ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్..దేన్ని ఎలా వాడుకోవాలో మీకు తెలుసా??

 

ప్రస్తుతం విద్యార్ధులు ఫేస్‌బుక్ పై అధిక సయమం వెచ్చిస్తున్నారు. ఫోటోలు షేర్ చేయడానికి, ఫ్రెండ్స్ తో చాట్ చేయడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి, ఇష్టమైన విషయాలను షేర్ చేయడానికి ఫేస్‌బుక్ ను వేదికగా ఉపయోగించుకుంటున్నారు. ఒక సర్వే ప్రకారం రోజులో మన దేశంలో విద్యార్ధులు దాదాపు 5 నుంచి 6 గంటలు ఫేస్‌బుక్ లోనే గడుపుతున్నారని తేలింది. ఈ పోటీ ప్రపంచంలో నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగించుకోవాల్సిన ఆ విలువైన సమయాన్ని ఫేస్‌బుక్ చూస్తూ వృధా చేయడం ఆందోళన రేపుతోంది. ఏ మాధ్యమాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి? ఎంత సమయం కేటాయించాలన్న దానిపై సరైన అవగాహన లేకపోవడం ఇప్పుడు సమస్యకు మూలకారణంగా కనిపిస్తోంది. ఫేస్‌బుక్ లో తమ ప్రొఫైల్ కు సంబంధించి ఒక పేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి పరిమితం కావాల్సింది పోయి చాటింగ్ లకు వీడియోలు చూస్తూ విద్యార్ధులు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. సోషల్ మీడియాను ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఏయే నైపుణ్యాలను పెంచుకోవాలో అన్న దానిపై సరైన అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం.

 

 

నైపుణ్యాలు అనే మాటనే మర్చిపోతున్నారు!

 

తాజాగా వీబాక్స్ ఇండియా అనే సంస్థ ఇండియా స్కిల్ రిపోర్ట్ 2018 పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు ఐదువేల విద్యాసంస్థలు, ఏఐసీటీసీ వంటి వివిధ విద్యా సంబంధిత సంస్థల సహకారంతో ఈ నివేదిక విడుదలైంది. అయితే ఉద్యోగానికి నైపుణ్యాలే కీలకమైన ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది విద్యార్ధులకు సరైన నైపుణ్యాలే లేవని ఆ నివేదిక స్పష్టం చేసింది. అసలు ఇంటర్న్‌షిప్స్ చేసేందుకు నెట్‌వర్కింగ్ ను పెంచుకునేందుకు విద్యార్ధులు సిద్ధంగా లేరు. మరోవైపు రెజ్యుమె తో పాటు ఆన్‌లైన్ లో చురుగ్గా ఉండడం కూడా ముఖ‌్యమే. అయితే విద్యార్ధులు ఆన్‌లైన్ లో చురుగ్గా ఉంటున్నారు కానీ అది పోసుకోలు కబుర్లు చెప్పుకునేందుకు యూట్యూబ్ సినిమాలు, వీడియోలు చూసేందుకు మాత్రమే విద్యార్ధులు ప్రాధాన్యతనిస్తున్నారు. జాబ్ మార్కెట్ ఆన్‌లైన్ మోడ్ లోకి మారిపోయిన నేపథ్యంలో ఆన్‌లైన్ లో ఎంత యాక్టివ్ గా ఉంటే అంత ఉపయోగం. అయితే విద్యార్ధులు ఆన్‌లైన్ వేదికలను ఉపయోగించుకోవడం విఫలమవుతున్నట్టు తెలుస్తోంది.

 

 

నైపుణ్యాల సాధనలో ఇవే కీలకం!

 

