టాలెంట్ ను గుర్తించ‌గ‌ల‌గ‌డ‌మే టాప్ స‌క్సెస్!!

 

 

మాన‌వ వ‌న‌రుల ఎంపికలో స‌రైన నిర్ణ‌యాలే ఇప్పుడు కంపెనీల భ‌విష్య‌త్ ను నిర్ణ‌యిస్తున్నాయి. అందుకే హెచ్ఆర్ విభాగంలో కొత్త త‌ర‌హా విధానాలను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌వేశ‌పెట్టాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతోంది. అందుకు అనుగుణంగానే హెచ్ఆర్ విభాగాన్ని బ‌లోపేతం చేసేందుకు కంపెనీలు అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల ఎంపిక మొద‌లుకుని, ప‌ని వాతావ‌ర‌ణం, సౌక‌ర్యాలు, ఉత్పాద‌కత‌ మొదలైన విష‌యాల్లో ఎన్న‌డూ లేని కొత్త ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తున్నారు. ఒక‌వైపు ఆటోమేష‌న్, మ‌రోవైపు కృత్రిమ మేధను సొంతం చేసుకుంటూనే అదే స‌మ‌యంలో ప్ర‌తిభ క‌లిగిన ఉద్యోగుల‌ను కాపాడుకునేందుకు విభిన్నంగా ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ప్ర‌తిభ క‌లిగిన ఉద్యోగుల‌ను కాపాడుకోవడ‌మే కంపెనీ యొక్క అస‌లైన విజ‌యం. అందుకే కొద్దో గొప్పో బ‌ల‌హీన‌త‌లు ఉన్నా ఉద్యోగుల ప్ర‌తిభ‌కు ప‌ట్టం క‌ట్టేందుకు అధిక శాతం కంపెనీలు రెడీగా ఉన్నాయి.

 

 

ప్ర‌తిభ కలిగిన ఉద్యోగులే కంపెనీకి బ‌లం!

 

రీసెంట్ గా నిర్వ‌హించిన ఓ స‌ర్వేలో ప్ర‌తిభ‌ను ప్రోత్సాహిస్తూ క‌ష్ట‌ప‌డే త‌త్వం ఉన్న ఉద్యోగుల‌ను కాపాడుకున్న కంపెనీలు తమ పోటీ సంస్థ కంటే 15 శాతం ఎక్కువ ఉత్పాద‌క‌త‌ను సాధించాయ‌ని తేలింది. లాభాల‌ను సాధించాల‌న్నా, విలువ‌ను పెంచుకోవాల‌న్నా టాలెంట్ ను ఒడిసిప‌ట్టుకోవ‌డ‌మే కీల‌క‌మ‌న్న‌ది సీనియ‌ర్ హెచ్ఆర్ నిపుణుల అభిప్రాయం. ప్ర‌స్తుతం ఒక ఉత్ప‌త్తిని ప్ర‌వేశ‌పెట్టినా లేక కొత్త బిజినెస్ మోడ‌ల్ ను లాంచ్ చేసినా అవి ఎక్కువ రోజులు మ‌నుగ‌డ సాగించ‌లేక‌పోతున్నాయి. అందుకే ఆవిష్క‌ర‌ణ‌, అభివృద్ధి అనేది ఒక నిరంత‌ర ప్ర‌క్రియ‌గా మారిపోయింది. కొత్త‌గా ఆలోచించకుంటే కంపెనీలకు మ‌న‌గ‌డ అన్న‌దే లేని ప‌రిస్థితులు నెల‌కొని ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిభ క‌లిగిన ఉద్యోగులను నియ‌మించుకోవ‌డం, వారిని జాగ్ర‌త్త‌గా కాపాడుకోవడం కంపెనీల‌కు అనివార్యంగా మారింది. నాణ్య‌త‌ను, ప్ర‌తిభ‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం అన్న విష‌యంలో ఏ కంపెనీ స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటుంటే ఆ కంపెనీయే మార్కెట్లో ముందు ఉంటుంది.

ప్ర‌తిభ ఉన్న‌వాళ్ల‌ను ఎలా గుర్తించాలి!

ప్ర‌తీ కంపెనీలో అర్ధ‌వంతంగా ప‌నిచేసే కొందరు ఉద్యోగులు ఉంటారు. వీరు సంస్థ‌పై న‌మ్మ‌కముంచి సంస్థ‌కు త‌మ వ‌ల‌న లాభం చేకూరాల‌న్న దృక్ఫ‌ధంతో ప‌నిచేస్తారు. స‌వాళ్ల‌ను స్వీక‌రించేందుకు, కొత్త విష‌యాల‌ను నేర్చుకునేందుకు వీరెప్పుడూ స‌దా సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా త‌మ వృత్తికి గౌర‌వం ఇచ్చుకుంటూనే అదే స‌మ‌యంలో కంపెనీ ఉన్న‌తి కోసం పాటుప‌డతారు. ముఖ్యంగా కంపెనీకి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన ప‌నుల‌ను నేర్చుకునేందుకు, వాటిని విజ‌యవంతంగా అమ‌లు చేసేందుకు పూర్తి సంసిద్ధులుగా ఉంటారు. అయితే ఇటువంటి ఉద్యోగుల‌ను గుర్తించ‌డం అన్న‌ది కంపెనీ ముందున్న అతిపెద్ద స‌వాలు. ఇచ్చిన ప‌నిని నిజాయితీతో చేయ‌డం, కంపెనీ ల‌క్ష్యాల‌ను త‌న ల‌క్ష్యాలుగా భావించ‌డం, వృత్తిగ‌త జీవితాన్ని వ్య‌క్తిగ‌త జీవితాన్ని సమ‌న్వయం చేసుకోవ‌డం, మానిసికంగా చాలా ఆరోగ్యంగా ఉండ‌టం ఇటువటి ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని ఒడిసిప‌ట్టుకునేందుకు వారిని కాపాడుకునేందుకు టాలెంట్ మేనేజ్ మెంట్ నిపుణులు ఏం చేస్తున్నార‌న్న‌దే కీల‌కం.

