల‌దే ముఖ్య‌మైన స్థానం. స‌మాజంలో ప‌రిపూర్ణమైన‌ మ‌నిషిగా ఎద‌గాలంటే ఆరోగ్య‌క‌ర‌మైన మాన‌వ సంబంధాల‌ను కొనసాగించాల్సి ఉంటుంది. ఒక్క కుటుంబంతోనే కాదు త‌న తోటి వారందరితో గౌర‌వం, అప్యాయ‌త‌తో కూడిన వైఖ‌రిని క‌లిగి ఉండాలి. మాన‌వ సంబంధాలు ఎంత ముఖ్య‌మో, ప్ర‌తీ మ‌నిషికి సాటి మ‌నిషి ఎంత ప్ర‌ముఖ‌మైన వాడో మ‌న భారతీయ ధార్మిక గ్రంధాల్లో చాలా చ‌క్క‌గా పొందుప‌ర్చారు. అయితే పెరుగుతున్న సాంకేతిక‌త‌, సంపాద‌న కోసం తీస్తున్న ప‌రుగు మ‌నిషిని అనుబంధాల‌కు, ఆప్యాయ‌త‌ల‌కు దూరం చేస్తున్నాయి. చివరికి మ‌నిషిని మ‌నిషిని క‌లిపేందుకు ఉద్దేశించిన సాంకేతిక‌త‌ను కూడా మ‌నం త‌ప్పుడు దారిలోనూ వాడుకుంటూ మ‌న అజ్ఞానాన్ని చాటుకుంటున్నాం. ముఖ్యంగా సోష‌ల్ మీడియాకు దిశానిర్దేశం చేస్తున్న ఫేస్ బుక్ ను కూడా స‌రైన ప‌ద్ధ‌తిలో వాడుకోవ‌డం చేత‌కాక సాటి మ‌నిషితో ఆర్యోగ‌క‌ర సంబంధాల‌ను తెగ్గొట్టుకుంటున్నాం. మ‌న ఆత్మీయులు, స‌న్నిహితుల‌కు సంబంధించిన ముఖ్య‌మైన సంద‌ర్భాల్లో ఒక లైక్ కొట్టో లేక ఒక కామెంట్ ప‌డేసో ఫోన్ దులిపేసుకుంటున్నాం. ఇటువంటి విధానంతో మానవ సంబంధాలు ఏ విధంగా మెరుగుప‌డ‌తాయి? మ‌నిషి ప‌రిపూర్ణ మాన‌వుడిగా ఎలా ఎదుగుతాడు?

 

మంచి వేదిక‌ను స‌రిగ్గా ఎందుకు ఉప‌యోగించుకోలేక‌పోతున్నాం?

 

గ‌తంలో మ‌న ఇంటికి వ‌చ్చిన బంధువుల‌కు, ఆత్మీయులకు మ‌నం స్నేహ పూర్వ‌క ఆతిధ్యాన్ని అందించేవాళ్లం. వాళ్ల క్షేమ స‌మాచారాన్ని క‌నుక్కున్నాక‌, మ‌న ఇంటిలో జ‌రిగిన వేడుక‌ల ఫోటోల‌ను లేదా మ‌నం సాధించిన అవార్డుల‌నో లేక సాధించిన ఘ‌న‌త‌ల‌ను వాళ్ల‌కు చెప్పేవాళ్లం. వాళ్ల‌తో ప్ర‌త్య‌క్షంగా మ‌న అనుభూతుల‌ను పంచుకోవ‌డం వ‌ల‌న సంబంధాల్లో గాఢ‌త ఎక్కువ‌గా ఉండేది. ఈ ఆధునిక యుగంలో అన్నీ మారిపోయాయి. ఉపాధి కోసం చాలా మంది ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స వ‌చ్చారు. మ‌నుష్యుల మ‌ధ్య దూరం పెరిగింది. అందుకే ఇటువంటి విష‌యాల‌ను పంచుకునేందుకు సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకుంటూ ఫేస్ బుక్ వంటి సామాజిక వేదిక‌లు వ‌చ్చాయి. ఒక వ్య‌క్తికి సంబంధించిన ప్ర‌తీ విష‌యాన్నీ అత‌ను ఫేస్ బుక్ లో త‌న సన్నిహితుల‌తో స్నేహితుల‌తో షేర్ చేసుకునే స‌దుపాయం వ‌చ్చింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. ఫేస్ బుక్ లో త‌న స్నేహితుని ఫోటోను చూసి చాలా మంది లైక్ కొట్టి ఊరుకుంటున్నారు కానీ అత‌న్ని ప్ర‌త్య‌క్షంగా క‌లిసి విష్ చేయ‌డ‌మో లేక ఫోన్ ద్వారా మాట్లాడి క్షేమ స‌మాచారం క‌నుక్కోవ‌డ‌మో వంటి ప‌నులు చేయ‌డం లేదు. కేవ‌లం ఒక్క లైక్ ప‌డేస్తే అత‌న్ని అత‌నితో మీకున్న సంబందాన్ని మీరు ఏ విధంగా గౌర‌విస్తున్న‌ట్టు? ఇటువంటి లైక్ , కామెంట్స్ బంధాలు ఎన్ని రోజులు నిల‌బ‌డ‌తాయి?

