టీచర్లకు సువర్ణావకాశం..ప్రతిష్టాత్మక అవార్డును పొందే ఛాన్స్!

 

దేశంలోనే ప్రతిష్టాత్మక టీచింగ్ అవార్డు ఐటాప్,ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతీ ఏడాది అత్యుత్తమ ఉపాధ్యాయులకు ఐటాప్ అవార్డులను అందజేస్తున్న ప్రముఖ ఆన్‌లైన్ ట్యూటరింగ్ సంస్థ ట్యూటర్స్ ప్రైడ్, 2019 సంవత్సరానికి గానూ ఎంపిక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఐటాప్ 2019 అవార్డును పొందగోరు ఉపాధ్యాయులకు కొన్ని అర్హతలను, కొన్ని లక్ష్యాలను నిర్ధేశించి దానికి అనుగుణంగా ఈ మార్గదర్శకాలను ట్యూటర్స్ ప్రైడ్ సంస్థ రూపొందించింది. భోధనా రంగంతో పాటు విభిన్న రంగాల్లో విశేషానుభవం గడించిన ప్రముఖ వ్యక్తులతో ఇప్పటికే ఒక ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది. ఎంపిక కమిటీ నిర్దేశించిన ప్రమాణికతల ఆధారంగా ఐటాప్ అవార్డుల మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది.

 

 

మార్గదర్శకాలు

1. అవార్డును పొందగోరు ఉపాధ్యాయులు అత్యుత్తమ పనితీరు కనబర్చినవారై ఉండి భోధనా రంగంలో తమదైన ప్రత్యేకతను కలిగి ఉండాలి.
2. ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే వారి స్కూల్స్ లో డ్రాపవుట్స్ ను తగ్గించి, ఫలితాల్లో మంచి పనితీరును కనబర్చిన వారై ఉండాలి.
3. విద్యార్ధుల్లో లక్ష్యసాధన పట్ల ఆకాంక్షను రగిలించి స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలపై చైతన్యం తెచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వబడును.
4. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ, హాజరు శాతాన్ని పెంచేందుకు, డ్రాపవుట్స్ ను తగ్గించి గ్రామాల్లో విద్యా భోధనకు కృషి చేస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత.
5. విద్యార్ధులకు చదువుతో పాటు క్రీడలు, సేవ, ఎన్‌సీసీ వంటి విషయాలపై ఆసక్తి పెంచేందుకు కృషి చేస్తున్న వారు అవార్డు పొందడంలో ముందువరుసలో ఉంటారు.
6. స్కూళ్లలో కళలు, సాహిత్య రంగాలను ప్రోత్సాహిస్తూ విద్యార్ధులను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా చేసిన వారు.
7. సైన్స్ ఫెయిర్స్ ను నిర్వహిస్తూ, విద్యార్ధులు వాటిలో పాల్గోనేలా చేస్తూ విద్యార్ధులకు పరిశోధనలపై ఆసక్తి కలిగేలా కృషి చేస్తున్న వారు.
8. అలాగే విద్యార్ధులతో మొక్కలను నాటిస్తూ, హరితహారం వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా విద్యార్ధులను భాగస్వాములను చేసే టీచర్స్ కు ప్రాధాన్యత ఇవ్వబడును.
9. స్కూల్ తో పాటు పనిచేసే ప్రాంతంతో అక్కడి ప్రజలతో మమేకం అవుతూ స్థానిక సమస్యలపై తమ వంతు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు కూడా అవార్డు ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
10. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రయివేట్ ఉపాధ్యాయులు కూడా ఐటాప్ అవార్డుకు దరఖాస్తు చేయొచ్చు.
11. అవార్డుకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులకు కనీసం 5 ఏళ్ల భోధనానుభవం ఉండాలి.
12. అలాగే భోధనతో పాటు భోధనేతర ఉపాధ్యాయులు కూడా ఐటాప్ అవార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

 

ప్రతీ ఉపాధ్యాయునికి ఒక గర్వకారణంగా నిలిచే ఈ మెగా అవార్డుల కార్యక్రమం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న ఘనంగా జరగనుంది. హైదరాబాద్ లో హైటెక్ సిటీ సమీపంలో ఉన్న కోహినూర్ ఐటీసీ హోటల్ లో ఫైవ్ స్టార్ సౌకర్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు //www.itapawards.com వెబ్‌సైట్ ను సందర్శించండి. మెయిల్ itapawards@gmail.com లేదా వాట్సప్ నెంబర్ 8978174444 లో సంప్రదించండి.

 

కేఫ్ కాఫీ డే సిద్ధార్థ మళ్లీ పుడితే…!!

