న్యూ ఇయర్ లో ‘ఈ పనులు’ చేస్తే మీ కెరీర్ వెలిగిపోతుంది!!

 

కెరీర్ లో స్తబ్దత, అస్తవ్యస్థమైన పనివేళలు, రోటీన్ పని..ఇవన్నీ ఉద్యోగికి చిరాకు తెప్పిస్తాయి. ఎలాగైనా ఉద్యోగం మారాలని, కెరీర్ లో పైకి ఎదగాలన్న కోరికను పుట్టిస్తాయి. అయితే అది అనుకున్నంత సులువేమీ కాదు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావడం, నైపుణ్యాలను పెంచుకోవడం ఉద్యోగం చేస్తున్న వారికి కాస్త కష్టమైన విషయాలే. అయితే ఇవి అసాధ్యమైనవేమీ కాదు. కాస్త ప్రణాళిక ఉంటే చాలు కెరీర్ ను పరుగులు పెట్టించవచ్చు. ఈ కొత్త ఏడాదిలో బోర్ కొట్టించే రోటీన్ కెరీర్ కు పుల్‌స్టాఫ్ పెట్టి ఎనర్జటిక్, ఎమర్జింగ్ కెరీర్ కు పరుగులు పెట్టాలంటే కొన్ని పనులు చేయాల్సిందే. కెరీర్ కు బూస్ట్ నిచ్చే ఈ పనులు ఏంటో ఓ సారి చూద్దామా!!

 

  • ఎంత రోటీన్ ఉద్యోగమైనా, మీరు చేస్తున్న పని మీకు అంతగా నచ్చకపోయినా సరే గడిచిన ఏడాది మీరు కొన్ని విజయాలు సాధించే ఉంటారు కదా? అయితే విజయాలను అన్నింటిని గుర్తుకు తెచ్చుకుని ఒకచోట రాసుకోండి. అలాగే మీరు చేసిన పొరపాట్లను కూడా రాసిపెట్టండి. ఇవన్నీ ఎందుకంటే మీరు కొత్త ఏడాదిలో కచ్చితంగా అప్‌డేట్ కావాల్సి ఉంది. ఇలా అప్‌డేట్ కావాలంటే మీ బలాలు మీ బలహీనతలు తెలిసి ఉండాలి. ఎక్కడ మీరు ఇబ్బందిపడుతున్నారో గుర్తించి దానికి సంబంధించిన నైపుణ్యం నేర్చుకునేందుకు శిక్షణ తీసుకొండి. అలాగే బలంగా ఉన్న అంశంలో కూడా మరింత నైపుణ్యం అవసరం అనిపిస్తే అందులో కూడా అప్‌డేట్ అవండి.

 

 

  • ఉద్యోగం లో కానీ వ్యాపారంలో కానీ మానవ సంబంధాలు అత్యంత ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తుంచుకుని గడిచిన ఏడాది మీకు మీ పనిలో సహకరించిన సహోద్యుగులకు, మీ మేనేజర్ కు అలాగే మీ శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలపడం మర్చిపోవద్దు. ఇలా ధన్యవాదాలు తెలిపేటప్పుడు టెక్ట్స్ మేసెజ్‌, వాట్సాప్ మేసెజ్‌ ల కంటే మెయిల్ ను పంపడం కాస్త మెరుగ్గా ఉంటుంది. మీకు ఇంకా వీలుంటే మీ స్వదస్తూరితో వాళ్లకు ఒక లేఖ రాస్తే వారికి మీరిస్తున్న విలువకి గుర్తింపు లభిస్తుంది.

 

  • ఇక అన్నింటికంటే ముఖ్యం ఈ కొత్త ఏడాదిలో మీ రెజ్యుమెను ఒకసారి అప్‌డేట్ చేయడం. మీ ప్రస్తుత రెజ్యుమె ఎంత బాగున్నా సరే మరోసారి రెజ్యుమెను సరిచూసుకుని దానిలో తగిన మార్పులు చేర్పులు చేయాలి. మీరు అప్లయ్ చేయబోయే జాబ్ కు అనుగుణంగా రెజ్యుమెను మార్చుకోవాల్సి ఉంటుంది. దానికి సర్వ సన్నద్ధంగా ఉండండి. అవసరమైతే ఈ విషయంలో మీ సీనియర్స్ లేదా నిపుణుల సలహాలను కూడా తీసుకోవచ్చు. ప్రజంట్ ట్రెండ్ కు అనుగుణంగా మీ రెజ్యుమె అప్‌డేటేషన్ లేకుంటే మీరు పోటీలో వెనుకబడినట్టే.

