సెలబ్రిటీ కావాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ స్టోరీ..!!

 

సెలబ్రిటీ..ప్రస్తుతం సమాజంలో ఈ పదానికి చాలా విలువ, గౌరవం ఉంది. ఇప్పటికే సెలబ్రిటీలుగా ఉన్న వారు ఆ గౌరవాన్ని ఆస్వాదిస్తుంటే మరికొందరు ఆ గౌరవాన్ని అందుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అసలు ఎందుకు ఈ సెలబ్రిటీ హోదా అంటే ఇంత క్రేజ్? సెలబ్రిటీలంటే ప్రజలు ఎందుకు అంత ఆసక్తి చూపిస్తారు? ఎందుకంటే సెలబ్రిటీ స్టేటస్ అనేది అంత సులువుగా వచ్చే హోదా కాదు. ఎన్నో ఏళ్లు శ్రమ చేసి ఎందరినో ఆకట్టుకుని, ఎందరికో పరోక్ష స్పూర్తిని కలుగజేస్తేనే సెలబ్రిటీ హోదా వస్తుంది. ఒకవేళ కొందరికి ఈ స్టేటస్ సులువుగా వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం అంత సులువైన విషయమేమీ కాదు. బాగా శ్రమించే వాళ్లు, కష్టపడే తత్వం ఉన్నవాళ్లు , మానసికంగా బలంగా ఉన్నవాళ్లే సెలబ్రిటీ స్టేటస్ ను కాపాడుకోగలరు. ఒక సామాన్యుడు సెలబ్రిటీగా మారడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుందో దాన్ని నిలబెట్టుకోవడానికి అంతకు రెండింతలు కష్టపడాల్సి ఉంటుంది. మీడియా పరిధి పెరగడం, ఒక విషయాన్ని ప్రజలు చూసే దృక్కోణం మారడం వంటి కారణాలతో కొందరు స్వల్ప కాలంలోనే శిఖరానికి చేరుకుంటున్నారు…అదే సమయంలో చిన్న తప్పు జరిగినా అక్కడినుంచి పాతాళంలోకి జారిపోతున్నారు. రీసెంట్ గా జరిగిన కొన్ని పరిణామాలను నిశితంగా గమనిస్తే సెలబ్రిటీలు ఎంత బాధ్యతగా, ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో అన్న విషయం చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తున్నవారు తమను చాలా కళ్లు గమనిస్తున్నాయని తాము బాధ్యతాయుతంగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అవసరముందని మర్చిపోతున్నారు. సెలబ్రిటీగా ఎదగాలని ఎవరైనా బలంగా అనుకుంటే ముందుగా వారు తెలుసుకోవాల్సింది చాలానే ఉంది.

 

 

సెలబ్రిటీ హోదా అంటే తెలియని భారం మోయడం!!

 

సెలబ్రిటీ హోదా అంటే చలిపెడుతున్నా, వర్షం పడుతున్నా, ఎండ మండి పోతున్నా నీట్ గా కోటు వేసుకుని తిరగడం లాంటిది. చలిపెడుతున్నప్పుడు ఆ కోటు సౌకర్యంగా ఉండొచ్చు. కానీ ఎండ మండిపోతున్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు కోటు చాలా ఇబ్బంది పెడుతుంది. కోటు వలన లోపల ఎంత చిరాకు వస్తున్నా, అసౌకర్యం అనిపిస్తున్నా దాన్ని చిరునవ్వుతో భరించాలి. ఎందుకంటే చాలా ఇష్టపడి, కష్టపడి మనం ఆ కోటును కొనుక్కున్నాం. కోటు నీటుగా లేకపోయినా మాసిపోయినా ప్రజలు మనల్ని చూసే విధానం మారిపోతుంది. నా ఇష్టం వచ్చినట్టు ఉంటా..నాకు నచ్చినట్టు చేస్తా…అంటే సెలబ్రిటీ హోదాకు దూరమవుతున్నట్టే. లక్ష మందిలో నువ్వు ప్రత్యేకమైన వాడివని, నీ ఏదో గొప్పతనం ఉందని మిగిలిన 99,999 మంది నిన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. అటువంటుప్పుడు నువ్వు కూడా మిగిలిన వాళ్లలానే బలహీనుడిలా, బలహీనతలను బహిర్గతం చేసుకుంటూ, పొరపాట్లు చేస్తూ ఒక మామూలు మనిషిలా కనిపిస్తే ఇంక సెలబ్రిటీ హోదాకు అర్ధం ఏముంది? చిన్న చిన్న తప్పులు చేస్తూ చాలా మంది తమ సెలబ్రిటీ హోదాను పొగొట్టుకుంటున్నారు. ఎన్నో ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న హోదాను, గౌరవాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. నిజంగా తప్పు జరిగిందా? లేక అందులో కుట్ర కోణం ఉందా? అన్న విషయాల జోలికి మనం పోవద్దు. కానీ బలహీనతలను ప్రదర్శించుకుని అజాగ్రత్తగా వ్యవహరించి ఇటీవల కొందరు సెలబ్రిటీలు తమ గౌరవానికి తామే భంగం కలిగించుకున్నారు.అది గజల్ శ్రీనివాస్ కావచ్చు, యాంకర్ ప్రదీప్ కావచ్చు. వాస్తవంగా ఏం జరిగింది అన్నది ప్రజలకు అవసరం లేదు. అది చెప్పేందుకు కూడా ఎవరూ సిద్దంగా లేరు. ఇటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరు? ఎందుకంటే శిఖరంపై ఉన్నవారికే లోయలోకి పడిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది.