 

నేత్రావతి నది..రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నది మంచి జోరుమీదుంది. బ్రిడ్జిపై నడుస్తున్న సిద్ధార్ధ మనస్సులో ఆలోచనలు కూడా కింద ఉన్న నదిలో నీరులాగే సుడులు తిరుగుతున్నాయి. ‘ఇంక తప్పదు ఈ ఒత్తిడిని నేను భరించలేను. నాకున్న సమస్యలన్నింటికీ ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం’. గట్టిగా ఊపిరి పీల్చుకున్న సిద్ధార్ధ నదిలోకి దూకేందుకు సిద్ధమయ్యాడు. సడెన్ గా అప్పుడే ఆగు అన్న గొంతు వినపడటంతో దూకబోతున్నవాడల్లా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసాడు. ప్రశాంత వదనంతో, మంచి తేజస్సుతో ఒక్క వ్యక్తి తనవైపే రావడాన్ని సిద్ధార్థ గమనించాడు. దగ్గరగా వచ్చిన ఆ వ్యక్తి దేవుడు అని గుర్తించడానికి సిద్ధార్థకు ఎక్కువ సమయం పట్టలేదు. నేరుగా విషయంలోకి వచ్చిన దేవుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావ్? ఆత్మహత్య పాపం అని తెలీదా? అని అడిగాడు. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన సిద్ధార్థ తనకు ఎదురైన కష్టాలు, నష్టాలు, మోసాలు, బెదిరింపులు అన్నీ ఏకరువు పెట్టాడు. కొన్ని తప్పులు, మరికొన్ని పొరపాట్లు తనను ఈ స్థితికి తెచ్చాయని తనకు ఆత్మహత్య కంటే వేరే మార్గం లేదని బోరుమన్నాడు. సావధానంగా విన్న దేవుడు నువ్వు చేసిన తప్పులు, పొరపాట్లు నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చాయి అని చెపుతున్నావ్. ‘సరే నేను నీకు ఒక వరం ఇస్తాను. నీకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాను. ప్రస్తుత నీ సమస్యలు, నష్టాలు ఏవీ నీకు గుర్తుకు రావు. నువ్వు మరో చోట ఒక కొత్త వ్యక్తిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు. హాయిగా జీవించు’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

ఒక కొత్త ప్రదేశంలో మళ్లీ పుట్టి ఒక కొత్త సిద్ధార్థగా తన నూతన జీవితాన్ని ప్రారంభించాడు సిద్ధార్థ. చదువు పూర్తి కాగానే అందరిలా ఉద్యోగం చేసి ఒకరి పనిచేయడం లేని సిద్ధార్థ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా చిన్న స్టార్టప్ ప్రారంభించి రాత్రీ పగలు కష్టపడి దాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. వ్యాపారంలో మెల్లగా కుదురుకోగానే తన పోటీ కంపెనీల్లో కొన్నింటిని టేకోవర్ చేసి దేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్తల్లో ఒకడిగా ఎదిగాడు. తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు బ్యాంకు రుణాలు తీసుకున్నాడు. పబ్లిక్ ఇష్యూకు వెళ్లాడు. స్టాక్ మార్కెట్లో కంపెనీని లిస్ట్ చేయించాడు. కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టాలన్న తొందరలో భారీగా రుణాలు తీసుకున్నాడు. ప్రభుత్వ పన్ను చట్టాలను సరిగా తెలియక కొంత, తెలిస్తే ఏమవుతుంది అన్న నిర్లక్ష్యంతో కొంత పన్ను చెల్లింపుల విషయంలో అజాగ్రత్తగా ఉన్నాడు. ఫలితంగా పలు కేసుల్లో చిక్కుకున్నాడు. ఒకవైపు భారీగా పెరిగిపోయిన రుణాలు, మరోవైపు కేసులు, ఇంకోవైపు దేశంలోనే పెద్ద బిజినెస్ టైకూన్ గా ఉండి ఇప్పుడు నలుగురిలో తలెత్తుకు తిరగ్గలనా అన్న భయాలు వెరిసి ఆత్మహత్య ఒక్కటే శరణ్యమనే నిర్ణయానికొచ్చాడు. మళ్లీ అదే నేత్రావతి నది దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. మళ్లీ వచ్చిన అతని ప్రయత్నాన్ని ఆపిన దేవుడు తను గతంలో ఎవరు? ఇప్పుడు ఎవరు? తను ఏం చేసింది అంతా వివరంగా చెప్పుకొచ్చాడు. చూడు సిద్ధార్థ..ప్రతీ మనిషి తప్పులు చేస్తూనే ఉంటాడు. చేయాలి కూడా. ఎందుకంటే తప్పు చేసిన ప్రతీసారీ కింద పడిన ప్రతీసారీ మనం పైకి లేచి ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. మరోసారి అటువంటి తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉంటాం. జీవితం అంతా ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ఎవ్వరూ అతీతులు కారు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగిపోవడమే జీవితం. నీలా ఆత్మహత్య చేసుకుంటే నేను సృష్టించిన ఈ జగత్తులో ఒక్క ప్రాణి కూడా మనుగడ సాగించి ఉండేది కాదు. తప్పులు చేసి ఎంతగా నష్టపోయినా, ఎంత కిందకు చేరుకున్నా ధైర్యంతో ముందుకు సాగితే జీవితం మనకు ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. మనిషి సృష్టించుకున్న ఈ డబ్బు కన్నా, ఈ వ్యాపార సామ్రాజ్యాల కన్నా ప్రాణం విలువైనది. అది లేకపోతే ఈ ప్రయాణం ఎందుకు? ఈ డబ్బు ఎందుకు? విజయం అనేది మన ఆనందం, సంతృప్తిలో ఉంటుంది కానీ డబ్బులు, వ్యాపార సామ్రాజ్యాలలో ఉండదు.