ఒక విద్యార్ధికి థియరీ నాలెడ్జ్ అనేది ఎంత ముఖ్యమో ప్రాక్టికల్ గా సబ్జెక్ట్ పట్టు కూడా అంతే ముఖ‌్యం. కానీ చాలా మంది విద్యార్ధులు ఇదే కరవవుతోంది. అసలు ఇంటర్న్‌షిప్స్ చేస్తే విద్యార్ధులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే చాలా మంది విద్యార్ధులు మాత్రం ఇంటర్న్‌షిప్ అంటే చాలా ముఖం తిప్పుకుంటున్నారు. ఇక ఇంటర్న్‌షిప్ ను ఎంచుకుంటున్న కొద్ది మంది కూడా దాన్ని ఉద్యోగ సాధనకు ఉపయోగించుకోవడంలో విఫలం అవుతున్నారు. ఇక నెట్‌వర్కింగ్ లో చాలా మంది విద్యార్ధులు వెనుకబడి ఉన్నారు. అసలు నెట్‌వర్క్ లేకుండా కెరీర్ లో ఉన్నత స్థానానికి వెళ్లడం అసంభవం. ఈ విషయాన్ని విద్యార్ధులు అసలు గుర్తించడం లేదు. వివిధ సందర్భాల్లో , వేదికల్లో ఏర్పడిన పరిచయాలను సుధీర్ఘ కాలం పాటు కొనసాగించాలి. ఉద్యోగ సాధనలో నెట్‌వర్కింగే కీలకం. అయితే పరిచయాలను కొనసాగించడంలో 85 శాతం మంది విఫలమవుతున్నట్టు సర్వేలు చెపుతున్నారు. ఇక రెజ్యుమెను సరైన రీతిలో తయారు చేసుకోవడం కూడా చాలా మంది విద్యార్దులుకు తెలియడం లేదు. అసలు రెజ్యుమె తయారీలో కీవర్డ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఉద్యోగ ప్రకటనకు అనుగుణంగా రెజ్యుమెను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హలతో పాటు నాయకత్వ ప్రతిభను ప్రతిబింబించే ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ ను కూడా అందులో ప్రస్తావించాలి.

 

 

దేన్ని ఎంతవరకు ఎలా వాడాలో తెలియాలి!

 

మన దేశంలో ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ బాగా విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ డిజిటల్ విప్లవాన్ని అందుకుని విద్యార్ధులు ఉద్యోగ సాధనలో దూసుకుపోవాలి. కానీ వాస్తవానికి అలా జరగడం లేదు. విద్యార్ధులు ఆన్‌లైన్‌లో చురుగ్గా ఉంటున్నారు. కానీ ఆన్‌లైన్ ను ఉద్యోగాన్ని సాధించేందుకు కాకుండా వీడియోలు చూసేందుకు సోషల్ మీడియాలో టైం పాస్ కబుర్లు చెప్పుకునేందుకు ఉపయోగిస్తున్నారు.మన విద్యార్ధుల్లో 92 శాతం మంది ఫేస్‌బుక్ , 62 శాతం మంది యూట్యూబ్ లలో అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. అదే సమయంలో జాబ్ ను తెచ్చిపెట్టే ప్రొఫెషనల్ ఆన్‌లైన్ సోర్స్ లింక్డ్ ఇన్ ను కేవలం 26 శాతం మంది మాత్రమే చూస్తున్నారు. అందులో సరైన ప్రోఫైల్ ను పెట్టేందుకు కూడా చాలా మంది విద్యార్ధులకు తీరిక ఉండటం లేదు. అసలు దేనికి ప్రాధాన్యతనివ్వాలి? దేన్ని ఎంత సమయం చూడాలి? దేన్ని ఏ విధంగా వాడుకోవాలి? అన్న దానిపై అధిక శాతం మంది విద్యార్ధులకు అసలు అవగాహనే కొరవడుతోంది.

 

 

వేదికలను వాడుకోవడం తెలియాల్సిందే!

 

ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ట్రెండ్ మారిపోయింది. ఇంటర్వ్యూలు, అభ్యర్ధుల ఎంపిక అనేది గతంలో జరిగిన విధంగా లేదు. ఇప్పుడు కంపెనీలు ఆన్‌లైన్ ప్రొఫెల్స్ ద్వారా తమకు కావాల్సిన అభ్యర్ధులను సెలెక్ట్ చేసుకుంటున్నాయి. అందుకే విద్యార్ధులు అర్హతలు, నైపుణ్యాలు ఆన్‌లైన్ రిక్రూటర్స్ కు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు రిక్రూటర్స్ అభ్యర్ధి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆన్‌లైన్ , సోషల్ మీడియాలో వాళ్ల గుర్తింపును పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫేస్‌బుక్ పేజ్ లో ఇతర సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ చేస్తూ యాక్టివ్ గా ఉండాలి. అలా అని వాటిలో సమయాన్ని వృధా చేసుకోకుండా లింక్‌ఇన్ వంటి మాధ్యమాల్లో ప్రోఫైల్ ను అప్‌డేట్ గా ఉంచుకోవాలి. ఆన్‌లైన్ ను సమర్ధవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన అభ్యర్ధులు ప్రస్తుత మార్కెట్లో జాబ్ దొరకడం పెద్ద కష్టమేమీ కాదు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు సమర్పించినవారు)