 

 

ప్ర‌తిభ ఉన్న‌ప్పుడు బ‌ల‌హీన‌త‌ల్ని ప్రేమించ‌డం నేర్చుకోవాలి!

అవ‌స‌రం ఉన్నంత వ‌ర‌కూ ప‌నిచేయించుకుంటార‌ని త‌ర్వాత వాళ్ల‌ను నిర్దాక్ష్యింగా బ‌య‌ట‌కు పంపుతార‌ని కార్పోరేట్ కంపెనీల‌పై ఒక అప‌వాదు ఉంది. అయితే ఇందులో వాస్త‌వం లేకుండా ఈ అప‌వాదు రాలేదు. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వేళ్ల మీద లెక్క‌పెట్ట‌గలింగేంత మంది మాత్ర‌మే ఇప్పుడు టాలెంట్ ను క్ర‌మ‌శిక్ష‌ను, మ‌ర్యాద‌ను క‌లిగి ఉన్నారు. అటువంటి వారిని కాపాడుకోలేకోతే సంస్థ‌కు న‌ష్టం. నైపుణ్యం క‌లిగిన వ్య‌క్తిని కాపాడుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు అతని బ‌ల‌హీన‌త‌ల‌ను కూడా అంగీక‌రించాలి. అత‌ని ప‌ని విధానం, మానసిన ప‌రిణితి, బాధ్య‌త ఇవ‌న్నీ స‌రిచూసుకుని అత‌ని ప్ర‌తిభ‌ను అంచనా వేయాలి. ఈ క్ర‌మంలో ప‌ని విష‌యంలో మంచి ప్ర‌తిభను చూపిస్తూ చిన్న చిన్న లోపాల‌ను క‌లిగి ఉన్నా పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కంపెనీ త‌మ‌ను త‌గిన విధంగా గుర్తిస్తోంద‌ని వారు భావించిన‌ప్పుడు వాళ్లు మ‌రింత ఉత్సాహంతో పని చేస్తారు.

 

 

ప్ర‌తిభను కాపాడేందుకు ప్ర‌త్యేక‌మైన నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌!

 

ఇప్పుడు ప్ర‌తీ కంపెనీ ప్ర‌తిభ ఉన్న ఉద్యోగుల‌ను కాపాడుకునేందుకు ప్ర‌త్యేక‌మైన వ్య‌వ‌స్థ‌ను రూపొందించుకుంటోంది. ఎందుకంటే టాలెంట్ ను గుర్తిస్తే స‌రిపోదు దానికి జాగ్ర‌త్త‌గా కాపాడుకోవ‌డం అన్న‌ది చాలా క‌ఠిన‌త‌ర‌మైన విష‌యం. పోటీ కంపెనీల ప్ర‌లోభాలు, అంత‌ర్గ‌త రాజ‌కీయాలు వెర‌సి ప్ర‌తిభ ఉన్న‌వాళ్ల‌ను చాలా సార్లు ఆలోచ‌న‌లో ప‌డేస్తాయి. అటువంటి స‌మ‌యంలోనే ప్ర‌తిభ నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ కీల‌క పాత్ర పోషిస్తుంది. నిన్ను గుర్తించామ‌ని చెపుతూ అత‌నికి కావాల్సిన ప్రోత్సాహ‌కాల‌ను ప్ర‌క‌టించి అదే స‌మ‌యంలో భ‌రోసాను క‌ల్పించాలి. అప్పుడు అత‌ను మ‌రింత ఉత్సాహంగా సంస్థ కోసం ప‌నిచేస్తాడు. ఇక ఉన్న వాళ్ల‌ను కాపాడుకుంటూనే కొత్తగా వచ్చిన ఉద్యోగుల్లో స్పూర్తిని నింపి వాళ్ల‌ను ప్ర‌తిభావంతులుగా త‌యారు చేసేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాలి. ఉద్యోగుల్లో ఉన్న టాలెంట్ ను గుర్తించి దాన్ని స‌రైన విధానంలో వాడుకునే టాలెంట్ ఉన్న వారే అత్యున్న‌త స్థాయికి చేర‌గ‌లుగుతారు.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్సర్ చేసిన‌వారు)