మీ టీనేజీ పిల్ల‌ల‌తో గొడ‌వ రావొద్దంటే ఇలా చేయండి చాలు!!

పిల్ల‌ల పెంప‌కంలో త‌ల్లిదండ్రుల‌కు అస‌లైన స‌వాలు వాళ్ల‌ య‌వ్వ‌న ద‌శ‌లో ఎదుర‌వుతుంది. కౌమారం దాటి య‌వ్వ‌నం లోకి వ‌చ్చిన పిల్ల‌ల‌ను హ్యాండిల్ చేయ‌డం అంత సులువైన విష‌య‌మేమీ కాదు. స్నేహితుల్లా ఉంటూనే వాళ్ల‌ను అదుపు చేయాల్సి ఉంటుంది. ఒక మ‌నిషి భ‌విష్య‌త్ ను నిర్ణ‌యించే య‌వ్వ‌నంలో పిల్ల‌ల‌కు స‌రైన దిశానిర్దేశం చేయ‌కుంటే వాళ్ల జీవితం ఇబ్బందుల్లో ప‌డుతుంది. చాలా మంది టీనేజీ పిల్ల‌లు త‌మ ప్ర‌వ‌ర్త‌న‌తో, దూకుడుతో త‌ల్లిదండ్రుల‌కు స‌వాలు విసురుతారు. ఇటువంటి స‌మ‌యంలో సంయ‌మ‌నంతో, ఓర్పుతో వ్య‌వ‌హ‌రించాల్సింది త‌ల్లిదండ్రులు మాత్ర‌మే. వాళ్లు చేస్తున్న ప‌నులు కోపం తెప్పిస్తున్నా స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతున్నా స‌రే త‌ల్లిదండ్రులు పిల్ల‌ల సంక్షేమాన్నే దృష్టిలో పెట్టుకుని ప్ర‌వ‌ర్తించాల్సి ఉంటుంది. స‌హ‌నం కోల్పోయి తమ టీనేజీ పిల్ల‌ల‌తో గొడ‌వ‌ల‌కు దిగితే ప‌రిస్థితి మ‌రింత‌గా దిగ‌జారుతుంది. పిల్ల‌లు మ‌రింత మొండిగా త‌యార‌వ‌డంతో పాటు ఇంట్లో సంబంధాలు, వాతావ‌ర‌ణం దెబ్బ‌తింటాయి. ఇటువంటి ప‌రిస్థితి ఎదురైన‌ప్పుడు త‌ల్లిదండ్రులు ఏ విధంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న‌దానిపై కెరీర్ టైమ్స్ ప్ర‌త్యేక క‌థనం.

 

 

 స్వీయ స‌మీక్ష చేసుకోండి!

 

కుటుంబంలో మిగ‌తా సంబంధాల‌తో పోలిస్తే పిల్ల‌ల‌తో మ‌న సంబంధం చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. భావోద్వేగాల ప‌రంగా అది మ‌న వైఖ‌రిపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. ఇత‌ర సంబంధీకుల‌తో మ‌న ఉద్వేగాల‌ను ప్ర‌ద‌ర్శించాల్సి వ‌చ్చిన‌ప్పుడు మ‌నం అంత సంఘ‌ర్ష‌ణ‌కు లోనుకాం. అదే మ‌న పిల్ల‌ల‌పై కోసం చూపించాల్సి వ‌చ్చిన‌ప్పుడు, వాళ్ల‌తో ఘ‌ర్షణ ప‌డాల్సిన సంద‌ర్భంలో మానసికంగా చాలా ఒత్తిడికి లోన‌వుతాం. ఉదాహ‌ర‌ణ‌కు పిల్ల‌లు ప్ర‌తీరోజూ తొంద‌ర‌గా ప‌డుకోకుండా మిమ్మ‌ల్ని స‌తాయిస్తూ నిద్ర‌పోమ్మ‌ని చెప్పినా త‌ల‌బిరుసుగా స‌మాధానం చెప్పిన‌ప్పుడు మీరు ఏం చేస్తారు? చాలా మంది త‌ల్లిదండ్రులు ఇక్క‌డ పిల్ల‌ల‌ను తీవ్రంగా కొప‌గించుకుని కొన్ని సంద‌ర్భాల్లో కొట్టి బ‌లవంతంగా నిద్ర‌పుచ్చుతారు. అయితే వాళ్లు నిద్ర‌పోతారు కానీ ఆ త‌ర్వాత త‌ల్లిదండ్రుల‌కు నిద్ర క‌ర‌వ‌వుతుంది. అయ్యో పిల్ల‌వాడ్ని అన‌వ‌స‌రంగా కొట్టామే! అలా కొట్ట‌కుండా న‌చ్చ‌చెప్పి ఉండాల్సింది! కోపాన్ని అదుపు చేసుకుంటే బాగుండేది! ఇలా ఆలోచిస్తూ నిద్ర‌కు దూర‌మై ఒత్తిడిని పెంచుకుంటారు. ఇటువంటి సంద‌ర్భంలో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న దానిపై స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డ‌మే ఈ ప‌రిస్థితికి కార‌ణం. అయితే పేరెంట్స్ ఎంత ఓపిగ్గా ఉండాల‌ని నిర్ణ‌యించుకుని ఫ‌లానా సంద‌ర్భంలో ఈ విధంగా ఉండాలి అని తీర్మానం చేసుకున్న త‌ర్వాత పిల్ల‌లు మ‌రో స‌వాలుతో రెడీగా ఉంటారు. అప్పుడు ఎంత గ‌ట్టిగా అనుకున్నా ప‌రిస్థితి తీవ్ర‌త‌ను బట్టి భావోద్వేగాలు మ‌రోసారి అదుపు త‌ప్పుతాయి. ఇటువంటి స‌మ‌యాల్లో స్వీయ స‌మీక్ష చేసుకుని పిల్ల‌ల‌తో ఏ విధంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న‌దానిపై స్వీయ స‌మీక్ష చేసుకుంటే ఫలితం ఉంటుంది.