 

 

  • అలాగే మిమ్మల్ని మీరు మరింత బాగా ప్రజంట్ చేసుకునేందుకు మీ బిజినెస్ కార్డ్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ కొత్త ఏడాదిలో వాటిని మరింత కొత్తగా, ఆకర్షణీయంగా డిజైన్ చేసుకోండి. మీ కార్డ్ చూడగానే అవతలి వాళ్లకు మీపై ఒక ఇంప్రెషన్ పడేలా ఆ డిజైన్ ఉండాలి. ఒకవేళ మీకు పర్సనల్ వెబ్‌సైట్ కనుక ఉండి ఉంటే దానిలో కూడా కొత్తగా మార్పులు చేర్పులు చేయండి.

 

  • ఇక కొత్త ఏడాదిలో ఇంటర్వ్యూ కు ప్రిపేర్ అయ్యే పద్ధతుల్లో కూడా మార్పులు చేసుకోండి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నారు కనుక మీరు కొత్త ఉద్యోగానికి వెళ్లినప్పుడు అక్కడి రిక్రూటర్ మీపై చాలా అంచనాలు పెట్టుకుంటారు. దానికి అనుగుణంగానే ఇంటర్వ్యూకు ప్రొఫెషనల్ గా ప్రిపేర్ కండి. ఇంటర్వ్యూలో మీకు సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలకు మరింత ప్రభావవంతంగా రిక్రూటర్ ను ఆకట్టుకునే విధంగా సమాధానం చెప్పేలా ప్రిపేర్ కండి.

 

  • కొత్త ఏడాదిలో మీరు ఆధునీకరించుకోబోయే విషయాల్లో సోషల్ మీడియాకు కూడా పెద్ద పీట వేయండి. సోషల్ మీడియాలో మీ పేజ్‌ ను చాలా క్లియర్ గా ఉంచుకొండి. మీ కెరీర్ కు సంబంధించిన విషయాలను మాత్రమే ఎక్కువగా ఉండేటట్లు చూసుకొండి. అనవరమైన షేరింగ్, కామెంట్లు లేకుండా చూసుకొండి. ఎందుకంటే ఇటీవలి కాలంలో అభ్యర్ధులు, ఉద్యోగుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను రిక్రూటర్స్ నిశితంగా పరిశీలిస్తున్నారు. అందులో వాళ్లు పెట్టిన పోస్ట్ , కామెంట్లు, షేర్ ల ఆధారంగా వాళ్ల వ్యక్తిత్వంపై, సామర్ధ్యంపై ఒక అంచనాకు వస్తున్నారు.

 

 

  • అలాగే ఈ కొత్త ఏడాదిలో మీ కెరీర్ కు బాగా ఉపయోగపడే ఒక కొత్త నైపుణ్యాన్ని కచ్చితంగా నేర్చుకొండి. ఇటీవలి కాలంలో పబ్లిక్ స్పీకింగ్, క్రియేటివ్ రైటింగ్ లకు బాగా ప్రాధాన్యత పెరిగింది. ఈ రెండింటిలో ఏదో ఒక నైపుణ్యాన్ని నేర్చుకునేందుకు ప్రణాళిక వేసుకొండి. ఆఫీస్ పనివేళలు, నేర్చుకోవాల్సిన నైపుణ్యం కు తగినట్టు సమయ ప్రణాళిక వేసుకొండి.

 

  • ఇక అన్నింటికంటే ముఖ్యం. ఈ ఏడాదిలో మీ కెరీర్ కు ఉపయోగపడే పుస్తకాలను అధికంగా చదివేందుకు తగిన సమయాన్ని కేటాయించుకోండి. వ్యక్తిత్వ వికాసం, కెరీర్ గైడెన్స్ కు సంబంధించిన పుస్తకాలను తిరగేయండి. దాని కొసం తగిన సమయాన్ని వీలు చూసుకొండి. మనుష్యులతో ఎలా వ్యవహరించాలి? ఎదుటి వ్యక్తులను ఎలా ఆకట్టుకోవాలి? మన ఆహార్యం , భావవ్యక్తీకరణ ఎలా ఉండాలి? అన్న దానిపై ఎన్నో పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి. అందులో మంచి పుస్తకాలను ఎంపిక చేసుకుని వాటిని చదివేందుకు ప్రయత్నించండి.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)