ఈ ‘కెరీర్’ తో కంపెనీకి, మీడియాకు మధ్య వారధి మీరే కావచ్చు!!

     

 టెక్నాల‌జీ యుగంలో వ్యాపారం బాగా అభివృద్ధి సాధించాలంటే మంచి నాణ్య‌మైన ఉత్ప‌త్తిని త‌యారు చేస్తే స‌రిపోదు.  ఉత్ప‌త్తికి విస్తృత‌మైన ప్రచారం క‌ల్పించిన‌ప్పుడే అది మార్కెట్లో మ‌న‌గ‌లుగుతుంది. పబ్లిసిటీ అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైన విష‌యంగా మారింది. ఉత్ప‌త్తిని త‌మ ఉద్దేశాన్ని వినియోగ‌దారుల్లోకి ఎంత బ‌లంగా తీసుకెళ్లార‌న్న‌దానిపైనే కంపెనీ విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎంత పెద్ద కంపెనీ అయినా  స‌రే ముందుగా ప్ర‌చారానికే అధికంగా డ‌బ్బు ఖ‌ర్చు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో కంపెనీకి అడ్వ‌ర్ట‌యిజింగ్ ఏజెన్సీకి మ‌ధ్య వార‌ధిలా ప‌నిచేసే ఒక వ్య‌వ‌స్థ అవ‌స‌రమైంది. ఆ అవ‌స‌రం లోనుంచి పుట్టిందే మీడియా ప్లాన‌ర్. కంపెనీ ఏం ఆశిస్తుందో ఏజెన్సీకి  స్ప‌ష్టంగా చెప్పి వారి నుంచి స‌రైన ప్ర‌చారాన్ని కల్పిండ‌టంతో పాటు ఫ‌లానా ఉత్ప‌త్తికి సంబంధించిన వినియోగ‌దారులు ఎక్క‌డ ఉన్నారు? ఏం చేస్తే వాళ్లు ఆ ఉత్ప‌త్తిని కొనుగోలు చేస్తారు? అన్నవ్యూహాల‌ను మీడియా ప్లాన‌ర్లు సిద్ధం చేస్తారు. వ‌స్తూత్ప‌త్తి రంగం దూసుకుపోతున్న ప్ర‌స్తుత త‌రుణంలో హాట్ కెరీర్ గా మారిన మీడియా ప్లాన‌ర్ పై ‘కెరీర్ టైమ్స్’ స్పెష‌ల్ ఫోక‌స్.

టార్గెట్ క‌స్ట‌మ‌ర్ల‌ను గుర్తించ‌డ‌మే విజ‌య ర‌హ‌స్యం! 

ఇప్పుడు ఎంత కంపెనీకైనా త‌మ ఉత్ప‌త్తులు అమ్ముడుపోవాల‌న్నా, లాభాలు సాధించాల‌న్నా ప్ర‌చార‌మే దిక్కు. అయితే త‌మ టార్గెట్ క‌స్ట‌మ‌ర్లు ఎక్క‌డ ఉన్నారు?  వారి అవ‌స‌రాలేంటి అన్న ప్రాతిప‌దిక‌న ప్ర‌చారం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్ర‌చారం చేసే మాధ్య‌మాల‌ను స‌రైన విధంగా వాడుకుంటూ ఉత్ప‌త్తిని ప్ర‌మోట్ చేసుకోవ‌డంలోనే విజ‌యం దాగుంది. త‌మ ప‌రిశోధ‌న ద్వారా ఆ విజ‌యాన్నిఎలా ఒడిసిప‌ట్టుకోవాలో తెలియ‌జేసేది మీడియా ప్లాన‌ర్లు. అడ్వ‌ర్టైజింగ్ ఏజెన్సీకి వెన్నుముక‌గా ప‌నిచేస్తూ కంపెనీ ఆశించిన ఫ‌లితాలు సాధిస్తే మీడియా ప్లానర్ కెరీర్ కు తిరుగులేదు. ప్ర‌స్తుతం చాలా కంపెనీలు మీడియా ప్లాన‌ర్లను ప్ర‌త్యేకంగా నియ‌మించుకుంటున్నాయి. కంపెనీ యొక్క మీడియా విష‌యాల‌ను చ‌క్క‌బెట్ట‌డంతో పాటు ప్ర‌చారాన్ని మ‌రింత విస్తృతంగా చేప‌ట్టేందుకు వీరి అవ‌సరం చాలా ఉంది. క‌ష్ట‌ప‌డే త‌త్వం, ఏ విష‌య‌మైనా నేర్చుకునేందుకు సిద్ధ‌ప‌డే గుణం ఉండాలే కానీ మీడియా ప్లాన‌ర్ గా కెరీర్ లో మంచి ఉన్న‌తిని సాధించ‌వ‌చ్చు.


ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది!

