సెల‌వు తీసుకో..పండ‌గ చేసుకో..కంపెనీల కొత్త మంత్రం!!

 

మారుతున్న ప‌రిస్థితుల ఆధారంగా మానవ వన‌రుల విభాగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తున్నాయి. సామ‌ర్ధ్యం ఉన్న ఉద్యోగుల‌ను కాపాడుకునేందుకు కంపెనీలు కొత్త త‌ర‌హా విధానాలను పాటిస్తున్నాయి. జీతం, ప్రోత్సాహ‌కాల విష‌యంలోనే కాదు ఉద్యోగులు క‌ంపెనీ ఉన్న‌తికి ఉప‌యోగ‌ప‌డే వ్య‌క్తులైతే చాలు వాళ్ల‌ను వదులుకునేందుకు చాలా కంపెనీలు సుముఖంగా లేవు. ఉద్యోగుల మ‌న‌సెరిగి వాళ్ల‌కు సుదీర్ఘ సెలవులు ఇచ్చేందుకు కంపెనీలు త‌మ హెచ్ఆర్ పాల‌సీల్లో మార్పులు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చాలా సంవ‌త్స‌రాలు పాటు ప‌నిచేసి మానసికంగా అలిసిపోయి కొన్ని నెల‌ల పాటు విరామం తీసుకుందామ‌నుకుంటున్న వారికి ఈ విధానం చాలా వెసులుబాటుగా ఉంటోంది. సుధీర్ఘ సెల‌వుతో మాన‌సికంగా రీఛార్జ్ అవుదామని భావిస్తున్న వారిని కంపెనీలు అమ‌లు చేస్తున్న ఈ నూత‌న విధానం విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. కొత్త ఆలోచ‌న‌ల‌కు, స్టార్ట‌ప్ ల‌కు బీజాలు వేసుకునేందుకు, కుటుంబంతో విహార యాత్ర‌లు చేద్దామ‌నుకుంటున్న వారికి ఇదో సువ‌ర్ణావ‌కాశంగా మారుతోంది. అలాగే కొన్నాళ్లు త‌మ మ‌న‌సుకు న‌చ్చిన ప‌ని చేయాల‌ని భావిస్తున్న వారికి కూడా ఈ విధానం కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది.

 

 

హెచ్ఆర్ పాల‌సీల్లో కీలక మార్పులు!

 

ప్ర‌స్తుతం ప్ర‌పంచవ్యాప్తంగా చాలా కంపెనీలు మాన‌వ వ‌నరుల పైనే అధికంగా ఖ‌ర్చు చేస్తున్నాయి. ఒక ఉద్యోగి శిక్ష‌ణ‌, అభివృద్ధిపై కంపెనీలు చేసిన ఖ‌ర్చు తిరిగి వ‌చ్చేందుకు కొంత కాలం ప‌డుతుంది. అయితే కొంద‌రు ఉద్యోగులు మాత్రం కంపెనీకి సుధీర్ఘ‌కాలం సేవ‌లు అందిస్తూ సంస్థ ఉన్న‌తికి దోహ‌దం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇటువంటి వారినే కాపాడుకునేందుకు హెచ్ఆర్ నిపుణులు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇలా బాగా ప‌నిచేసే ఉద్యోగుల‌కు ఒక కొత్త అవ‌కాశాన్ని ఇస్తున్నారు. సొంతంగా ఎదిగేందుకు అవ‌స‌ర‌మైన వ్యూహాల‌ను రెడీ చేసుకునేందుకు, అలాగే కొత్త ప్ర‌దేశాలు చూసేందుకు,లేక త‌న వ్య‌క్తిగ‌త అభిరుచుల‌ను నెర‌వేర్చుకునేందుకు ఏ ఉద్యోగి అయినా సుధీర్ఘ‌కాలం సెల‌వు కావాల‌ని అడిగితే అనుమ‌తి ఇచ్చేందుకు చాలా కంపెనీలు రెడీగా ఉన్నాయి. ఎందుకంటే అటువంటి ఉద్యోగులు ఇప్ప‌టికే త‌మ కంపెనీకి విశేష‌మైన సేవ‌లు అందించారు క‌నుక మ‌ళ్లీ తిరిగి వ‌చ్చినా అటువంటి వాళ్ల వ‌ల‌న త‌మ‌కు చాలా ప్ర‌యోజ‌నం ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి.

 

 

 

సుధీర్ఘ సెల‌వుల విధివిధానాలేంటి?

 