 

 

పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌నకు ఒక కార‌ణం ఉంద‌ని అర్ధం చేసుకోండి!

 

కౌమారం తో పాటు య‌వ్వ‌న ద‌శలో ఉన్న పిల్ల‌లు విభిన్న కార‌ణాల రీత్యా అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌కు, కోపానికీ, అల్ల‌రికి పాల్ప‌డుతూ ఉంటారు. వాళ్ల అనుచిత ప్ర‌వ‌ర్త‌నకు ఒక కార‌ణం ఉంటుంటి. స‌రిగ్గా ఆలోచిస్తే వాళ్ల ప్ర‌వ‌ర్త‌న ఎందుకు అలా ఉంద‌న్న దానిపై ఒక అంచ‌నాకు రావ‌చ్చు. చాలా మంది త‌ల్లిదండ్రులు తాము అనుకుంటున్న‌దే స‌రైన‌ది అని పిల్ల‌ల‌దే త‌ప్పు అన్న రీతిలో ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి ఆలోచ‌నా విధానం మంచి పేరెంటింగ్ లో అనుస‌ర‌ణీయం కాదు. ఎందుకంటే పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌నకు ఒక నిర్దిష్ట‌మైన కార‌ణం ఉంటుంది. ఎందుకు చేయ‌కూడ‌దు అన్న మొండిత‌నంతోనో, అసూయ‌తోనో, కోపంతోనో వాళ్లు అలా ప్ర‌వ‌ర్తిస్తూ ఉంటారు. వాళ్ల ప్ర‌వ‌ర్త‌నను స‌రిగ్గా అర్ధం చేసుకుని అది ఎందుకు జ‌రుగుతుందో క‌నుక్కుని దానికి త‌గిన ప‌రిష్కారాన్ని వెత‌కాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌దే. అలా కాకుండా వాళ్ల‌ను దండించి పెద్ద‌గా అరిచి వాళ్ల‌తో అల్ల‌రిని , వాళ్ల నిర‌స‌న‌ను అడ్డుకోవాల‌ని చూస్తే వాళ్లు మ‌రో ప‌ద్ధ‌తిలో దాన్ని కొన‌సాగిస్తారు. కాబ‌ట్టి స‌మ‌స్య‌కు మూల కార‌ణాన్ని గుర్తించి దానికి త‌గిన ప‌రిష్కార మార్గాన్ని క‌నిపెట్టాలి.

 

 

పిల్ల‌ల‌కు స్వంత నిర్ణ‌యాలు తీసుకునే స్వేచ్ఛనివ్వండి!