 

 

సెలబ్రిటీ కావాలంటే ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!

 

ముందు చెప్పుకున్నట్టు సెలబ్రిటీ హోదా అనేది కష్టపడి తెచ్చుకున్నటువంటి ఒక అరుదైన గౌరవం. మనం ఎంచుకున్న రంగంలో కష్టపడుతూ విలువలు పాటిస్తూ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లినప్పుడే సెలబ్రిటీ హోదా సాధ్యమవుతుంది. ఈ ప్రణాళికలో మొదటిది ప్రవర్తన. మన ప్రవర్తనే మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. విచ్చలవిడిగా ఉంటూ నాకు నచ్చినట్టు నేను ఉంటా అని రొమ్ము విరుచుకు తిరిగే సొసైటీ మనది కాదు. అలా అనుకున్న వాళ్లు సెలబ్రిటీలు ఎప్పటికీ కాలేరు ఒకవేళ సెలబ్రిటీ అయినా దాన్ని కాపాడుకోలేరు. సెలబ్రిటీ హోదాను నిలబెట్టుకోవాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకుని మసులుకోవాల్సిందే. నేను ఎందుకు అలా ఉండాలి? నాకు నచ్చినట్టు నేను ఉంటా..అంటే గౌరవం గంగలో కలుస్తుంది. సెలబ్రిటీల ప్రవర్తనను లక్షల కళ్లు నిశితంగా గమనిస్తాయి. ముఖ్యంగా మీడియా, దానికి తోడు సోషల్ మీడియా అనుక్షణం మీ ప్రవర్తనపై కన్నేసి ఉంచుతాయి. తాజాగా అమ్మాయిల వ్యవహారంలో గజల్ శ్రీనివాస్, మద్యం తాగి వాహనం నడిపిన ఉదంతంలో యాంకర్ ప్రదీప్. తమ ప్రవర్తనతో తమ సెలబ్రిటీ హోదాకు ముప్పు తెచ్చుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సహజీవనం, అంతులేని ఆవేశం అన్న కారణాలతో తన ప్రభను కాస్త కోల్పోయాడు. కానీ చేసిన తప్పును బాహాటంగా ఒప్పుకుని నిజాయితీగా వ్యవహరించడంతో ఇప్పుడు మళ్లీ అతనికి ఆదరణ పెరిగింది. ఇప్పుడు యాంకర్ ప్రదీప్ కూడా చేయాల్సింది అదే. బయటకు వచ్చి తన తప్పును ధైర్యంగా ఒప్పుకుంటే అతని సెలబ్రిటీ కచ్చితంగా నిలబడుతుంది. ప్రస్తుతం చాలా మంది ఇంకోరకమైన వాదనను తీసుకువస్తున్నారు. వాళ్లు సెలబ్రిటీలు అయినంత మాత్రాన వాళ్లకు మానవ సహజమైన బలహీనతలు ఉండవా? వాళ్లు తప్పు చేయకూడదా? అని. కానీ సెలబ్రిటీలుగా ఉన్న వారికి బలహీనతలు ఉండొచ్చు కానీ వారు పదిమందికి ఆదర్శంగా నిలబడాల్సిన వ్యక్తులు. వారు ఏం పని చేసినా బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. నాకు నచ్చినట్టు నేను ఉంటా తనను ఆదర్శంగా తీసుకున్నవాళ్లకు అతను ఎటువంటి సందేశం ఇవ్వదల్చుకున్నాడు అన్న ప్రశ్న తలెత్తుతుంది. సెలబ్రిటీ స్టేటస్ లో ప్రవర్తన తర్వాత కుటుంబ వ్యవహారాలు,సామాజిక జీవనం, బాధ్యతల నిర్వహణ, ఆస్తి వ్యవహారాలు అన్నవి కూడా చాలా ముఖ్యం.

 

 

ప్రవర్తనే కాదు మిగిలిన విషయాల్లోనూ నిరూపించుకోవాలి!