 

 

ఓపిక, సహనంతో వేచి ఉండాలి!

మనిషి జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఓపికతో వేచి చూడటం. విత్తనం మొక్కలా మారి ఎదిగి మనకు ఫలసాయం అందించాలన్నా, తల్లి కడుపులో ఒక చిన్నారి మనిషిగా రూపుదాల్చాలన్నా కొంత సమయం పడుతుంది. అప్పటి వరకూ ఉత్సాహంతో వేచి ఉండాలి. అలా అని ఒక పనిని ఏదో తూతూమంత్రంగా చేసి మంచి ఫలితాల కోసం వేచిచూడమని కాదు. చేయాల్సిన పనిని నాణ్యంగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా కష్టపడి చేసి దాని ఫలితాల కోసం ఎదురు చూడాలి. కుటుంబంతో అన్ని విషయాలను పంచుకుంటూ వచ్చే ఫలితం కోసం అధికంగా ఆలోచిండచం మాని ఎటువంటి ఫలితం వచ్చినా తీసుకునేందుకు సిద్దంగా ఉండాలి. అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో మనిషి ఒత్తిడిని జయించగలడు. అలా కాకుండా ఒక పని చేసి దాని ఫలితం కోసం ఎదురు చూడటం, ఏం జరగవచ్చని తీవ్రంగా ఆలోచించడం వంటివి చేస్తే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. ఒత్తిడి పెరిగి చివరికి ఆత్మహత్యలకు దారితీస్తాయి. మనిషి కర్తవ్యం ముగిసిన వెంటనే ఫలితాన్ని పరమాత్మ అస్థిత్వానికి విడిచిపెట్టేయాలి. అంటే మూఢంగా దేవుడ్ని నమ్మమని కాదు. తాజాగా చంద్రయాన్ 2 ప్రయోగంలో రాకెట్ ను శక్తివంచన లేకుండా కష్టపడి తయారు చేసిన శాస్త్రవేత్తలు ప్రయోగం ముందు రోజు దేవుని వద్దకు వెళ్లి మోకరిల్లారు. ఎందుకు వారు చేయాల్సిన పనిని 100 శాతం కచ్చితత్వంతో, నైపుణ్యంతో చేసారు. ఫలితం బాగుండాలని దేవుడ్ని శరణు వేడుకున్నారు. దీని వలన ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

 

 

ధైర్యమే జీవితం!

మనం ముందు చెప్పుకున్న దేవుడు, సిద్ధార్థ కథలానే ప్రతీ ఒక్కరి జీవితంలోనూ ఎన్నో అపజయాలు , కష్టాలు, నష్టాలు ఉంటాయి. వాటన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారం కాదు. ఈ కథలోని సారాన్ని ఈ తరం విద్యార్ధులు, ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. సరిగ్గా మార్కులు రాలేదనో, పక్కవాడి కంటే తక్కువ జీతం వచ్చిందనో, ఉద్యోగం పోయిందనో ఇలా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్య అనేది ఎప్పటికీ సమస్యకు పరిష్కారం కాదు. చక్కగా జీవితాన్ని సంపూర్ణంగా గడిపేందుకు దేవుడు మనకు ఈ శరీరాన్ని ఇంత విశాలమైన ప్రపంచాన్ని, ప్రకృతిని ఇచ్చాడు. కింద పడిన ప్రతీసారి లేచే చంటి పిల్లాడిలా ఎప్పటికప్పుడు లేచి కొత్తగా జీవితం అనే పరుగును మొదలుపెట్టాలి. సిద్ధార్థ లాంటి ప్రతిభావంతులకు ఆస్తులన్నీ పోయి కేఫ్ కాఫీ డే వంటి సంస్థలు పోతే ఏమైనా అవుతుందా? మరో కొత్త వ్యాపారం మొదలుపెట్టి తన సామర్ధ్యంతో మరింతగా ఉన్నతంగా ఎదగగలరు. కానీ అప్పటి వరకూ విజేతగా ఉన్న ఆయన ఆత్మహత్య చేసుకుని పరాజితునిగా నిలిచిపోయారు. కష్టాలు వచ్చినా వాటిని ఎదిరించి తలెత్తుకు తిరిగే వారినే దేవుడు, ఈ ప్రకృతి ప్రేమతో అక్కున చేర్చుకుంటాయి. భయపడేవాళ్లకు, బెదిరిపోయే వాళ్లకు, తప్పులు చేసేందుకు తటపటాయించే వారికి ఇక్కడ స్థానం లేదు. విద్యార్ధులూ గుర్తు పెట్టుకోండి. ధైర్యమే జీవితం.

డా. ఆర్‌.బీ. అంకం