‘ఎక్స్‌ట్రా’ లు చేస్తున్నారా? అయితే మీకు జాబ్ వచ్చినట్టే..!!

 

ప్రస్తుతం హెచ్ఆర్ నిపుణులు చెప్పే మాట ఒకటే. జాబ్ మార్కెట్లో ట్రెండ్ మారిపోయింది. కంపెనీల ఆలోచనా తీరులో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్ ను ఉద్యోగంలోకి తీసుకోవడంలో కంపెనీలు గతంలోలా వ్యవహరించడం లేదు. విభిన్న విషయాలను, అంశాలను బేరీజు వేసుకుని దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధులను ఎంపిక చేసుకుంటున్నాయి. ప్రజంట్ ఇంటర్వ్యూలలో కేవలం అకడమిక్ రికార్డును మార్కులను చూసి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మార్కులు కాస్త తక్కువ ఉన్నా అభ్యర్ధిలో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలు కావాల్సింది ఆల్‌రౌండర్లు. పనిచేస్తూనే అన్ని విషయాలను సమన్వయం చేసుకుంటూ అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తూ మెసిలే సిసలైన నాయకులు కావాలి. కాబట్టి ఇప్పుడు బాగా మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం వచ్చేస్తుంది అన్న ఆలోచనను విద్యార్ధులు తొలిగించుకోవాలి. చదువుతో పాటు ఆటల్లో, ఈవెంట్ మేనేజ్‌మెంట్ లలో చురుగ్గా ఉండాలి.

 

 

కంపెనీలు ఎందుకు ఈ ఎక్స్‌ట్రా లను కోరుకుంటున్నాయి?

 

మన దేశంలో చదువు అంటే కేవలం మార్కులే కానీ విదేశాల్లో అయితే చదువుకు ఎంత ప్రాధాన్యతనిస్తారో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కు కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే వాస్తవానికి అవే విద్యార్ధి దశలో చాలా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఒక విద్యార్ధిలోని నిజమైన నాయకుడ్ని, సమస్యలను పరిష్కరించే వ్యక్తిని ఆవిష్కరించేవి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివీటీస్ మాత్రమే. అందుకే కంపెనీలు ఈ లక్షణాలు ఉన్న అభ్యర్ధుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే సంస్థలో విధులు నిర్వర్తించే క్రమంలో ఏమైనా సమస్యలు ఎదురైతే అభ్యర్ధులు చాలా వేగంగా స్పందిస్తారని కంపెనీలు నమ్ముతున్నాయి. అందుకే రెజ్యుమెలో కాలేజీలో ఈవెంట్లు నిర్వహణ, ఇతర అదనపు అర్హతలు వంటి వాటికి పెద్దపీట వేస్తున్నాయి. కంపెనీల ఆలోచనా విధానంలో వచ్చిన ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని విద్యార్ధులు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పై శ్రద్ధ పెట్టాలని హెచ్ఆర్ నిపుణులు సూచిస్తున్నారు.

 

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్నో..!

 