ఉద్యోగుల‌కు సుధీర్ఘ సెల‌వులు ఇచ్చేందుకు కంపెనీలు కొన్ని విధివిధానాల‌ను అనుస‌రిస్తున్నాయి. ముఖ్యంగా బాగా ప‌నిచేస్తూ కంపెనీకి సుధీర్ఘ కాలం సేవ‌లు అందించిన వారితో పాటు త‌క్కువ కాలం ప‌నిచేసిన‌ప్ప‌టికీ ప్ర‌భావ‌వంత‌మైన ప‌నితీరు క‌న‌బ‌ర్చిన వారికి ఈ ఆఫ‌ర్ ను ఇస్తున్నాయి. ముఖ్యంగా వారి వ‌ల‌న కంపెనీకి ఎన‌లేని ప్ర‌యోజ‌నం క‌లిగింద‌ని, భ‌విష్య‌త్ లో కూడా క‌లుగుతుంద‌ని భావిస్తే అటువంటి ఉద్యోగికి ఈ సుధీర్ఘ సెల‌వు అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నాయి. అయితే ఈ ప్ర‌యోజ‌నంలో కొన్ని కంపెనీలు ఆ సెల‌వు కాలానికి జీతం ఇవ్వకుండా ఆరోగ్య బీమా, మ‌రికొన్ని ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను కొన‌సాగిస్తుంటే కొన్ని కంపెనీలు ఆర్థిక ప్ర‌యోజ‌నాలతో కాస్త జీతం కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ప్ర‌స్తుతం తీవ్రమైన ఒత్తిడి వాతావ‌ర‌ణంలో ప‌నిచేస్తున్న చాలా మంది ఉద్యోగులు కొన్నాళ్ల పాటు విరామం తీసుకుని ఎటువంటి టెన్ష‌న్ లేకుండా మ‌న‌సుకు న‌చ్చిన ప‌నిచేయాల‌ని భావిస్తున్నారు. అలాగే మ‌రికొంత మందికి సొంతంగా ఒక స్టార్ట‌ప్ పెట్టాల‌న్న ఆలోచ‌న ఉన్నా న‌ష్టం వ‌స్తే ఏంటి ప‌రిస్థితి అన్న భ‌యాలు వెంటాడుతూ ఉంటాయి. వీరు సుధీర్ఘ సెల‌వు అవ‌కాశాన్ని వినియోగించుకుని త‌మ స్టార్ట‌ప్ ప్ర‌య‌త్నం చేసి అది బెడిసికొట్టినా త‌న ఉద్యోగం త‌న‌కోసం సిద్ధంగా ఉంటుంది. మొత్తానికి ఈ సుధీర్ఘ సెల‌వు ప్ర‌యోజ‌నం ఉద్యోగుల‌కు మంచి వెసులుబాటు.

 

 

ప్ర‌తికూల‌త‌లూ ఉన్నాయి!

 

కంపెనీలు ఉద్యోగులకు క‌ల్పిస్తున్న ఈ సుధీర్ఘ సెల‌వు ప్ర‌యోజ‌నంపై కొందరు సానుకూలంగా ఉన్నా కొంద‌రు హెచ్ఆర్ నిపుణులు మాత్రం దీనిపై పెద‌వి విరుస్తున్నారు. ఈ విధానం సంస్థ‌లో ఊహించ‌లేని, అస్థిర ప‌రిస్థితికి కార‌ణ‌మ‌వుతుందని వారు వివ‌రిస్తున్నారు. ఇందులో మొద‌టి ప్ర‌తికూల‌త‌న‌కు తీసుకుంటే ఒక ఉద్యోగి సంస్థ నుంచి సుధీర్ఘ సెల‌వులో వెళ్లిపోతే అత‌ని స్థానాన్ని అప్ప‌టిక‌ప్పుడు భ‌ర్తీ చేయ‌డం చాలా క‌ష్టం. అది సంస్థ ప‌నితీరును దెబ్బ‌తీస్తుంది. ఇక రెండోది అవ‌త‌లి వైపు ప్ర‌భుత్వ సంస్థ‌ల వంటి కీల‌క క్ల‌యింట్ ఉన్న‌ప్పుడు ఒక ఉద్యోగి వ‌దిలి వెళ్లిన స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డం కంపెనీల‌కు స‌వాలు. ఎందుకంటే ఏ చిన్న పొర‌పాటు జ‌రిగినా కంపెనీ కున్న మొత్తం ప్ర‌తిష్ఠ మంట‌గ‌లిసిపోతుంది. అలాగే కొంద‌రు ఉద్యోగులు సుధీర్ఘ సెల‌వు ప్ర‌యోజనాన్ని త‌ప్పుడు మార్గంలో దుర్వినియోగం చేసే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. సుధీర్ఘ సెల‌వు ప్ర‌యోజ‌నాన్ని వినియోగించుకుంటూ అదే స‌మ‌యంలో వేరే కంపెనీలో అదే ప్లాట్ ఫామ్ పై ప‌నిచేసే ఉద్యోగులు కూడా ఉండొచ్చు. దీని వ‌ల‌న కంపెనీలు న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది.

 

 

ఈ ప‌ద్ధ‌తి ఇంకా ఊపందుకోలేదు!

 

సోసైటీ ఆఫ్ హ్యూమ‌న్ రిసోర్స్ మేనేజ్ మెంట్ వారి నివేదిక‌ల ప్ర‌కారం సుధీర్ఘ సెల‌వు ప‌ద్ధ‌తి ఇంకా పూర్తి స్థాయిలో ఊపందుకోలేదు. అమెరికా, బ్రిట‌న్ ల‌లో కేవ‌లం 17 శాతం కంపెనీలు మాత్ర‌మే ఈ విధానాన్ని అమ‌లు చేస్తున్నాయి. అమ‌లులో ఉన్న అడ్డంకులు, న‌ష్టాలు కంపెనీల‌ను ఈ దిశ‌గా ఆలోచించనివ్వ‌డం లేదు. మ‌న దేశంలో కూడా ఈ సుధీర్ఘ సెల‌వు ప‌ద్ధ‌తిని కొన్ని కంపెనీలు మాత్ర‌మే అమ‌లు చేస్తున్నాయి. కానీ ఈ ప‌ద్ధ‌తి పూర్తి స్థాయిలో అమ‌ల్లోకి వ‌స్తే అది హెచ్ఆర్ విభాగంలో అదో కీల‌క మ‌లుపు అవుతుంది. ఉద్యోగులు సంక్షేమానికి పెద్ద పీట వేసేందుకు, క‌ష్టాన్ని గుర్తించేందుకు తగిన వేదిక ఏర్పాట‌వుతుంది. అయితే దీనికి ప్రారంభంలో ఉన్న బాలారిష్టాల‌ను దాటాల్సి ఉంది. ఏది ఏమైనా హెచ్ఆర్ లో సుధీర్ఘ సెల‌వు ప‌ద్ధతి ఒక విప్ల‌వాత్మ‌క మార్పు అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)