 

ఒక్క‌సారి మీ చిన్నత‌నాన్ని గుర్తుకు తెచ్చుకొండి. మీ త‌ల్లిదండ్రులు ఫ‌లానా టైంకి నిద్ర‌లేవాలి..ఫ‌లానా టైం తినాలి..ఈ టైంకే ఆ ప‌ని చేయాలి..చివ‌రికి ఫ‌లానా మాట‌లే మాట్లాడాలి అని మిమ్మ‌ల్ని స‌తాయిస్తున్న‌ప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయి ఉంటారు. ఇప్పుడు మీరు కూడా అటువంటి అభిప్రాయాలు, క్ర‌మ‌శిక్ష‌ణ రుద్దుడు కార్య‌క్ర‌మం పెడితే పిల్ల‌లు ఎంత ఒత్తిడికి లోన‌వుతారో ఆలోచించారా? పిల్ల‌లు సొంతంగా నిర్ణ‌యాలు తీసుకునేలా, వ్య‌వ‌హ‌రించేలా వారికి స్వేచ్ఛ‌నివ్వండి. అయితే ఆ స్వేచ్ఛ దారి త‌ప్ప‌కుండా కాస్త ప‌ర్య‌వేక్ష‌ణ చేయండి చాలు. వాళ్లు సొంతంగా ఎదిగేందుకు మార్గం సుగ‌గ‌మ‌వుతుంది. మీ ఐదేళ్ల పిల్ల‌లైనా స‌రే షాప్ కు వెళ్లిన‌ప్పుడు నాకు ఫ‌లానా డ్రెస్ న‌చ్చింది అదే కొనుక్కుంటాను అంటే అలానే చేయండి. ఎందుకంటే వాళ్లు సొంతంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం నేర్చుకుంటున్నారు. వాళ్ల మ‌న‌స్సుకు న‌చ్చిన పని చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. వాళ్ల కాళ్ల‌కు బంధ‌నాలు వేయ‌కండి. వాళ్ల ఎంపిక‌ను గౌర‌వించండి. వాళ్ల ఆలోచ‌న‌ను అర్ధం చేసుకోండి.

 

 

స్నేహితుల్లా మెల‌గండి!

 

ఒక పిల్ల‌వాడు అదే ప‌నిగా త‌ల్లిదండ్రులు వ‌ద్ద‌న్న పనిని చేస్తున్నాడంటే అది వాళ్ల‌కు అతిపెద్ద స‌వాలే. ఇటువంటి స‌మ‌యంలో చాలా మంది త‌ల్లిదండ్రులు స‌హ‌నం కోల్పోతారు. చిన్న పిల్ల‌వాడు అయితే కొట్ట‌డ‌మో లేదా కాస్త పెద్ద పిల్ల‌వాడు అయితే ఘ‌ర్ష‌ణ ప‌డ‌ట‌మో చేస్తూ ఉంటారు. అయితే ఇలా స‌హ‌నం కోల్పోయి వాళ్ల‌తో గొడ‌వ ప‌డ‌టం అనేది అంత మంచి ఫ‌లితాల‌ను ఇవ్వ‌దు. పైగా మీ పిల్ల‌ల‌తో మీ అనుబంధాన్ని తీవ్రంగా దెబ్బ‌తీస్తుంది. అయితే చేయాల్సింది గొడ‌వ ప‌డ‌టం కాదు. వాళ్ల‌తో సామ‌ర‌స్యంగా మాట్లాడాలి. స‌రే ఈ స‌మ‌స్య‌కు నువ్వే ప‌రిష్కారం చెప్పు..నువ్వు చేస్తున్న ప‌నుల వ‌ల‌న ఇటువంటి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి..నువ్వు స‌మ‌స్య ఏంటో చెప్ప‌డం లేదు. కాబ‌ట్టి ప‌రిష్కారం చేయాల్సిందే కూడా నువ్వే అంటూ వాళ్లతో మాట్లాడాలి. ఇలా మాట్లాడ‌టం వ‌ల‌న పిల్ల‌లు ఆలోచ‌న‌లో ప‌డ‌తారు. త‌న ప్ర‌వ‌ర్త‌న ఇంతలా త‌న పేరెంట్స్ ను బాధిస్తుందా? అన్న కోణంలో ఆలోచించ‌డం మొద‌లుపెడ‌తారు. త‌మ‌కు ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే త‌ల్లిదండ్రుల‌తో స్వేచ్ఛ‌గా చెపుతారు. కాబ‌ట్టి పెంప‌కంలో స‌హ‌నంతో వ్య‌వ‌హ‌రించండి. మ‌నం ముందు చెప్పుకున్న‌ట్టు పెంప‌కం అనేది అంత సులువైన విష‌య‌మేమీ కాదు. మానసికంగా మ‌న‌ల్ని మ‌నం ఎప్ప‌టిక‌ప్పుడు స‌రి చేసుకుంటూ కొత్త విష‌యాలు నేర్చుకుంటూ ఉద్వేగాల‌ను అదుపులో ఉంచుకున్న‌ప్పుడే మంచి త‌ల్లిదండ్రులం అనిపించుకోగ‌లం.

 

(ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్న‌వారు)