9 టు 5 రోటీన్ జాబ్ మీకు నచ్చదా? అయితే ఈ కెరీర్స్ పై లుక్కేయండి!

దయాన్నే హడావుడిగా నిద్ర లేవడం, గబా గబా తయారై ట్రాఫిక్ లో ఆఫీస్ కు చేరుకోవడం అక్కడ ఓ 8 గంటలు పనిచేసి సాయింత్రం ఏడుకి మళ్లీ ఇంటికి చేరడం. ఇలా ప్రతీ రోజూ చేసే రోటీన్ జాబ్స్ ను ఈతరం ఇష్టపడటం లేదు. అధిక శాతం మంది 9 టు 5  జాబ్స్ కాకుండా కాస్త భిన్నంగా ఉంటే జాబ్స్ చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా తమకు నచ్చినప్పుడు మాత్రమే పనిచేసే వీలున్న జాబ్స్ ను చాలా మంది కోరుకుంటున్నారు. ఈ విధంగా ఆలోచించే వారి కోసం ప్రజంట్ జాబ్ మార్కెట్లో ఎన్నో జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి. అనుకున్న సమయానికి టాస్క్ ను పూర్తి చేయగలిగితే చాలు వీరు ఏం టైం లో పనిచేస్తున్నారు? ఎంత సేపు పనిచేస్తున్నారు అని ఎవరూ అడగరు. రోటీన్ కు భిన్నంగా కూల్ గా జాబ్ చేయాలనుకునే వారి కోసం చాలా జాబ్స్ రెడీగా ఉన్నాయి. మన ‘కెరీర్ టైమ్స్’ లో ఇప్పుడు అటువంటి జాబ్స్ కోసం తెలుసుకుందాం.

 

ఫ్రీలాన్స్ వెబ్‌ డిజైనర్ 

ఈ టెక్నాలజీ యుగంలో ప్రతీ పనీ వెబ్ సైట్ ద్వారానో లేక మొబైల్ యాప్ ద్వారానో జరుగుతుంది. సమాచార ప్రదర్శనకు, తమ సంస్థ ప్రధాన ఉద్దేశం చెప్పడానికి ప్రతీ కంపెనీకి ప్రత్యేకమైన వెబ్‌సైట్ ఉండాల్సిందే. దీనికి చిన్నా పెద్దా అన్న తేడా లేదు. ప్రతీ సంస్థకు ఇప్పుడు సొంత వెబ్‌ సైట్ తప్పనిసరి. కొన్ని కంపెనీలు తమ కంపెనీలు వెబ్‌సైట్ లో తమ ఉత్పత్తుల అమ్మకాలు కూడా జరుపుతున్నాయి. అయితే కంపెనీకి వెబ్‌సైట్ తప్పనిసరి కానీ కేవలం వెబ్‌డిజైనింగ్ కోసం ప్రత్యేకంగా ఉద్యోగిని నియమించుకోలేవు. అందుకే దాదాపు అన్ని సంస్థలు వెబ్‌డిజైనింగ్ ను ఔట్‌సోర్సింగ్ చేస్తున్నాయి. కాబట్టి పనివేళలతో సంబంధం లేకుండా నచ్చిన సమయంలో పనిచేసుకోవచ్చు. కానీ కంపెనీ నిర్దేశించిన గడువు లోగా వర్క్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో వెబ్‌ డిజైనర్స్ కు మంచి డిమాండ్ ఉంది. ఇంట్లో కంప్యూటర్స్ ఉంటే చాలు నెలకు రెండు మూడు ప్రాజెక్ట్ లు చేసి 25 నుంచి 30 వేల వరకూ సంపాదించే వీలుంది. బాగా పనిచేస్తారని పేరు సంపాదిస్తే ఆదాయం మరింత పెరుగుతుంది.

 

సోషల్ మీడియా కన్సల్టెంట్ 

ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది.  యువత అంతా తమ అభిప్రాయాలను, భావాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎక్కువ సమయంలో అందులోనే గడుపుతున్నారు. దీంతో కంపెనీలు తమ ప్రచార వ్యూహాలను మార్చుకున్నాయి. సోషల్ మీడియాను తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి. తమ కంపెనీని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే పనిని సోషల్ మీడియా కన్సల్టెంట్స్ కు అప్పగిస్తున్నాయి.  సోషల్ మీడియా కన్సల్టెంట్స్ తాము తీసుకున్న పనిని తమకు వెసులుబాటు ఉన్న సమయంలో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసినందుకు వీరికి నెలకు 15 నుంచి 20 వేల రూపాయల వరకూ అందుతున్నాయి. ఇంగ్లీష్ పై కాస్త పట్టు ఉండి, చేతిలో మంచి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలా సోషల్ మీడియా కన్సల్టెంట్ అయిపోవచ్చు.