గ‌తంలో ప్ర‌చారం అంటే కేవ‌లం హోర్డింగ్ లు, న్యూస్ పేప‌ర్లు, టీవీలు, రేడియోలు మాత్ర‌మే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఈ నాలుగు మాధ్య‌మాల‌తో పాటు ఇప్పుడు సోష‌ల్ మీడియా కూడా విస్త‌రించింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వ‌చ్చాక కంపెనీలు ఫోన్ లోనే త‌మ ఉత్త‌త్తుల‌ను ప్ర‌చారం చేసుకోవాల్సి వ‌స్తోంది. ఫేస్ బుక్, ట్విట్ట‌ర్, లింక్డ్ ఇన్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్య‌మాలతో పాటు వెబ్ మీడియా కూడా ప్ర‌చారానికి అనువైన వేదిక‌గా ఉంది. ఈ ట్రెండ్ ను గుర్తిస్తూ ప్ర‌చారాన్ని కొత్త పుంత‌లు తొక్కించ‌గ‌లిగితే మీడియా ప్లానర్ల‌కు తిరుగుండ‌దు. ముఖ్యంగా సృజ‌నాత్మ‌క‌త అనేది మీడియా ప్లాన‌ర్ల‌కు చాలా ముఖ్య‌మైన విష‌యం. ఎందుకంటే త‌మ కొత్త త‌ర‌హా ఆలోచ‌నల ద్వారా వినియోగ‌దారుల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌గాలి. అలాగే కంపెనీ చేప‌ట్టే కొత్త ప‌నులు, కార్య‌క్ర‌మాలను ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాకు చేర‌వేస్తూ కంపెనీని ప్ర‌మోట్ చేయాలి. అదే స‌మ‌యంలో విభిన్న మాధ్యమాల ద్వారా కంపెనీ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌గ‌ల‌గాలి.  ఒత్తిడిని త‌ట్టుకోగ‌లిగే నేర్పు సాధించి, మీడియా సంస్థ‌ల‌తో మంచి సంబంధాల‌ను క‌లిగి ఉన్న‌ప్పుడు మీడియా ప్లాన‌ర్ కెరీర్ వెలిగిపోతుంది.

మీడియా ప్లాన‌ర్ గా మారాలంటే..? 

స‌మ‌కాలీన విష‌యాల‌పై ప‌ట్టు, ప్ర‌తీ రోజూ నేర్చుకోవాల‌నే త‌ప‌న ఉన్న‌వాళ్లు మీడియా ప్లాన‌ర్ గా రాణించవ‌చ్చు. ముఖ్యంగా ఎంబీయే అడ్మినిస్ట్రేష‌న్, పీజీలో మాస్ క‌మ్యూనికేష‌న్ చేసిన వాళ్లు మీడియా ప్లాన‌ర్ కెరీర్ ను ఎంచుకోవ‌చ్చు. మీడియా రంగంలో కొన్ని రోజులు ప‌నిచేసిన అనుభ‌వం ఉంటే అది కెరీర్ కు ప్ల‌స్ అవుతుంది. అలాగే అడ్వ‌ర్టైజింగ్, మీడియా  ప్లానింగ్ స్పెష‌లైజేష‌న్లు చేసిన వాళ్లు కూడా ఈ రంగాన్ని ఎంచుకుంటే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో కాస్త ఇబ్బంది అనిపించినా ఓపిక‌తో కాస్త నిల‌దొక్కుకుంటే ఉన్న‌త స్థానానికి చేరుకోవ‌చ్చు. మంచి ప‌నితీరు క‌న‌బ‌రిస్తే మీడియా ప్లాన‌ర్ గా ప‌దేళ్ల అనుభ‌వం ఉన్న‌వాళ్లు ఏడాదికి 10 ల‌క్ష‌ల రూపాయ‌ల ప్యాకేజీని అందుకుంటున్నారు. ప్రారంభంలో కొన్ని కంపెనీలు మీడియా ప్లాన‌ర్ల‌కు ఏడాది 2 ల‌క్ష‌ల ప్యాకేజీ ఇస్తున్నా అనుభ‌వం పెరిగితే ప్యాకేజీని కూడా బాగానే పెంచుతాయి.

కాస్త శ్ర‌మ ప‌డితే భ‌విష్య‌త్ బంగార‌మే! 

మీడియా ప్లానర్ల‌కు కాస్త ఓపిక ఎక్కువ ఉండాలి. విభిన్న వ్య‌క్తుల‌తో సంబంధాల‌ను నెరుపుతూ కంపెనీని, ఉత్ప‌త్తిని ప్ర‌మోట్ చేసేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మించాలి. ముఖ్యంగా ప్ర‌జంట్ వినియోగ‌దాలు ఏం కోరుకుంటున్నారో, ఏ మాధ్య‌మం ద్వారా వారిని చేర‌గ‌లుగుతామో ప‌సిగ‌ట్టి దానికి అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు మార్చుకుంటూ ఉండాలి. ఏజెన్సీల‌తో త‌న‌కు కావాల్సింది స్ప‌ష్టంగా చెప్పి కంపెనీ ఉద్దేశాన్ని, ఉత్ప‌త్తిని ప్ర‌భావ‌వంతంగా వినియోగ‌దారుని చెంత‌కు తీసుకెళ్లగ‌ల‌గాలి. ఇటువంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌వాళ్లు మీడియా ప్లాన‌ర్ కెరీర్ ను ఎంచుకోవ‌చ్చు. రానున్న రోజుల్లో ఈ రంగం మ‌రింత‌గా విస్త‌రిస్తుంది కాబ‌ట్టి కెరీర్ కు ఢోకా అన్న మాటే లేదు.