 

 

ప్ర‌త్య‌క్షంగా మాట్లాడ‌ట‌మే సంబంధాల‌ను నిలుపుతుంది!

 

ఫేస్ బుక్ లో ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రికీ వంద‌లాది మంది మిత్రులు ఉంటున్నారు. అందులో అధిక శాతం ముంది ముక్కూ మొఖం తెలియ‌ని వారే. ఒక వ్య‌క్తి త‌న ఫేస్ బుక్ లో త‌న జీవితంలో జ‌రిగిన ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌ను పోస్ట్ చేసిన‌ప్పుడు అందులో చాలా మంది లైక్, లు కామెంట్ల‌తో స్పందిస్తారు. వాస్త‌వంగా చెప్పాలంటే అందులో చాలా వ‌ర‌కూ కృత్రిమ‌త‌తో కూడుకున్న పైపై అభినంద‌న‌లు మాత్ర‌మే ఉంటాయి. స‌ద‌రు వ్య‌క్తికి ప్రాణ మిత్రుడైన వ్య‌క్తి కూడా ఆ విధంగానే ఒక కామెంట్ ప‌డేసి ఊరుకుంటే ఆ ఇద్ద‌రి స్నేహితుల మ‌ధ్య బంధం ఎలా ధృడ‌ప‌డుతుంది? త‌న స్నేహితుడిని ప్రత్య‌క్షంగా క‌ల‌వ‌డ‌మో లేక ఫోన్ చేసి మాట్లాడ‌మో చేసిన‌ప్పుడే ఆ ఇద్ద‌రి మ‌ధ్య బంధం మ‌రింత‌గా పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ విధంగా చేస్తున్న‌వారు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఫేస్ బుక్ సాక్షిగా ఒక లైక్ ప‌డేసి ఊరుకుంటున్నారు. దీని వ‌ల‌న క‌ల‌కాలం కొన‌సాగాల్సిన సంబంధాలు మ‌ధ్య‌లోనే తెగిపోతున్నాయి.

 

ఫేస్ బుక్ లో టీచ‌ర్లు పెరిగిపోయారు!

 