పర్సనల్ ట్రైనర్ 

ప్రస్తుతం నైపుణ్యం లేని వ్యక్తికి జాబ్ మార్కెట్ లో విలువ లేదు. అడకమిక్ అర్హతలు ఎన్ని ఉన్నా కమ్యూనికేషన్, లీడర్ షిఫ్ వంటి లక్షణాలు లేకపోతే కంపెనీలు జాబ్ ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా తర్వాత నిర్దాక్షిణ్యంగా తొలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఉద్యోగికి, ఉద్యోగార్ధికి భావవ్యక్తీకరణ, నాయకత్వం లక్షణాలను పెంపోదించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో ఈ రెండు విషయాలను నేర్పించే పర్సనల్ ట్రైనర్స్ కు ఆదరణ పెరిగింది. ఉద్యోగికి వెసులుబాటు ఉన్న సమయంలో వీరు అతని దగ్గరికి వెళ్లి ఈ విషయాల్లో అతన్ని ట్రైనప్ చేస్తారు. ముఖ‌్యంగా ఉదయం సాయింత్రం వేళ్లలో మాత్రమే వీరికి పని ఉంటుంది. మంచి భోధనా నైపుణ్యం ఉంటే పర్సనల్ ట్రైనర్స్ నెలకు 25 నుంచి 30 వేలు సంపాదించవచ్చు.

రియల్ ఎస్టేట్ ఏజెంట్ 

ప్రస్తుతం రియల్ ఎస్టేట్ అనేది పెట్టుబడి సాధనాల్లో ఒకటిగా మారిపోయింది. భూమికి ఉన్న విలువను గుర్తించి చాలా మంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇలా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారికి ఎక్కడ , ఎలా, ఎంత అన్న విషయాలపై అవగాహన ఉండదు. ఇటువంటి గైడ్ చేసి వారికి అనుకూలమైన స్థలాన్ని, వారి పెట్టుబడి మెత్తం ఆధారంగా చూపించేందుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అవసరం ఏర్పడింది. ఈ కెరీర్ లో చేయవలసింది చాలా చిన్న పని. ఇన్వెస్టర్ తో భూమి యజమానితో మాట్లాడి ఇద్దరికి సంధానకర్తగా వ్యవహరించి అనుకున్న సమయానికి భూమికి చూపిస్తే సరిపోతుంది. ఎటువంటి వివాదాలు లేని భూమిని ఇన్వెస్టర్లకు చూపిస్తే రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వెలిగిపోవచ్చు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కెరీర్ కు ఢోకా ఉండకపోవచ్చు.

ట్యాక్స్ కన్సల్టెంట్ 

 

ప్రస్తుతం ఉద్యోగుల్లో చాలా మందికి పన్నులకు సంబంధించిన విషయాలపై అంతగా అవగాహన ఉండదు. ఎంత ఆదాయం వస్తే ఎంత పన్ను చెల్లించాలి? పన్నుల భారం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ పద్ధతులను అనుసరిస్తే పన్ను భారం అనిపించదు? వంటి విషయాలను తెలియజెప్పేందుకు నిపుణుల అవసరం పడింది. అలాంటి అవసరం లోంచి పుట్టుకొచ్చిందే ట్యాక్స్ కన్సల్టెంట్ కెరీర్. ప్రస్తుతం చాలా మంది వ్యక్తులు, సంస్థలు తమ పన్ను సంబంధిత వ్యవహారాలను ఔట్ సోర్సింగ్ చేస్తున్నాయి. సమయం లేకపోవడం వలన వీరు ఆ బాధ్యతలను ట్యాక్స్ కన్సల్టెంట్ కు అప్పగిస్తారు. వీరు ఉద్యోగికి అనుకూలమైన సమయంలో వాళ్లను కలిసి వివరాలు సేకరించి ఏ విధంగా చేయాలి? ఎలా చేయాలి? అన్న విషయాలపై ఒక ప్రణాళిక తయారు చేస్తారు. వారికి తగిన గైడెన్స్ ఇస్తారు. ట్యాక్స్ కన్సల్టెంట్ గా పేరు సాధిస్తే నెలకు 30 నుంచి 40 వేల వరకూ ఆదాయం సంపాదించేందుకు అవకాశం ఉంది.