ప్రస్తుతం ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివీటీస్ పై కళాశాలల్లో కాస్త అవగాహన పెరిగింది. ఇప్పుడు కావాల్సిందల్లా విద్యార్ధులు తగిన చొరవ తీసుకోవడమే. కళాశాలల్లో ఈవెంట్స్ ను కండక్ట్ చేయడం, అదే విధంగా కల్చరల్ ఫెస్టివల్స్ లో పార్టిసిపేట్ చేయడం, అదే విధంగా ఇన్‌స్టిట్యూట్ లో నిర్వహించే అన్ని రకాల కార్యక్రమాలను నడిపించే ఆర్గనైజింగ్ బాధ్యతలు తీసుకోవడం వంటి వాటి వలన టీమ్ ను ఎలా నడపాలో, గడువు లోగా పనులు ఎలా నిర్వహించాలో తెలుస్తుంది. ప్రస్తుతం చాలా ఇన్‌స్టిట్యూట్ లో కల్చరల్ సొసైటీ కాన్సెప్ట్ నడుస్తోంది. అకడమిక్స్ లో విద్యార్ధులు పడే ఒత్తిడిని తగ్గించేందుకు ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్ధులు ఉపయోగించుకోవాలి. అలాగే ప్రతిష్టాత్మక సంస్థలైన సీఐఐ, నాస్కామ్, ఫిక్కీ, అసోచామ్ లలో స్టూడెంట్ మెంబర్‌షిప్ తీసుకుంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఆయా సంస్థలు నిర్వహించే సెమినార్లలో పాల్గొనడం ద్వారా నిపుణులను, ఉన్నత వ్యక్తులను కలుసుకుని వారి నుంచి సలహాలు పొందడంతో పాటు స్పూర్తిని కూడా పొందే వీలుంటుంది. అలాగే వాలంటీర్ సర్వీస్ లు కూడా చేస్తే సమాజంలో ఏం జరుగుతోంది. ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు అన్న దానిపై అవగాహన పెరుగుతుంది. వీటన్నింటిని రెజ్యుమెలో పొందుపర్చుకుంటే అవే ఇప్పుడు ప్రధాన అర్హతలుగా మారుతున్నాయి.

 

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఎన్నో లాభాలు!

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివీటీస్ పై చాలా మంది తల్లిదండ్రులకు కూడా సదభిప్రాయం లేదు. వీటి వలన పిల్లల చదువు పాడవుతుందని చాలా మంది పేరెంట్స్ భావిస్తున్నారు. అయితే ఆ అభిప్రాయం పూర్తి తప్పు. వీటిల్లో పార్టిసిపేట్ చేయడం వలన విభిన్న వ్యక్తులతో కలివిడిగా మాట్లాడటం అలవడి బెరుకు అన్నది పోతుంది. అలాగే నలుగురితో మాట్లాడటం వలన సమస్యను పరిష్కరించే విధానం, మనుష్యులతో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ఓవరాల్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ లో మంచి దిట్టలుగా నిలబడగలుగుతారు. అదే విధంగా ఒక కార్యక్రమంలో ఎంతో మందిని సమన్వయం చేయాల్సి రావడంతో మంచి లీడర్‌షిప్ లక్షణాలు కూడా పెరుగుతాయి. పెద్ద పెద్ద సెమినార్స్ లో షెడ్యూల్స్ ను ఖరారు చేయడం, ప్రతినిధులకు తెలియజేయడం వంటి వాటి వలన సమన్వయ సామర్ధ్యం పెరుగుతుంది. ఇవన్నీ రెజ్యుమెలో ఉంటే కంపెనీలు ఉద్యోగంలోకి తీసుకోకుండా ఉండలేవు.

 

 

విద్యార్ధులకు ఎన్నో ఉపయోగాలు!

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వలన విద్యార్ధులకు వ్యక్తిగతంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. కాలేజీలో వీటిల్లో చురుగా పాల్గొనడం వలన ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఒత్తిడిని ఎదుర్కొనే నేర్పు, భవిష్యత్ పై సానుకూల దృక్ఫధం, సమాజం పట్ల అవగాహన పెరుగుతాయి. ఇక రెజ్యుమెలో ఈ వివరాలను పొందుపర్చడం వలన రిక్రూటర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో చురుగ్గా ఉన్న అభ్యర్ధుల్లో నాయకత్వ లక్షణాలు, సమయస్ఫూర్తి, టీమ్ మేనేజ్‌మెంట్, నిరంతరం నేర్చుకునే లక్షణాలు ఉంటాయని వాళ్లు భావిస్తున్నారు. అందుకే మార్కులు ఎక్కువ వచ్చిన అభ్యర్ధుల కంటే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బాగా చేస్తున్న అభ్యర్ధులనే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించి విద్యార్ధులు తమ భవిష్యత్ ప్రణాళికలను తగిన విధంగా మార్చుకోవాలి. అన్ని విషయాల్లో చురుగ్గా ఉండాలి. అప్పుడే మీ డ్రీమ్ జాబ్ మీ తలుపు తడుతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)