ఇటీవ‌లి కాలంలో ఫేస్ బుక్ లో ప్ర‌తీ ఒక్క‌రూ ఏదో ఒక మంచి ప‌ని చేయాల‌ని, మంచి విష‌యం చెప్పాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. అందులో భాగంగానే కొంద‌రు టీచ‌ర్ల అవ‌తారమెత్తి మంచి విష‌యాల‌ను చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది కానీ వ్య‌క్తిగ‌త ప్ర‌చారం మాయ‌లో ప‌డి అస‌లు విష‌యాన్ని గాలికి వ‌దిలేస్తున్నారు. ప్ర‌స్తుతం సొసైటీలో చాలా మంది ఏదైనా ఒక ఘ‌ట‌న జ‌ర‌గ్గానే ముందు దాన్ని చిత్రీక‌రించి త‌న పేజ్ లో పోస్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు కానీ దాని కంటే ముందు ఆ ఘ‌ట‌న‌కు సాటి మ‌నిషి తాను నిర్వ‌ర్తించాల్సిన బాధ్య‌త‌ల‌ను మ‌ర్చిపోతున్నారు. ఒక మ‌నిషికి ప్ర‌మాదం జ‌రిగి గాయాల‌తో బాధ‌ప‌డుతుంటే అత‌నికి సాయం చేయ‌కుండా ఆ యాక్సిడెంట్ ను చిత్రీక‌రించ‌డానికే మ‌నుష్యులు ముందుండ‌టం మ‌నం ఎంత దిగ‌జారిపోయామో అన్న విష‌యాన్ని తెలియ‌జేస్తోంది. అలాగే సెల‌బ్రిటీల‌తో ఫోటోలు దిగ‌డం , వాటిని పోస్ట్ చేసి అత‌ను నాకు బాగా కావాల్సిన వాడు అని చెప్పుకోవ‌డం వంటి మానసిక రుగ్మ‌త‌ల‌కు గుర‌వుతున్నారు. మ‌రికొంత త‌ను పెట్టిన ఫోటోకు లైక్ రాకుంటే మాన‌సికంగా చిరాకు ప‌డిపోతున్నారు. అస‌లు విష‌యాన్ని గాలికొదిలి ప్ర‌చారం కోసం ఎగ‌బ‌డుతూ తోటి వారితో సంబంధాల‌ను మ‌న‌కు మ‌న‌మే చెడ‌గొట్టుకుంటున్నాం.

 

 

సాంకేతిక‌త‌ను వాడుకోవాలి కానీ దానికి బ‌లికాకూడ‌దు!

 

సాంకేతిక‌త అంటే ఎక్క‌డినుంచో ఊడిప‌డ‌లేదు. మ‌న అవ‌స‌రాల కోసం మ‌నం సృష్టించుకున్న ఒక వేదిక‌. అయితే దాన్ని స‌రైన ప‌ద్ధ‌తిలో ఉప‌యోగించుకోక‌పోవ‌డం అన‌ర్ధాల‌కు దారితీస్తోంది. ఫేస్ బుక్ కావ‌చ్చు మ‌రే ఇత‌ర డిజిట‌ల్ మీడియా కావ‌చ్చు స‌రైన రీతిలో వాడుకోవ‌డం చేత‌కాక‌పోతే అది మ‌న‌కు స‌మాధి క‌డుతుంది. ఇప్పుడు స‌రిగ్గా అదే జ‌రుగుతోంది. లోతుగా ఆలోచించ‌డం చేత‌కాక మ‌న‌ సౌక‌ర్యం కోసం రూపొందించుకున్న ట‌క్నాల‌జీనే మ‌న‌కు శత్రువుగా చేసుకుంటున్నాం. ఇది ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో విప‌రిణామాలు సంభవించే ప్ర‌మాదం ఉంది. ప్ర‌స్తుతం రాజ్య‌మేలుతున్న డిజిటల్ మీడియా అయినా ఆ త‌ర్వాత రాబోతున్న స్పేస్ టెక్నాల‌జీ అయినా ఏదైనా మ‌న సౌక‌ర్యం కోసం మాత్ర‌మే. మ‌న‌తో ఎప్పుడూ శాశ్వ‌తంగా ఉండేవి మ‌నుష్యుల మ‌ధ్య ప్రేమ‌లు, ఆప్యాయ‌తలు. వాటిని జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. లేక‌పోతే మ‌నం సృష్టించుకున్న సాంకేతిక‌త‌కు మ‌న‌మే బ‌లి అవుతాం.

( ఈ ఆర్టిక‌ల్ ను స్పాన్స‌ర్ చేసినవారు)