 

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఎందుకు అంత క్రేజ్ వచ్చింది. ఆయన సినిమా షూటింగ్ అయిపోగానే ఒక మామూలు మనిషిలా ఉంటాడు. ఎటువంటి హంగులకు, ఆర్భాటాలకు పోకుండా సాధారణంగా ఉంటాడు. పంచె కట్టుకుని హవాయి చెప్పులు వేసుకుని రోడ్డు పక్కన టీ తాగుతూ కనిపిస్తాడు. అదే అతనికి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. తన ప్రవర్తన తన సెలబ్రిటీ స్టేటస్ ను పెంచింది. అలాగే సెలబ్రిటీ స్టేటస్ ను అనుభవించేవాడు కుటుంబ వ్యవహారాలను కూడా సరిగా చూసుకోవాలి. వాళ్లు వ్యక్తిగత జీవితంపై చాలా మంది ఆసక్తి చూసిస్తారు. అక్కడ ఎటువంటి మరక పడకుండా చూసుకోవాలి. ఇక సామాజిక జీవనంలో, ఒక పౌరుడిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో అందరికీ ఆదర్శంగా నిలవాలి. తోటి వాళ్లను గౌరవించడం, సామాన్యంగా ఉండటం, సమాజం పట్ల తన భాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించడం కూడా చాలా ముఖ్యం. స్నేహితులను కాపాడుకోవడం, బాంధవ్యాలను నిలబెట్టుకోవడం కూడా ముఖ్యమే. మార్టిన్ లూథర్ కింగ్ చెప్పినట్టు నువ్వు తీరికగా ఉన్నప్పుడు నీ మిత్రులతో , ఆత్మీయులతో 30 నిమిషాలు మాట్లాడు. ఒకవేళ నువ్వు చాలా బిజీగా ఉన్నప్పుడు కనీసం ఒక్క నిమిషం అయినా మాట్లాడు. కానీ మాట్లాడటం మాత్రం మానేయకు. అని. మానవ సంబంధాల విషయంలో సరైన విధంగా వ్యవహరించడం చేతకాకపోతే సెలబ్రిటీ హోదా రాదు. ఒక వేళ వచ్చినా అది చాలా తొందరగా పోతుంది.

 

 

బాధ్యతగా ఉంటూ ఆదర్శంగా జీవించడమే సెలబ్రిటీ హోదా!

 

ఎన్‌డీ తివారీ, గజల్ శ్రీనివాస్, యాంకర్ ప్రదీప్..ఇలా ఎందరో సెలబ్రిటీలు తమ గౌరవాన్ని కాస్త కోల్పోయారంటే కారణమేంటి? వాళ్లు నిజంగా తప్పు చేసారా? లేదా? అన్న చర్చ లోకి మనం వెళ్లడం లేదు. సెలబ్రిటీ హోదాలో ఉండి అజాగ్రత్తగా ఉన్నారన్న కారణంపైనే మనం మాట్లాడుకుంటున్నాం. ఒక చిన్న అజాగ్రత్త వాళ్లు ఎన్నో ఏళ్లు నిర్మించుకున్న కెరీర్ ను , గౌరవాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇక సామాన్యుడికి ఇలా జరిగితే ఎవరూ పట్టించుకోరు. సెలబ్రిటీగా ప్రజల నీరాజనాలు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు కాస్త బాధ్యతగా ఉండాల్సి అవసరం కూడా ఉంది. ప్రతీ ప్రయోజనం వెనుకా ఒక ఆపద లేదా ఒక ప్రతికూలత పొంచి ఉంటుంది కదా? ఏదైనా ఒక సందేశాన్ని ఒక సెలబ్రిటీతోనే ఎందుకు చెప్పిస్తారు? అతను చెపితే ప్రజల్లోకి వేగంగా వెళ్లి వారు దాన్ని అతనిపై అభిమానంతో పాటిస్తారని. మరి ఇలా బాధ్యతాయుతంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అదే ప్రజలు వాళ్లను ఎలా గౌరవిస్తారు? కారులో సౌకర్యవంతంగా ప్రయాణించాలనుకున్నప్పుడు దానికి సరైన విధంగా ఇంధనం పోయాలి. మెయింటైనెన్స్ చేయించాలి. సెలబ్రిటీ హోదాను అనుభవించాలంటే బాధ్యతాయుతంగా ఉండాలి. ఆదర్శవంగా ఉండాలి. మంచి ప్రవర్తనతో ఉండాలి. నాకు నచ్చినట్టు నేను ఉంటా అంటే మీరు సెలబ్రిటీలు కాలేరు ఒక వేళ అయినా దాన్ని కొద్ది రోజుల్లోనే పొగొట్టుకుంటారు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)